– ఓ ప్రజాప్రతినిధి అనుచరుడు, మరొకరు వీడియో తీసినట్టు అనుమానాలు
– న్యాయం కోసం తహసీల్దార్ కాళ్లపై పడిన రైతు ప్రభాకర్ పిల్లలు
– పొక్లయినర్‌ను సీజ్ చేయాలని ఎస్‌ఐని అభ్యర్థించిన తండ్రి వీరభద్రం
– పది మందిపై కేసు.. ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకోని పోలీసులు
– ఆత్మహత్యపై అనుమానాలు.. ఎవరో ప్రేరేపించినట్టుగా ఆరోపణలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన చింతకాని మండలం పొద్దుటూరు రైతు బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య అనేక మలుపులు తిరుగుతోంది. సమగ్ర దర్యాప్తు నిర్వహించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రైతు ప్రభాకర్ ఆత్మహత్య సమయంలో తీసిన వీడియో వైరల్ అవుతోంది. ఇదిలావుండగా మీడియా ఒత్తిడితో బుధవారం ఈ ఘటనకు కారణమైన ప్రభాకర్ భూమిని పరిశీలించేందుకు వెళ్లిన తహసీల్దార్ అనంతుల రమేశ్‌ను మృతుని పిల్లలు అడ్డుకున్నారు. ఆయన కాళ్లపై పడి ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మరోవైపు పొక్లెయినర్‌ను సీజ్ చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుని తండ్రి బోజెడ్ల వీరభద్రం ఎస్‌ఐ నాగుల్‌మీరాను అభ్యర్థించారు. ఘటనాస్థలిని జిల్లా పరిషత్ చైర్మెన్ లింగాల కమలరాజ్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు బుధవారం పరిశీలించారు. మృతుని కుటుంబసభ్యులను ఓదార్చారు. రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు కారణమైన భూ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు.
పది మందిపై కేసు..
పొద్దుటూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని 276, 277 సర్వే నంబర్లలో పాము చెరువుకు సమీపంలో రైతు ప్రభాకర్, ఆయన కుటుంబసభ్యులకు 7.10 ఎకరాల భూమి ఉంది. ఈ వేసవిలో ప్రభాకర్ తన భూమిలో చెరువు మట్టిపోయించుకున్నాడు. చెరువు శిఖం భూమిలో మట్టిపోయించుకుని సాగు చేస్తున్నాడంటూ మత్స్య సంఘం సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీనిపై కొన్ని రోజులుగా ప్రభాకర్ కుటుంబానికి, మత్స్య సంఘానికి మధ్య వివాదం నడుస్తోంది. తాను మట్టిపోసిన పొలంలో మత్స్య సొసైటీ సభ్యులు పొక్లెయినర్‌తో భారీ గుంతలు తవ్వారనే మనస్తాపంతో ప్రభాకర్ తన పొలంలోనే పురుగుల మందు తాగుతూ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. దీనిపై ఖమ్మం అర్బన్ మండలం ఖానాపురం పోలీసులు పది మంది పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ కేసుకు సంబంధించి ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని సీఐ భానుప్రకాశ్ తెలిపారు.
వీడియో తీసింది ఎవరు?
రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడుతుండగా తీసిన వీడియో సంచలనంగా మారింది. ప్రభాకర్ ఆత్మహత్య సమయంలో అక్కడ ఆయనతో పాటు మరో ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభాకర్ మాట్లాడుతుండగా ఒకతను రికార్డు చేస్తుండగా.. ఆ ఇద్దర్నీ మరో యువకుడు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆ వీడియో పోలీసుల వద్ద ఉన్నట్టు వినికిడి. అయితే ఆ వీడియోలో ఉన్న యువకుల సెల్‌ఫోన్‌లకు పోలీసులు ఫోన్ చేస్తుంటే ఘటన జరిగిన రోజు నుంచి స్విచ్ఛాఫ్ వస్తున్నట్టుగా సమాచారం. వీడియో తీసిన ఈ ఇద్దరిలో ఒకరు ఓ ప్రజాప్రతినిధి అనుచరునిగా పోలీసులు గుర్తించారనే చర్చ సాగుతోంది.