బీజేపీ ప్రోద్బలంతోనే మణిపూర్‌ మంటలు

– మహిళలను వివస్త్రలను చేయటమే మోడీ సర్కార్‌ చెప్పే దేశభక్తి
– జాషువా స్ఫూర్తితో మనువాదంపై మహోద్యమం: కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అయిన మణిపూర్‌లో సంఫ్‌పరివార్‌ శక్తుల ప్రోద్బలం తోనే ఆదివాసీ మహిళలను నగంగా ఊరేగించి, సామూహిక లైంగిక దాడి జరిగిందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ ఆరోపించారు.సోమవారం హైదరాబాద్‌లోని కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో సామాజిక విప్లవ కవి గుర్రం జాషువా 53వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల మూలంగా ప్రపంచ దేశాల ముందు భారత్‌ తలదించుకోవాల్సి వస్తున్నదనీ, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అని చెప్పారు. మనువాద సిద్ధాంతాన్ని తలకెక్కించుకున్న సంఫ్‌ుపరివార్‌ శక్తులు దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య అనైక్యతను సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ చూస్తున్నదని తెలిపారు. అది అనుసరిస్తున్న విధానాల వల్ల మానవ మారణ హోమం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మణిపూర్‌ సీఎం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. జాషువా మనువాదంపై గొప్ప సాహిత్య ఉద్యమం నడిపారని గుర్తు చేశారు. కులం వివక్ష , అణిచివేత, సామాజిక రుగ్మతలపై తన కవిత్వంతో ప్రతిఘటించాడని తెలిపారు. ఆయన స్ఫూర్తితో మనువాదంపై మహోద్యమాలు నిర్మించాల్సిన ఆవశ్యకత పెరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్‌ బాబు మాట్లాడుతూ గుళ్లోకి దళితులను ఎందుకు రానివ్వరని జాషువా ప్రశ్నించారని గుర్తు చేశారు. దాన్నుండి పుట్టుకొచ్చిందే ‘గబ్బిలం’ అని తెలిపారు. జాషువా సాహిత్య ప్రపంచంలో ఎప్పటికీ మెరిసే ఒక వేగుచుక్క అని కొనియాడారు. కులం మతం దేశం అభివద్ధికి ఆటంకాలని ఆనాడే ఆయన గ్రహించి సాహిత్య ఉద్యమన్ని నడిపారని తెలిపారు. కుల వివక్ష రూపం మారిందని గుర్తుచేశారు. దానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించటమే జాషువాకు నిజమైన నివాళని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కార్యదర్శిలు టీ నాగరాజు, ఎం అడివయ్య మాట్లాడుతూ జాషువా సాహిత్యాన్ని నేటి విద్యార్థి, యువత చదవాలని సూచించారు. ఆయన స్ఫూర్తితో కుల, మతోన్మాదాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్‌, ఐద్వా మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి మద్దెల వినోద, శశికళ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు సాయి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు

Spread the love