సివిల్స్‌లో… అమ్మాయిల తడాఖా

ప్రతి రంగంలో అమ్మాయిలు తమ సత్తా చాటుకుంటూనే ఉన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. అందుకు మరో నిదర్శనమే ఇటీవలి యూపీఎస్సీ పరీక్షా ఫలితాలు. మొదటి 25 స్థానాల్లో 14 మహిళలే సొంతం చేసుకున్నారు. అందులోనూ మన తెలంగాణ బిడ్డ ఉమాహారతి మూడో స్థానంలో నిలిచారు. చిన్నపాటి చేయూతనిస్తే ఆత్మవిశ్వాసంతో ఎంత ఎత్తుకైనా ఎదుగుతామని మళ్ళీ మళ్ళీ రుజువు చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా మొదటి నాలుగు ర్యాంకులు సాధించిన వారి అనుభవాలను ఈరోజు మానవిలో తెలుసుకుందాం

పూర్తి మద్దతు ఇవ్వండి ఉమాహారతి… సివిల్స్‌లో మూడవ ర్యాంక్‌ సాధించిన ఈమె మన తెలంగాణ బిడ్డ కావడం మనకు గర్వకారణం. నారాయణపేట జిల్లా ఎస్సీగా పని చేస్తున్న తన తండ్రి వెంకటేశ్వర్లు ప్రోత్సాహం, స్నేహితుల సహకారమే తనకు ఈ విజయాన్ని తెచ్చిపెట్టిందంటారు ఈమె. ఉమ తల్లి శ్రీదేవి గృహిణి. తమ్ముడు సాయి వికాస్‌. అతను ‘ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీస్‌’కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం బాంబేలో జాబ్‌ చేస్తున్నాడు. హైదరాబాద్‌ ఐఐటి నుంచి 2017లో బీటెక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఆమె సివిల్స్‌పై దృష్టి పెట్టారు. ఢిల్లీలో కోచింగ్‌కు వెళ్ళాను. కానీ అక్కడి కోచింగ్‌ తీరు ఆమెకు నచ్చ లేదు. ఏడాది తర్వాత తిరిగి వచ్చి సొంతంగా ప్రిపరేషన్‌ మొదలు పెట్టారు.
మంచి ఉద్యోగమే వచ్చేది
‘గతంలో నాలుగు సార్లు పరీక్షలు రాశాను. కానీ అర్హత సాధించలేకపోయాను. నిజానికి ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్‌ ఐఐటిలో చదివిన నాకు మంచి ఉద్యోగమే వచ్చేది. మా స్నేహితులు చాలా మంది విదేశాల్లో స్థిరపడ్డారు. ఆడపిల్ల కదా పెండ్లి చేసేయవచ్చు కదా అంటూ మా బంధువుల నుండి అమ్మానాన్నలకు ఒత్తిడి ఉండేది. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు నాకిచ్చిన సపోర్ట్‌ ఇంతా అంతా కాదు. నువ్వు సక్సెస్‌ అవుతావని అమ్మ, నాన్న చివరకు తమ్ముడు కూడా చెప్పేవాడు. నా స్నేహితులు కూడా సపోర్ట్‌ చేశారు. చివరకు అదే జరిగింది’ అంటూ తనలోని భావాలను పంచుకున్నారు ఉమా.
ఉత్సాహంగా ఉండగలిగాను
గతం కంటే ఈసారి ప్రయత్నంలో పద్ధతి మార్చుకున్నానని ఆమె చెప్పారు. రోజూ ఏడెనిమిది గంటలు మాత్రమే చదువుకునేవారు. మిగిలిన సమయంలో బ్యాడ్మింటన్‌, యోగాతో పాటు తనకు ఇష్టమైన వంటలు చేసేవారు. ఇదే ఆమెను బ్యాలెన్సింగా ఉంచాయి. అదే పరీక్షల్లోనూ చూపగలిగారు. ప్రతి ఎగ్జామ్‌ రోజున ఒక ఉత్సాహభరిత, ఉద్విగతతో కూడిన ఫీలింగ్‌ ఆవరించిందని ఆమె పంచుకున్నారు. బ్యాలెన్స్‌ చేసుకుంటూ అన్ని ప్రశ్నలనూ రాయగలిగానన్నారు.
మహిళా సాధికారతే లక్ష్యం
        మహిళలు, విద్య ఈ రెండింటిపై నాకు ఆసక్తి ఎక్కువ. వీటిలో కింది స్థాయి నుంచి నాదైన ముద్ర సాధించాలన్నది లక్ష్యం. నాన్న ఉద్యోగ రీత్యా అనేక సార్లు హాస్టల్స్‌లో చదువుకునే పిల్లల్ని కలుసుకుని మాట్లాడేదాన్ని. వాటిని చూసిన తర్వాత అట్టడుగు వర్గాల్లో విద్య, మహిళల పురోభివృద్ధికి సంబంధించి ఏదైనా చేయాలని అనుకుంటున్నాను. తల్లిదండ్రులకు నాదొక మాట… మీ పిల్లల్లో పట్టుదల ఉంది అనుకుంటే నిర్లక్ష్యం చేయవద్దు. విజయం సాధించేవరకు ప్రోత్సహించండి. ఎప్పటికప్పుడు ధైర్యం నూరిపోయండి. ఆర్థికంగా కొంచెం బాగుంటే మరింత సపోర్ట్‌ ఇవ్వండి. నువ్వు విజయం సాధిస్తావని పదేపదే చెప్పండి. నా విషయంలో అదే జరిగింది’ అంటున్నారు ఉమాహారతి.
