మణిపూర్‌ మంటలతో చలి కాచుకుంటున్నారు

–  కేంద్రంపై కేటీఆర్‌ ఆగ్రహం
–  ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణే మేటీ
–  అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సమాధానం
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వరద సాయం చేయరు…
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే వరద సాయం చేయడు.. బురద రాజకీయం మాత్రం పక్కా చేస్తడు అని కిషన్‌ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానిం చారు. హైదరాబాద్‌ నగరంలో ఎస్‌ఆర్‌ డీపీ పనుల పురోగతిపై సభ్యులు అరికె పూడి గాంధీ, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాధ వరం కృష్ణారావు, నాగేందర్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానమి చ్చారు. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు అనేది సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక అని కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ మహానగరం ఒక విశ్వనగరం కావాలనే పటిష్టమైన ఆలోచనతో సీఎం ఈ ప్రోగ్రాం తీసుకున్నారు. ఎస్‌ఆర్‌డీపీ మొదటి దశ కింద ప్లైఓవర్లు, అండర్‌ పాస్‌ వంటి కార్యక్రమాలు 35 పూర్తి చేశాం. ఎల్‌బీనగర్‌, శేరిలింగంపల్లి, మల్కాజ్‌గిరి, ఉప్పల్‌, రాజేంద్రనగర్‌లో ఎటు వైపు వెళ్లినా ఎస్‌ఆర్‌డీపీ పనులు జరుగుతున్నాయి. కేసీఆర్‌ ప్రభుత్వం సమర్థతకు మేం పూర్తి చేసిన 35 ప్రాజెక్టులు నిదర్శనం. మోడీ ప్రభుత్వం అసమర్థతకు, చేతకానితనానికి నిదర్శనం ఉప్పల్‌, అంబర్‌పేట ప్లైఓవర్లు. నేను ఉట్టిగనే అభాండాలు వేస్తలేను. ఉప్పల్‌ ప్లైఓవరు మేం నిర్మిస్తామని చెప్పాం. కానీ మేమే కట్టాలి.. ఇది నేషనల్‌ హైవే అని వాళ్లే తీసుకున్నారు. రూ. 190 కోట్ల ఖర్చుతో పూర్తి చేసి వారి చేతుల్లో పెట్టాం. మంచినీళ్లు, కరెంట్‌ వంటి సౌకర్యాల కోసం జీహెచ్‌ఎంసీ రూ.37.86 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ ఇక్కడి నుంచి ఎంపీగా కొనసాగుతున్న వ్యక్తి మాత్రం వరదలు వస్తే వరద సాయం చేయడు.. బురద రాజకీయం మాత్రం పక్కా చేస్తడు. ఆయన సొంత నియోజకవర్గంలోని అంబర్‌పేట ప్లైఓవర్‌ను పట్టించుకోవడం లేదు. దీని కోసం 262 ప్రాపర్టీలను 149 కోట్ల 90 లక్షల తో పూర్తి చేసి అప్పజెప్పం. కానీ అది కూడా నిర్మించే చేతకాదు. బయట డైలాగులు కొట్టడం కాదు.. ఇక్కడ ఉండి ప్రభుత్వం చెప్పే సమాధానాలు వినే ఓపిక ఉండాలి. చర్చల్లో పాల్గొనే ఓపిక ఉండాలి. మీడియా వద్ద స్టేట్‌మెంట్లు ఇచ్చుడు కాదు.. దీన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు.
ఎస్‌ఆర్‌డీపీ రెండో దశ కూడా విజయవంతంగా పూర్తి చేస్తాం. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే..పూర్తి చేసేది మన ప్రభుత్వమే. ఈ విషయంలో ఎవరికి ఆందోళన అవసరం లేదు అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల్లో మొత్తం పది ప్రశ్నలకుగాను కేవలం ఐదు ప్రశ్నలపై మాత్రమే చర్చ చోటుచేసుకుంది. మిగతా వాటిని సమాధానం చెప్పినట్టుగా భావించాలని స్పీకర్‌ రూలింగ్‌ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం తరపు నుంచి ఆయా బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు. అలాగే స్పీకర్‌ పలువురు మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం ప్రకటించారు. ఖైరతాబాద్‌కు చెంది కె.విజయరామారావు, మెట్‌పల్లి కొమిరెడ్డి రాములు, మక్తల్‌ కొత్తకోట దయాకర్‌రెడ్డి, దొమ్మాట సోలిపేట రామచంద్రారెడ్డి, ఆదిలాబాద్‌ చిల్కూరి రామచంద్రారెడ్డికి సభలో సంతాపం తెలియజేశారు.
