నష్టాల్లో మామిడి రైతులు…

వాతావరణ మార్పులు, ఎర్రనల్లి
– తెగులుతో కానరాని పూత, కాత
– సరిపడా నీరులేక సరైన సైజుకు రాని కొద్దిపాటి కాయలు
– తీవ్ర నష్టాల్లో రైతులు, కౌలుదారులు
నవతెలంగాణ-దోమ
ఈ ఏడాది మామిడి తోటల్లో సరైనపూత, కాత లేకపోవడంతో మామిడి రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. దోమ మండలంలోని పలు గ్రామాల్లో నేడు తోటల్లో సరైన కాయలు లేక వెలవెల బోతున్నాయి. గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న మామిడి రైతులకు, కౌలుదారులకు ఈ సీజన్‌లో తెగుళ్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దోమ మండలంలో దాదాపుగా వందల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఉన్న మామిడి తోటల్లో ఒక్కో ఎకరంలో పట్టుమని పది చెట్లు కాతకు రాలేదు. మామిడి దిగుబడిపై ఆశతో ముందస్తుగా తోటలను కౌలుకు తీసుకున్న వ్యాపారులు కాతపై ఆశలు అడుగంటడంతో రైతులకు ఇచ్చిన అడ్వాన్‌లను వదులకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి ఏడాది టన్ను ధర రూ.20 నుంచి రూ.50వేల వరకు ఉండే మామిడి ఈ ఏడాది అతంగా కాత లేకపోవడంతో మార్కెట్‌లో మామిడి ధర కాయ నాణ్యతను బట్టి రూ.40వేల నుంచి రూ.70వేల వరకు ఉందని, ఫిబ్రవరిలో టన్ను ధర లక్ష ఉన్నదని రైతులు చెబుతున్నారు.
ఎర్రనల్లి తెగులుతో నిలవని పూత, పిందెలు
ప్రతి ఏడాది డిసెంబర్‌ నెలలో పూతకు వచ్చి జనవరి నెలలో పిందె పడుతుంది. కానీ ఈ సంవత్సరం జనవరి చివరి వరకు చాలా చోట్ల పూత రాలేదు. దీంతో రైతుల్లో, కౌలుదారుల్లో గుబులు మొదలైంది. తరువాత ఫిబ్రవరి, మార్చిలో అక్కడక్కడ పూత వచ్చినా అది పిందదశకు రాకుండానే రాలిపోయింది. ఒక ఎకరం తోటలో 30 నుంచి 35 చెట్లు ఉంటే వాటిలో ఐదు నుంచి పది చెట్లు మాత్రమే కొద్దిగా కాపుకు వచ్చాయని రైతులు అంటున్నారు. వాతావరణ మార్పులతో పాటు, ఎర్రనల్లి పురుగు తీవ్రతతో మామిడితోటల్లో వచ్చిన పూత, పిందె రాలిపోయిందని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా మార్కెట్‌ విలువ ఉన్న బంగినపల్లి, రసాలు ఎక్కడ కాయలేదు. కొన్ని చోట్ల ఇప్పుడే పిందెలు వచ్చిన అవి కూడా ఫలంగా ఎదగడం కష్టమని రైతులు అంటున్నారు.
కౌలుదారుల కలవరపాటు..
మామిడి తోటలను సాధారణంగా రైతులు వ్యాపారులకు కౌలుకు ఇస్తుంటారు. ప్రతి సంవత్సరం పూత, పింద దశలోనే వ్యాపారులు రైతులతో ఒప్పదం చేసుకొని అడ్వాన్సులు ఇస్తుంటారు. ఎకరంలో 30నుంచి 35వరకు చెట్లు ఉంటాయి. వాటికి కౌలుదారులు తోట, చెట్ల వయస్సును బట్టి రూ.45వేల నుంచి రూ.55వేలకు తీసుకుంటారు. ఈ సంవత్సరం పూత కొంత ఆలస్యమైనా మార్చి మొదటి వారంలో కూడా వస్తుందిలే అనే భరోసాతో పలువురు వ్యాపారులు రైతులకు ముందస్తుగా కొంత అడ్వాన్సులు చెల్లించారు. మార్చి నెల పూరైనా పూత,కాత రాకపోవడంతో వారు ఆశలు వదులుకున్నారు.

ఎర్రనల్లి తెగులుతో కాతలేదు
పది సంవత్సరాలుగా మామిడి కౌలు తోటలను తీసుకుంటున్నాను. గతంలో ఎన్నడు లేని విధంగా మామిడితోటలపై వాతవరణ, ఎర్రనల్లి తెగులు ప్రభావం పడింది. నల్లిపురుగుతో పూసిన కొద్ది పూత రాలింది. 10 ఎకరాల వరకు తోటలను కౌలుకు తీసుకున్నాను. ఎకరానికి కౌలు, పెట్టుబడి కలిపి రూ. లక్ష వరకు పెట్టాను. ఈ సారి తోటలను చూస్తుంటే కౌలు కూడా రాని పరిస్థితి కనబడుతుంది.
– రహీమ్‌, కౌలుదారుడు, దోమ

పంట ఆశజానకంగా లేదు
ప్రతి ఏడాది నానా అవస్థలు పడుతు మామిడి చెట్లను సాగు చేస్తున్నాం. మామిడి పంట దిగుబడి కోసం ఎంతో ఆశతో లక్షలు అప్పులు పెట్టుబడి పెట్టాము. తీరా చూస్తే వాతావరణ పరిస్థితుల వల్ల మామిడి చెట్లకు పిందె, కాయ దశలోనే నెల రాలుతున్నాయి. లక్షలు వెచ్చించం ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది.
– నర్సిములు, కౌలుదారుడు, లింగన్‌పల్లి

తెగుళ్లపై అవగాహన కల్పించాలి
మామిడి తోట్ల పెంపకంపై సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి మా మిడి తోట పెంపకంలో అధికా రులు అవగాహన కల్పిం చడం లేదు. మామిడి చెట్లకు పూత వచ్చే సమయంలో అధికా రుల పర్యవేక్షణ అవసరం. నేట ికైనా అధికారులు మామిడి తోట్లను సందర్శించి వాతావరణ పరిస్థితుల వల్ల చెట్లకు వచ్చే తెగుళ్ల, వివిధ రకాల సమస్యపై అవగాహన కల్పించాలి.
– సి.బిచ్చిరెడ్డి, రైతు దోమ

Spread the love