కూలీలతో ప్రయాణిస్తున్న ఆటో కుక్క అడ్డు రావడంతో అదుపు చేసుకోలేక పోయిన డ్రైవర్ అజాగ్రత్త వలన బోల్తా పడింది. ఇందులో పలువురికి తీవ్ర గాయాలు అవడం, ఐదుగురిని పెద్దాస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఆసుపాక లంబాడా తండాకు చెందిన 11 మంది కూలీలు రోజు వారీ కూలీ పనులు నిమిత్తం బుధవారం ఆటోపై దమ్మపేట మండలం మల్కారం బయలు దేరారు. ఈ క్రమంలో అశ్వారావుపేట – బూర్గంపాడు రోడ్డులో ఊట్లపల్లి సమీపంలోని తిమ్మాపురంలో కుక్క అడ్డు పడటంతో ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో సహా ఆటోలో ఉన్న 11 మంది గాయాలపాలయ్యారు. స్పందించిన స్థానికులు అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విధుల్లో ఉన్న వైద్యులు డాక్టర్ నాగసాయి క్షతగాత్రులకు అందరికీ ప్రధమ చికిత్స అందించారు. ఇందులో చంటి బాబు, రాము, లక్ష్మి, చిలకమ్మ, దేవిలకు తీవ్రగాయాలు కావడంతో ఏరియా ఆస్పత్రికి తరలించారు.