శాట్స్‌ పరిధిలోకి మండల క్రీడా ప్రాంగణాలు

– అధికారులకు క్రీడామంత్రి, శాట్స్‌ చైర్మెన్‌ ఆదేశం
హైదరాబాద్‌ :
మండల స్థాయిలో క్రీడా ప్రాంగణాలు ఇక నుంచి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) పర్యవేక్షణలోకి రానున్నాయి. ఈ మేరకు మండల కేంద్రాల్లో క్రీడా ప్రాంగణాలు గుర్తించి, వాటిని శాట్స్‌ పరిధిలోకి తీసుకురావాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం క్రీడామంత్రిత్వ శాఖ సిఎం కప్‌ నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. ’18 క్రీడాంశాల్లో పోటీలు విజయవంతం చేసేందుకు సంబంధిత క్రీడ రాష్ట్ర సంఘాల ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి. మండల స్థాయిలో క్రీడా ప్రాంగణాలను గుర్తించి వాటిని శాట్స్‌ పరిధిలోకి తీసుకురావాలి. జిహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ విభాగం శాట్స్‌ యంత్రాంగంతో సమన్వయం చేసుకుని సిఎం కప్‌ను విజయవంతం చేయాలని’ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా సహా శాట్స్‌ ఉన్నతాధికారులు, సాంస్కృతిక శాఖ అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love