నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవల త్రిష-మన్సూర్ అలీఖాన్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని భావించానని, కానీ ఆ సీన్ లేకపోవడం తనను నిరాశకు గురిచేసిందని మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నట్టు కథనాలు వచ్చాయి. దాంతో ఈ విలన్ పాత్రల నటుడి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ సందర్భంగా త్రిషకు మెగాస్టార్ చిరంజీవి, కుష్బూ వంటి తారలు మద్దతు పలికారు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను వారు ఖండించారు. మన్సూర్ అలీఖాన్ ఎట్టకేలకు త్రిషకు క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగిందని అందరూ భావించారు. అయితే, ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని మన్సూర్ అలీఖాన్ తాజాగా ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలను ఎడిట్ చేసి, త్రిషపై అసభ్యంగా మాట్లాడినట్టు చూపించారని ఆరోపించారు. తనపై త్రిష, చిరంజీవి, కుష్బూ తదితరులు అవనసరంగా నోరు పారేసుకున్నారని, తనను మానసికంగా బాధించారని పేర్కొన్నారు. వారిపై తాను పరువునష్టం దావా వేస్తున్నానని, క్రిమినల్ కేసు కూడా దాఖలు చేస్తున్నానని మన్సూర్ అలీఖాన్ తెలిపారు.