– కేంద్ర మంత్రి ఇంటికి నిప్పంటించిన ఆందోళనకారులు
– గిడ్డంగిని తగలబెట్టిన అల్లరి మూక
ఇంఫాల్ : మణిపూర్‌లో హింస కొనసాగుతూనే వుంది. తాజాగా శుక్రవారం కూడా పలు ఘర్షణలు చెలరేగాయి. ఇంఫాల్ ఈస్ట్ జిల్లా కొంగ్బా వద్ద గల కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్.కె.రంజన్‌సింగ్‌కి చెందిన ఇంటిని గురువారం రాత్రి ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇంటిని చుట్టుముట్టిన ఆందోళనకారులు ఇంటి ఆవరణలోని కొన్ని కార్లు, ద్విచక్ర వాహనాలతో సహా మొత్తంగా ఇంటిని తగలబెట్టారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఔట్‌హౌస్ పూర్తిగా కాలిపోగా, సకాలంలో అగ్నిమాపక యంత్రాలు రావడంతో ప్రధాన ఇల్లు పూర్తిగా తగలబడకుండా కాపాడగలిగారు. పోలీసులు, పేరా మిలటరీ బలగాలు వెంటనే మంత్రి ఇంటికి చేరుకుని ఆందోళనకారులను చెల్లాచెదురుచేశారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. మణిపూర్‌లో ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అందువల్ల వారి పట్ల రాష్ట్ర ప్రజలు చాలా అసంతృప్తిగా వున్నారని ఆందోళనకారులు తెలిపారు.
శుక్రవారం సాయంత్రం గిరిజన కమ్యూనిటీకి చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి గిడ్డంగిని ఆందోళనకారులు తగలబెట్టారు. మణిపూర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌్ (ఆర్‌ఎఎఫ్)తో ఘర్షణ పడ్డారు. ఇతర ఆస్తులపై కూడా దాడికి దిగుతుండడంతో వారిని చెల్లాచెదురు చేయడానికి పోలీసులు బాష్ప వాయు గోళాలు ప్రయోగించారు. ఇంఫాల్ ప్యాలెస్ గ్రౌండ్స్ సమీపంలో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గురువారం సాయుధ కుకీ తీవ్రవాదులు విష్ణుపూర్ జిల్లాలోని ఫౌబక్‌చావో గ్రామస్తులపై దాడి చేశారు. వెంటనే వారిని చెల్లాచెదురు చేయడానికి బాష్పవాయు గోళాలను, పొగ బాంబులను ఉపయోగించారు. ఈ ఘర్షణల్లో కొంతమంది మహిళలు గాయపడ్డారు.
శాంతికి కృషి చేస్తున్నాం
మంత్రి ఆర్.కె.రంజన్ పిటిఐతో మాట్లాడుతూ, జాతుల మధ్య ఘర్షణలు చెలరేగిన మే 3వ తేదీ నుండి రాష్ట్రంలో హింస ఆపడానికి, శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రెండు కమ్యూనిటీల మధ్య అవగాహనా లోపమే ఇందుకు కారణమని వ్యాఖ్యానించారు. కేంద్రం శాంతి కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.
మిజోరామ్‌కు ముఖ్యమంత్రి బీరేన్ హెచ్చరిక
మణిపూర్‌లో ప్రత్యేక పాలనను డిమాండ్ చేస్తున్న సంస్థలను మిజోరామ్ ప్రభుత్వం నియంత్రించకపోతే ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బ తింటాయని మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 80చోట్ల పోలీసులు, పేరా మిలటరీ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు.