
నవతెలంగాణ తిరువనంతపురం: మణిపుర్‌లో చెలరెగిన ఘర్షణలతో విద్యార్థుల చదువుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎంతో మంది విద్యకు దూరమైపోయారు. ఈ నేపథ్యంలో కేరళ చెందిన కన్నూర్ యూనివర్సీటీ మణిపుర్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ముందుకొచ్చింది. అండర్ గ్రాడుయేట్, పోస్ట్ గ్రాడుయేట్ చదవాలనే ఆకాంక్షతో ఉన్న మణిపుర్ విద్యార్థులు తమను సంప్రదించాలని విశ్వ విద్యాలయ ఉపకులపతి డాక్టర్ గోపీనాథ్ రవీంద్రన్ తెలిపారు. మణిపుర్ విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ అంశంపై యూనివర్సిటీ సిబ్బందితో చర్చించిన తరువాతే ఏకాభిప్రాయంతోనే, విద్యార్థుల అవసరాలకు తగ్గట్లుగా యూనివర్సిటీ, యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని వీసీ పేర్కొన్నారు. ‘మణిపుర్‌లో విధ్వంసం జరుగుతున్న కారణంగా ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న వారికి యూనివర్సీటీ ప్రత్యేక సీట్లను కేటాయిస్తుంది. వివిధ ప్రోగ్రామ్‌లలో చేరిన వారికి సైతం వసతి కల్పిస్తాం. ప్రవేశం పొందిన విద్యార్థులు వారి విద్యార్హత పత్రాలను సమర్పించడానికి తగినంత సమయం ఇస్తాం. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రవేశం పొందడానికి మణిపుర్ విద్యార్థి ఒకరు ఆసక్తి కనబర్చారని’ వీసీ వివరించారు.
మణిపుర్ విద్యార్థులు తమకు ప్రవేశాలు కల్పించాల్సిందిగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలను ఇది వరకే సంప్రదించారని కన్నూర్ యూనివర్సీటీ వీసీ డాక్టర్ గోపీనాథ్ రవీంద్రన్ తెలిపారు. గత నెలలో మణిపుర్ రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు తిరువనంతపురంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతిలో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ చర్య తరువాతే మణిపుర్ విద్యార్థులు తనతో సంప్రదింపులు చేయడానికి ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. ఇలాంటి మంచి పనులతో కేరళ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని వీసీ పేర్కొన్నారు.