నవతెలంగాణ-హైదరాబాద్ : సినీ నటుడు మంచు మనోజ్ గాయపడ్డారు. ఆయన కాలికి గాయవడంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. ఆస్పత్రి వైద్యులు మనోజ్‌కు పరీక్షలు నిర్వహించారు. ఆయన వెంట సతీమణి మౌనిక కూడా ఉన్నారు. సమాచారం తెలుసుకున్న మీడియా వర్గాలు ఆస్పత్రి చేరుకుని మనోజ్‌ను ప్రశ్నించగా, ఇరువురూ స్పందించలేదు. నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ మనోజ్ ఆస్పత్రి వెళ్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది.
ఆస్తుల విషయంలో మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్ మధ్య గొడవ జరిగిందని, ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారంటూ ఆదివారం ఉదయం వార్తలు వచ్చాయి. మనోజ్ గాయాలతో వచ్చి మరీ కంప్లైంట్ చేశారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు కుటుంబం స్పందించింది. అసత్య ప్రచారాలు చేయొద్దంటూ ఆ వార్తలు రాసిన మీడియాకు సూచించింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మనోజ్ కాలి గాయంతో ఆస్పత్రికి రావడంతో అటు ఇండస్ట్రీలో, ఇటు మీడియాలోనూ మరోసారి చర్చనీయాంశమైంది.