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌
మతం పేరిట మంటలు పెట్టి.. గురుగ్రామ్‌ లాంటి గొప్ప ఐటీ సెంటర్‌ను నాశనం చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మతాల పంచాయితీ లేదు, కులాల మధ్య కొట్లాట లేదని స్పష్టం చేశారు. దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు కేసీఆర్‌ ఉండటం వల్లే అభివద్ధిలో దూసుకుపోతున్నాం. దేశంలో ఉన్న ఐటీ పురోగతితో పోలిస్తే.. మన ఐటీ నాలుగు రెట్లు అధికంగా ఉందని వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఐటీ పురోభివృద్ధిపై సభ్యులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, నోముల భగత్‌, బీగాల గణేష్‌, అక్భరుద్ధీన్‌ ఒవైసీ అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. హైదరాబాద్‌లో ఐటీని తామే అభివద్ధి చేశామని కొంతమంది చెప్పుకుంటారు. కానీ మేం అలా కాదు. ఇక్కడ 1987లోనే తొలిసారిగా ఐటీ కంపెనీ ప్రారంభమైంది. బేగంపేటలోని ఇంటర్‌ గ్రాఫ్‌ సంస్థ. అది మొట్టమొదటి ఐటీ భవనం. 1987 నుంచి 2014 వరకు అంటే 27 ఏండ్లలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ. 56 వేల కోట్లు ఉంటే.. ఒక్క గతేడాదిలోనే రూ. 57 వేల కోట్లకు చేరుకున్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నిన్న కోకాపేట భూములకు వేలం నిర్వహిస్తే ఎకరం భూమి ధర రూ. 100 కోట్లు పలికింది. కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ఆ కుంభకోణం అని, ఈ లంబకోణం అని, ధరణిలో ఏమో జరిగిపోయిందని పనికిమాలిన మాటలు మాట్లాడుతు న్నారు. కానీ ఇవాళ రికార్డులన్నీంటిని బద్దలుకొడుతూ అనుమానాలను చెరిపేస్తూ ఒక్కో ఎకరం రూ. 100 కోట్లు పలికే పరిస్థితి వచ్చింది. ఊరికేనే డైలాగులు కొడితేనో, బయటపోయి ధర్నాలు చేస్తేనో ఇలాంటివి జరగవు. రాష్ట్రంలో అద్భుతమైన పురోగతి జరుగుతున్నది. దీనికి రెండు కీలకమైన అంశాలు అవసరం. అవి స్టేబుల్‌ గవర్నమెంట్‌, ఏబుల్‌ లీడర్‌షిప్‌. నిజంగా చెప్పాలంటే కేసీఆర్‌ తెలంగాణకు శ్రీరామరక్ష. ఇవాళ హర్యానాలో ఏంజరుగుతున్నది.. గురుగ్రామ్‌ గొప్ప ఐటీ సెంటర్‌.. దాన్ని అక్కడున్న వారు నాశనం చేస్తున్నారు. అక్కడ కూడా పనికిమాలిన మతం పేరు మీద పంచాయితీలు పెట్టి.. గబ్బులేపి ఉన్నవారిని పారిపోయే విధంగా దరిద్రపు కార్యక్రమాలు చేస్తున్నారు. మణిపూర్‌లో ఏం జరుగుతోంది. మతాల పేరు మంటలు సష్టిస్తున్నారు. ఆ మంటలతో చలికాచుకుంటున్నారు. దేశంలోని ఐటీ పురోగతి కంటే.. మన రాష్ట్రంలోని ఐటీ పురోగతి నాలుగు రెట్లు ఎక్కువగా ఉందన్నారు.
కొత్త రాష్ట్రం వచ్చాక ఆరు లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయని కేటీఆర్‌ తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే చాలా నగరాల్లో ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయని తెలిపారు. పట్టణాలు, నగరాలు ఎదగాలంటే పరిశ్రమలను ఆకర్షించాలి. ప్రతిచోటా అంతర్జాతీయ ప్రమాణాలను తట్టుకొని నిలబడాలి. దేశంలో మొత్తం సష్టించిన సాంకేతిక ఉద్యోగాల్లో 44 శాతం తెలంగాణవే అన్నారు.
30 రోజులు కావాలన్నారు….
