మణిపూర్‌ సమస్య మరింత జటిలం

– ప్రత్యేక రాష్ట్రం కోసం కుకీల పట్టు
ఇంఫాల్‌ : మణిపూర్‌లో గత 70 రోజులుగా కొనసాగుతున్న హింసాకాండకు ఇప్పుడప్పుడే శుభం కార్డు పడేటట్లు కన్పించడం లేదు. కాగా సమస్య మరింత జటిలమవుతోంది. ఇప్పటి వరకూ తమకు ప్రత్యేక పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వచ్చిన కుకీ తెగ వారు ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. కుకీ గిరిజనులకు చెందిన అత్యున్నత సంస్థ కుకీ ఇన్పీ మణిపూర్‌ (కేఐఎం) రెండు రోజుల క్రితం సమావేశమైంది. రాజ్యాంగంలోని మూడవ అధికరణ ప్రకారం తమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. తమకు, మైతీలకు మధ్య చిరకాలంగా కొనసాగుతున్న విభేదాలను పరిష్కరించడం ఇక సాధ్యం కాదని తెగేసి చెప్పింది. కాగా హింసాకాండ చెలరేగిన తొలి రోజులలో కుకీ-జోమీ తెగ వారు లేవనెత్తిన డిమాండ్‌కు ప్రస్తుత వైఖరి పూర్తి భిన్నంగా ఉంది. తమ తెగ వారు అధికంగా నివసిస్తున్న ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అప్పుడు జోమీలు డిమాండ్‌ చేశారు. అయితే కుకీలు, మైతీలు సహజీవనం సాగించడం అసాధ్యమని స్పష్టమైపోయిందని, పైగా ప్రత్యేక పాలనా వ్యవస్థ ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కేఐఎం ప్రతినిధి తంగ్‌మిలెన్‌ కిప్‌జెన్‌ చెప్పారు. ఇప్పుడు బలమైన ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు.

Spread the love