నవతెలంగాణ – హైదరాబాద్: రెండ్రోజుల కిందట ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో 17 మంది నక్సల్స్ మృతి చెందడం తెలిసిందే. అయితే, మృతుల్లో మావో అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా ఉన్నట్టు తాజాగా గుర్తించారు. ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. బడే చొక్కారావు మావోయిస్టు పార్టీలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. చొక్కారావు ఎన్నో ఏళ్లుగా భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. గత 30 ఏళ్లుగా నక్సల్ ఉద్యమంలో కొనసాగుతున్నాడు. బడే చొక్కారావు స్వస్థలం ములుగు జిల్లాలోని కాల్వపల్లి గ్రామం. పెద్ద చదువులు చదవకపోయినా, టెక్నాలజీపై మంచి పట్టు ఉంది. గతంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న హరిభూషణ్ కరోనాతో మరణించడంతో, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అతడి స్థానంలో బడే చొక్కారావుకు బాధ్యతలు అప్పగించింది. బడే చొక్కారావు భార్య రజిత కూడా నక్సల్స్ ఉద్యమంలో ఉండగా, 2023లో పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.