పువర్తి బేస్‌ క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడి

Maoists lightning attack on Puvarthi base camp– ప్రతి దాడి చేసిన పోలీస్‌ బలగాలు
– మరోచోట కాల్పుల్లో మావోయిస్టు మృతి
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా జేగురుగొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల పువర్తి బేస్‌ క్యాంపుపై శుక్రవారం అర్ధరాత్రి మావోయిస్టులు దేసవాలి రాకెట్‌ లాంచర్ల బీజీఎల్‌తో మెరుపు దాడి చేశారు. ఇందుకు సంబంధించి సుకుమా ఎస్పీ కిరణ్‌ చౌహాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టు పార్టీ మోస్ట్‌ వాంటెడ్‌, పీఎల్‌జీఏ బెటాలియన్‌ కమాండర్‌ హిడ్మా స్వగ్రామమైన పువర్తిలో నిర్మించిన బేస్‌ క్యాంపుపై పొదల మాటు నుంచి మావోయిస్టులు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. బీజీఎల్‌తో 15 నుంచి 20 రౌండ్లు దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు సైతం దీటుగా కాల్పులు జరిపారు. అయితే, దాడిలో కొంతమంది మావోయిస్టులు గాయపడటమే కాక.. మృతిచెంది ఉండొచ్చు. ఈ ఘటనలో భద్రతా బలగాలకు ఎటువంటి హానీ జరగలేదు. బేస్‌ క్యాంపు పాక్షికంగా ధ్వంసమైంది. అయితే, ఈ క్యాంపు నిర్మాణం జరిగేటప్పుడే ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హిడ్మా స్కెచ్‌ వేసి ఎన్నోమార్లు పోలీసులను మట్టుపెట్టిన ఘటనలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. తన సొంత గ్రామంలో పోలీస్‌ బేస్‌ క్యాంపు నిర్మించడంతో సుమారు 7 నెలల పాటు మౌనంగా ఉన్న హిడ్మా ప్రణాళిక సిద్ధం చేసి కవ్వింపు చర్యగా రాకెట్‌ రాంచర్లతో మెరుపు దాడి చేశారని అన్నారు. ఈ క్రమంలో పోలీసులు బయటకు వస్తారు, వారందరినీ మట్టుబెట్టొచ్చని వ్యూహం పన్నారన్నారు. కానీ, పోలీసులు ఎంతో వ్యూహాత్మకంగా, సమయస్ఫూర్తితో మావోయిస్టుల దాడిని తిప్పి కొట్టినట్టు చెప్పారు. హిడ్మా గెస్ట్‌హౌస్‌, అతని తల్లి, చెల్లి, బంధు వర్గాన్ని అంతా పోలీసులు అదుపులోకి తీసుకోన్నారని చెప్పారు. దీనిని జీర్ణించుకోని హిడ్మాతో ఎప్పటికైనా పువర్తి బేస్‌ క్యాంపునకు ప్రమాదం పొంచి ఉన్నట్టు స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
చింతగుప్పా అడవుల్లో ఎదురు కాల్పులు
అలాగే, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం చింతగుప్పా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తుమల్పాడ్‌ గ్రామం అడవి-కొండలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతిచెందాడు. కొంట ఏరియా కమిటీ, మావోయిస్టు పీఎల్‌జీఏ బెటాలియన్‌ సభ్యులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు చింతగుప్పా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని క్యాంప్‌ కరిగూడెం నుంచి ఆపరేషన్‌ కోసం బయలుదేరారు. శనివారం ఉదయం 08:30 గంటలకు తుమల్పాడ్‌ గ్రామంలోని జంగిల్‌ పహారిలో పోలీసులను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల ఒత్తిడి పెరగడంతో మావోయిస్టులు అడవి, కొండల ముసుగులో పారిపోయారు. కాల్పుల అనంతరం ఘటణా ప్రదేశంలో మావోయిస్టు మృత దేహంతో పాటు, 3 లైవ్‌ రౌండ్లతో కూడిన పిస్టల్‌, బయోఫెమ్‌ వైర్‌లెస్‌ సెట్‌, బ్లాక్‌ కిట్టు, ఇందులో టిఫిన్‌ బాంబు, గ్రెనేడ్‌, 2 సంఖ్యల బిజిఎల్‌, 4 జెలటిన్‌ రాడ్‌, 4 ఎలక్ట్రిక్‌ డిటోనేటర్‌, కెమెరా ఫ్లాష్‌, బంచ్‌ ఎలక్ట్రిసిటీ వైర్‌, మీటర్‌ బ్లూ కలర్డ్‌ నాటెడ్‌ కార్డెక్స్‌ వైర్‌, ఇతర రోజువారీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సుక్మాలో జిల్లాలో సీనియర్‌ అధికారుల ఆధ్వర్యంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం జరుగుతోందని, అదే క్రమంలో చింతగుప్పా పరిధిలోని ఛోటేకెడ్వాల్‌, బడేకెడ్వాల్‌, సింఘన్‌మడ్గు, తుమల్పాడ్‌, పరిసర ప్రాంతాల్లో కొంటా ఏరియా కమిటీ, పీఎల్‌జీఎల్‌ బెటాలియన్‌కు చెందిన మావోయిస్టులు హతమవుతున్నారని పోలీసులు తెలిపారు.

Spread the love