– అవమాన భారంతో ఒకరి ఆత్మహత్య…
– పండగపూట విషాదం…
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
అప్పు తీసుకున్న పాపానికి అప్పు ఇచ్చిన వ్యక్తి ఇష్టం వచ్చినట్లు నానా బూతులు తిట్టాడని ఓ వ్యక్తి అవమానం భరించలేక పండగపూట ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కెసిఆర్ కాలనీలో పండగపూట విషాదఛాయలుముకున్నాయి. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని కెసిఆర్ కాలనీకి చెందిన దుబాసి సాయికృష్ణ(27) తల్లిదండ్రులు నారాయణ విజయ లతో కలిసి జీవిస్తున్నారు.నూతి అనిల్ అనే వ్యక్తి వద్ద గతంలో రూ.20వేలు తీసుకున్నాడని, తీసుకున్న ఫైనాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు సాయి కృష్ణను వేధించేవాడని, బెదిరింపులకు గురి చేసేవాడని తల్లి విజయ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పండగ పూట శనివారం రోజున కూడా చాలాసార్లు ఫోన్ చేసి ఫైనాన్సు ఇచ్చిన డబ్బులను చెల్లించాలని, డబ్బులు ఎప్పుడు ఇస్తావు రా… అంటూ నానా బూతులు తిట్టాడని, డబ్బులు ఇవ్వకపోతే చంపుతానని బెదిరించి నా కొడుకు సాయి కృష్ణ ఫోన్ ను అనిల్ బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయాడని వివరించారు. దీంతో సాయి కృష్ణ అవమాన భారంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి విజయ ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని, కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. సాయి కృష్ణ మృతికి కారణమైన నూతి అనీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని రేపు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా సరే అధిక వడ్డీలకు డబ్బులు అప్పులుగా ఇచ్చి వారిని వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్సై రామ్మోహన్ హెచ్చరించారు.