వర్షం దెబ్బకు మామిడి రైతు అతలాకుతలం

– నాణ్యత లోపంతో నష్టాల పాలు
ప్రభుత్వం ఆదుకోవాలన వేడుకోలు
నవతెలంగాణ-గోవిందరావుపేట
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలవ్యాప్తంగా సుమారు 2వేల ఎకరాలకు పైగా రైతులు మామిడి తోటలు సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం మామిడి కాపు అధికంగా ఉండడంతో తోటలు పట్టిన వారు ఆశలు పెట్టుకున్నారు. తెగుళ్ల బారీ నుంచి తోటను రక్షించేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఫలితంగా ఒకటి రెండు పర్యాయాలు కొంతమంది మామిడి కాయలను మార్కెట్‌కు తీసుకెళ్లగా మంచి ధర పలికిందని రైతులు పేర్కొంటున్నారు. మరింత రేటు పలుకుతుందనే దశలో అకాల వర్షాలు నష్టాల పాలు చేస్తున్నాయి. గత రెండు పర్యాయాలు వర్షాలు వరుసగా పడడంతో కాయలు నల్లబడి పురుగుచేరి నాణ్యత దెబ్బతింది. కాయల్లో పురుగు రావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.దీంతో రైతులు తోటలు పట్టిన గుత్తేదారులు లబోదిబోమంటున్నారు. మండల పరిధి చల్వాయి గ్రామం జిల్లెల్లగడ్డ ప్రాంతంలో శేషులు, మురళికి సంబంధించిన తోటలను పట్టిన గుత్తేదారు కోయకుండానే తోటలను వదిలివేశారు. నాణ్యత లేకపోవడంతో కోసిన కూళ్లు ట్రాన్స్‌పోర్ట్‌ భారం భయంతో తోటలను వదిలేసినట్లు పేర్కొంటున్నారు. గత సంవత్సరం కాపు తక్కువగా ఉన్న ధర ఉండటంతో లాభాలు వచ్చిన మాట వాస్తవమేనని, ఈసారి కాపు అధికంగా ఉన్నా పనికిరాకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారు. కేవలం వర్షాల వల్లే ఇలా జరిగిందని ఇప్పుడు చేసేదేమీ లేక తోటలను వదిలేస్తున్నామని వాపోతున్నారు.
పెట్టుబడి రూ.20 లక్షలు… రూ.2లక్షలు కూడా రాలే…
ఈ సంవత్సరం రూ.20 లక్షలతో తోటలు పట్టాం. పూత దశ నుండి నేటి వరకు కాపలా కూలీలకు మొత్తం రూ.25లక్షలకు పైగా ఖర్చు వచ్చింది. ఈ సంవత్సరం మొదటి దఫా కాయలు విక్రయించినప్పుడు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలు చేతికి వచ్చాయి. బంగినపల్లి మామిడి రకం నాణ్యత లేకుండా పోయింది. దీంతో మార్కెట్‌లో డబ్బులు ఇచ్చేందుకు వ్యాపారులు తిరకాసు పెడుతున్నారు. నాణ్యత లేదని కాయ మచ్చ వచ్చిందంటూ డబ్బులు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా మామిడి రైతుల బాధలను గుర్తించి కోయని కాయలను సర్వే చేసి న్యాయం చేయాలి.
– మహ్మద్‌ మాషూక్‌, గోవిందరావుపేట

Spread the love