శాసనసభలో ప్రతిపక్షాల తీరుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సెటైర్లు వేశారు. సభ 30 రోజులు నిర్వహించాలని డైలాగులు కొట్టారు..కానీ సభలో 30 నిమిషాలు కూర్చునే ఓపిక లేదు అని బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులపై కేటీఆర్‌ గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గురువారం బీఏసీ సమావేశం జరిగిందని గుర్తు చేశారు. శాసనసభ సమావేశాలు 30 రోజులు జరపాలని బీజేపీ నాయకుడు ఉత్తరం రాశాడు. కాంగ్రెసోళ్లేమో 20 రోజులు జరపాలని డిమాండ్‌ చేశారు. కానీ ప్రశ్నోత్తరాల సమయంలో మేమందరం ఉన్నాం. కానీ కాంగ్రెస్‌, బీజేపీల నుంచి ఒకరి చొప్పున మాత్రమే సభలో ఉన్నారు. దీన్ని బట్టి వీరికి ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి, ప్రేమాభిమానాలు తెలుస్తున్నాయి. వీళ్లను ప్రజలు కూడా గమనిస్తున్నారు. వీళ్ల సంగతేందో ప్రజలే చూసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
731 గురుకులాల నిర్వహణకు రూ. 13,528 కోట్లు ఖర్చు
తెలంగాణ రాష్ట్రంలో గత ఏనిమిది ఏండ్లలో 731 గురుకుల పాఠశాలలు, కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్సీ అభివద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. గురుకులాల నిర్వహణకు రూ. 13,528 కోట్ల 6 లక్షలు ఖర్చు చేయడం జరిగిందన్నారు.
ప్రశ్నోత్తరాల సందర్భంగా గురుకుల పాఠశాలల నిర్వహణపై సభ్యులు హరిప్రియనాయక్‌, రసమయి బాలకిషన్‌, షకీల్‌ అహ్మద్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈశ్వర్‌ సమాధానం ఇచ్చారు. గురుకుల విద్యాసంస్థలు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణంగా నిలిచాయనడంలో సందేహాం లేదన్నారు. ఏ ప్రాంతమైతే విద్యావ్యవస్థలో ఉన్నతంగా ముందుకెళ్తుందో.. ఆ ప్రాంతం అన్ని రంగాల్లో అభివద్ధి సాధిస్తుందని సీఎం కేసీఆర్‌ నమ్మారు. ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గురుకులాలు స్థాపించారు. విద్యకు దూరంగా ఉన్న వీరందరికి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. రాష్ట్రంలో గురుకులాలకు ప్రాధాన్యత పెరిగింది.
1971లో నల్లగొండ జిల్లాలోని సర్వేల్‌లో గురుకుల పాఠశాలను స్థాపించారు. ఆ గురుకులంలో చదువుకున్న వారు ఉన్నత స్థానాలకు ఎదిగారు. గత ప్రభుత్వాలు గురుకులాలు స్థాపించినప్పటికీ, వాటిని అభివద్ధి చేయలేదు. పట్టించుకోలేదు. అందుకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకులాలకు కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. 731 గురుకులాలను ప్రారంభించి, సకల సౌకర్యాలు కల్పించారు. పాతవి, కొత్తవి కలిపితే 1022 గురుకుల పాఠశాలలు అద్భుతంగా నిర్వహిస్తున్నాం. పేద విద్యార్థులను దష్టిలో ఉంచుకొని గురుకులాలను ప్రతి సంవత్సరం అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. డిగ్రీ స్థాయిలో గురుకులాలను స్థాపించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రత్యేక కోర్సులను డిగ్రీ కాలేజీల ద్వారా అందిస్తున్నాం. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.
ఆరోగ్యలక్ష్మిలో కోటి 93 లక్షల మందికి లబ్ది: మంత్రి కొప్పుల
రాష్ట్రంలోని అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకం అద్భుతంగా అమలవుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ప్రశ్నోత్తరాల సంద ర్భంగా ఆరోగ్యలక్ష్మి పథకం అమలుపై సభ్యులు పద్మా దేవేం దర్‌రెడ్డి, హరిప్రియనాయక్‌, రాజేందర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధామిచ్చారు. ఈపథకంతో కోటి 93 లక్షల 60 వేల 944 మంది లబ్ధి పొందుతు న్నారన్నారు. మాతా శిశు మరణాలను తగ్గించడమేగాక మందులు అందించి రక్తహీనతను నివారిస్తున్నాం. అంగన్‌వాడీల ద్వారా ఈ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.

Spread the love