మంచోడు మంచోడు అంటే మంచం ఎక్కిపోతండు

లోకం మీద మంచివాల్లు వుంటరు, చెడ్డవాల్లు వుంటరు అయితే అందరు ఎల్లవేళలా మంచిగ కనపడకపోవచ్చు. చెడ్డవాల్లు కూడా అప్పుడప్పుడు మంచి పనులు చేస్తుండవచ్చు. జానపదుల దృష్టిలో మంచీ చెడూ ఎంచి చూసుడు వుంటది. కొందరికి మంచి పనోడు అనే పేరు వచ్చినంక అప్పుడు తిక్క తిక్క పనులు కూడ చెయ్యవచ్చు. ఈయన ఇట్ల చెయ్యడు గద అనుకునే సందర్భంలో ‘మంచోడు మంచోడు అంటే మంచం ఎక్కి పోతండు’ అనే సామెత వాడుతరు. అయితే వాల్లకు కూడా తెల్వయి, వాల్లు పనులు అప్పుడు ‘వాడేమో సక్కని పూస’ లేదా ‘నువ్వేమో సుద్దపూసవా’ అంటరు. ఇదే సందర్భంలో ‘గురిజ అంత ఎర్రగ వుంటది అనుకుంటది గని దాని కింద నల్లగున్నది తెల్వది’ అనే వ్యాఖ్యానం కూడా వస్తది. చెడు వాల్లను అనే దగ్గర ‘మంచి మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ’ అనే సామెతను వాడుతరు. మాటలు, సూచనలు సలహాల తోనే నేర్చుకునేవాల్లు వుంటరు. కొందరు చెప్పినా వినరు వాల్లను దృష్టిలో పెట్టుకుని గొడ్డు కొక దెబ్బ అంటరు. గొడ్డు అంటే పశువు అని అర్ధం. కొందరు మనుషులను చూస్తే అబ్బోవాడు ‘విషపు పురుగు’ అంటరు. వాళ్ళ వ్యక్తిత్వం, పనులు, ఇరుగు పొరుగు వాల్లతోనే గాకుండా ఇంట్ల కుటుంబంతోనూ అట్లనే వుంటరు. ఎవరూ పుట్టంగనే మంచి వాల్లు చెడ్డవాల్లు అని పుట్టరు. పెరిగిన పరిసరాలు, వాతావరణం ప్రభావాలు చూపించవచ్చు. ఇంకా కొందరు ఎంత మంచి వాల్లో తర్వాత తెలుస్తుంది. అందుకే ‘మంచి మరణంలో తెలుస్తుంది’ అంటారు. కొందరు మరణిస్తే మౌనంగానే వుంటరు, కొందరు చనిపోతే అయ్యో అయ్యో ఎంత మంచివాడు అని బాధపడుతుంటరు. మనిషితనం, మర్యాద పరులకు సహాయం చేసే తత్వం, ఇతరులకు ఇచ్చే సంస్కృతి కొందరికి వస్తుంది. వాల్ల ప్రభావం వల్ల ఇతరులు నేర్చుకుంటరు. జీవితం కొనసాగుతది. భూమి మీదికి వచ్చిన తర్వాత నాలుగు మంచి మాటలు, నాలుగు మంచి పనులు, నలుగురికి సహాయం చేసినప్పుడే లోకం మీద మంచి అన్నది మిగులుతుంది. లేకుంటే అంతా లొల్లిలు, కొట్లాటలు, అహంకారాలు, పెత్తనాలు, అణిచితేతలు కొనసాగి మనుషుల మనసుల్లో రసాయనాలు తయారై మానసిక శాంతి కరువు అయితది. అందుకే మంచి మనుషులకు, మంచి సమాజానికీ జయహోలు
– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love