– అందని గ్రామాలపై సర్వే
– నియోజకవర్గానికి రూ.కోటి
– కష్ణా, గోదావరితో పాటు కొత్త రిజర్వాయర్ల వినియోగం
– కనెక్టివిటి లేని గ్రామాలకు తారురోడ్లు
– డ్వాక్రాలకు చేయూత
– సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కేవలం గోదావరి, కష్ణా నదుల నుంచే గాక, కొత్తగా నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్‌సాగర్ రిజర్వాయర్లనూ తాగునీటి అవసరాలకు వినియోగించు కోవాలని సూచించారు. అందుకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్దం చేయాలని చెప్పారు. దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తక్కువ ఖర్చుతో తాగునీటి సరఫరా సులభమవుతుందన్నారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివద్ధి శాఖపై సమీక్ష చేశారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ విధులను సర్పంచులకు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇంటింటికీ నీళ్లను అందించే బాధ్యతను వాళ్లకే ఇవ్వాలని చెప్పారు. అందుకు అవసరమైన విధివిధానాలు తయారు చేయాలని అన్నారు. గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసే బాధ్యత మిషన్ భగీరథ శాఖ తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ, నల్లాలు, పైపులైన్ల నిర్వహణ మాత్రం సర్పంచులకే అప్పగించాలని చెప్పారు. ఇప్పటివరకు మిషన్ భగీరథలో చేపట్టిన ఇంట్రా విలేజ్ పనులు, ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేసే నిర్వహణ ఎవరూ పట్టించుకోవటం లేదని వ్యాఖ్యానించారు.
‘జవాబుదారీతనం లేదు’
గ్రామాల్లో తాగునీటి నిర్వహణ అంశం ఎవరి పరిధిలో లేదని అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. జవాబుదారీతనం లేకపోతే గ్రామాల్లో తాగునీటి సమస్య పెరిగిపోతుందని సీఎం అన్నారు. వందకు వంద శాతం రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చినట్టు గత ప్రభుత్వం చెప్పుకోవటంతో నష్టమే తప్ప లాభం లేకుండా పోయిందని సీఎం అన్నారు. దీంతో అవకాశమున్నా, కేంద్రం నుంచి జల జీవన ్‌మిషన్ నిధులు రాకుండా పోయాయని అన్నారు. అందుకే వాస్తవాలను దాచిపెట్టి గొప్పలకు పోవాల్సిన అవసరం లేదని అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలో చాలాచోట్ల తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారనీ, తండాలు, గూడేలు, అటవీ గ్రామాలకు నీళ్లు అందటం లేదన్నారు. ఎన్నికలప్పుడు తాను ఖానాపూర్‌కు వెళితే తాగునీటికి ఇబ్బంది పడుతున్నట్టు చాలా గ్రామాల ప్రజలు తన దష్టికి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలకు, ఎన్ని హాబిటేషన్లకు తాగునీరు అందటం లేదో సమగ్రంగా సర్వే చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నెలాఖరుతో సర్పంచుల పదవీకాలం ముగిసిపోతుందనీ, అధికారులే తాగునీటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని చెప్పారు. సంబంధిత ఇంజినీర్లు అన్ని గ్రామాలకు వెళ్లి నిజనిర్ధారణ బందం చేసినట్టుగానే పక్కాగా తాగునీరు అందని హాబిటేషన్ల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. జలజీవన్ మిషన్ నిధులు రాబట్టుకునేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలని ఆదేశించారు.
ప్రతి అసెంబ్లీకి రూ. కోటి
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్(ఎస్‌డీఎఫ్) కింద కేటాయించిన రూ.10 కోట్లలో రూ. కోటిని తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్నీ ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో లభ్యమయ్యే నీటిని ప్రజల తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యంగా అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలనీ, వాళ్లకు ఆర్థికంగా చేయూతను అందించే కార్యక్రమాలపై దష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థినీవిద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫారాలు కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు. అవసరమైతే తగిన శిక్షణను ఇచ్చి వారిని ప్రోత్సహించాలనీ, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేని422 గ్రామ పంచాయతీలు, 3177 ఆవాసాలకు తారురోడ్లను నిర్మించాలని సీఎం ఆదేశించారు.