నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
ప్రకాశంశర్మ ఆశయంతో, నేటి యువత ప్రజా సమస్యల పరిష్కారం కోసం మతోన్మాద విదానాలపై, పోరాటలకు సిద్ధం కావాలని, సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు సోమవారం, భీమగాని మల్లయ్య గౌడ్ 15 వ వర్ధంతి సభ నిర్వహించారు. ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ.. నాటి తెలంగాణ పోరాట స్ఫూర్తినీ, నేటి యువత కొనసాగించాలని, భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, ప్రజా చైతన్యంతో రజాకార్లను తరిమికొట్టి, పేదలచేత బందూకులు పట్టించి, బానిసత్వ నిర్మూలన కోసం, ఉద్యమాలు నిర్వహించిన ఘనత, వీరతెలంగాణ విప్లవ పోరాటానికి ఉందని అన్నారు. మహోన్నత మైన ఉద్యమాల ద్వారా అనేక గ్రామాలు, నైజాం నవాబుకు వ్యతిరేకంగా ఎదురొడ్డి, వెట్టిచాకిరి నుండి, విముక్తి చేయడమే కాక, వేల ఎకరాల భూమి పంచిన, వీర చరిత్ర, కమ్యూనిస్టులకు, ఎర్ర జెండాకు ఉందని అన్నారు. పేదల కష్టాలు, దోపిడీ, ఉన్నంతవరకు, రైతు, ప్రజా సమస్యల పై, వామ పక్షాలు ఉద్యమాలు నిర్వహించాలని, ఎర్ర జెండా ద్వారానే పేదల బ్రతుకులు మారుతాయని, అన్నారు. గ్రామాలలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరచి, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా, ప్రతి కార్యకర్త, దృడసంకల్పంతో, అమరుల ఆశయ సాధన కోసం కృషి చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బబ్బురి పోశెట్టి, మాజీ సర్పంచులు భీమగాని రాములు గౌడ్, భీమగాని మాధవి, పత్తి నర్సింలు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు జోగు యాదగిరి, పాల సంఘం చైర్మన్ జోగు శ్రీనివాస్, భీమగాని మల్లయ్య గౌడ్ కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.