బీహార్‌ సీఎంకు బాంబు బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్‌!

Bihar-Policeనవతెలంగాణ – హైదరాబాద్
ఇటీవల‌ దేశంలో పాఠశాలలు, విమానాశ్రయాలు, కార్యాలయాలు సహా పలువురు రాజకీయ నాయకులకు వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ‘అల్-ఖైదా’ పేరుతో పాట్నాలోని సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ శనివారం బెదిరింపు మెయిల్‌ వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఎటువంటి పేలుడు పదార్థాలూ లభించలేదు. దీనిపై కేసున మోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బెదిరింపు మెయిల్‌ ఆధారంగా ఓ వ్యక్తిని తాజాగా అరెస్ట్‌ చేశారు. అనుమానితుడిని కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు. అతడిని బీహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన 51 ఏళ్ల మహ్మద్ జాహిద్‌గా గుర్తించారు. నిందితుడు బీబీ గంగూలీ స్ట్రీట్‌లోని చిన్న దుకాణం న‌డుపుతున్న‌ట్లు తెలిసింది. అతడికి ఏదైనా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయా అన్న దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కోల్‌కతాలోని బౌబజార్ ప్రాంతంలో అరెస్టు చేసిన జాహిద్‌ను ట్రాన్సిట్ రిమాండ్ పొందిన తర్వాత పాట్నాకు తీసుకువస్తామని పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజీవ్ మిశ్రా పీటీఐకి తెలిపారు. సోమవారం కోల్‌కతాలోని బౌబజార్ ప్రాంతంలో పాట్నా పోలీసుల బృందం అతన్ని అరెస్టు చేయ‌డంతో పాటు అత‌ను మెయిల్ పంపిన మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు రాజీవ్ మిశ్రా తెలిపారు.

Spread the love