ప్రజా సేవకే అంకితం ఇషితా కిషోర్‌… సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో మొదటి స్థానం సాధించిన ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌ అయిన ఈమెకు అభినందనలు వెల్లువెత్తు తున్నాయి. శ్రీ రామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ నుండి ఎకనామిక్స్‌ (హానర్స్‌) గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఈమె, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ అంతర్జా తీయ సంబంధాలు ఆప్షనల్‌గా తీసుకుని సివిల్స్‌కి అర్హత సాధిం చారు. 26 ఏండ్ల ఆమెకు ఇది మూడో ప్రయత్నం.
ప్రయాణం చాలా సుదీర్ఘమైనది
‘సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష లో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, చిత్తశుద్ధి ఉండాలి. సివిల్‌ సర్వీసెస్‌ అనే పెద్ద నిర్ణయం తీసుకుంటే తెలివితేటలు ఎంత ఉన్నా సరే చదువు కోసం గంటలు కేటాయించాల్సిందే. ఈ ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. నేనైతే వారంలో 40-45 గంటలు చదువు కోసం కేటాయించాను. మీ లక్ష్యం చేరడం కోసం కష్టపడి పని చేస్తూ ఉండండి. ఈ పరీక్షకు చాలా స్థిరత్వం, క్రమశిక్షణ అవసరం. సమయాన్ని మాత్రం వృధా చేయవద్దు. ముఖ్యంగా మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోండి. మీ వ్యూహాన్ని నిరంతరం పునఃపరిశీలించుకోండి. అదే మిమ్మల్ని విజయం వైపుకు తీసుకెళుతుంది’ అంటారు ఇషితా.
కచ్చితంగా చెప్పలేను
‘సివిల్స్‌లో అర్హత సాధించడం కోసం ఎన్నో కష్టపడ్డాను. అందులో ఏది పని చేసిందో కచ్చితంగా చెప్పలేను. సీరియస్‌గా ప్రయత్నించి మాత్రం మెయిన్స్‌ పరీక్షలలో సాధన చేయడం. పాత ప్రశ్నపత్రాలను సేకరించుకోవడం, వార్తాపత్రికల నుండి నోట్స్‌ తయారు చేసుకోవడం, వాటిని సవరించుకోవడం నిరంతరాయంగా చేశాను. ఇవన్నీ నా విజయానికి సహాయపడ్డాయని నేను భావిస్తున్నాను’ అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
రుణపడి ఉంటాను
తనను నిరంతరం ప్రోత్సహిస్తున్న తన కుటుంబ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను రెండుసార్లు ప్రిలిమ్స్‌ క్లియర్‌ చేయనప్పటికీ ఇంట్లో నాపై నమ్మకంగా ఉన్నారు. ఎన్నో విధాలుగా సహకరించారు. వారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా అభిరుచి పబ్లిక్‌ సర్వీస్‌పై ఉందని నేను భావించాను. పాలన, ప్రజా సేవకు నా సమయాన్ని కేటాయించాలను కుంటున్నాను’ అన్నారు.
తండ్రి భావాలను వదలకుండా…
ఇషితా తండ్రి సంజరు కిషోర్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారి. 2004లో కేవలం ఆరేండ్ల వయసులో ఇషికా తండ్రిని కోల్పోయింది. ఆమె తల్లి జ్యోతి ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేసి పిల్లల్ని పెద్ద చేశారు. ఇషికా అన్నయ్య న్యాయవాది. ”నేను ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ను ఎంచుకున్నాను. ఉత్తరప్రదేశ్‌ కేడర్‌కు నా ప్రాధాన్యం ఇచ్చాను. నేను జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిని. 2012లో సుబ్రోటో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో పాల్గొన్నాను” అని ఆమె చెప్పారు. కిషోర్‌ మహిళా సాధికారత, నిర్లక్ష్యానికి గురైన ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు.
”చిన్న వయసులోనే నాన్నను కోల్పోయాను. అయితే దేశానికి సేవ చేయాలనే నాన్న భావాలు నన్ను విడిచిపెట్టలేదు” అంటూ ఇషికా పంచుకున్నారు. బీహార్‌లోని పాట్నాకు చెందిన ఇషితా హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె లోధి రోడ్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ బాల్‌ భారతి స్కూల్‌ విద్యార్థిని. ఇంటర్‌లో 97.25శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత బీఎస్సీ (ఆనర్స్‌) పూర్తి చేశారు.
స్వీయ అధ్యయనానికే ప్రాధాన్యం గరిమా లోహియా… బక్సర్‌లోని వుడ్‌ స్టాక్‌ స్కూల్‌ నుంచి పాఠశాల విద్యను అభ్యసించారు. ఆమె తండ్రి నారాయణ్‌ ప్రసాద్‌ లోహియా నాలుగేండ్ల కిందట మరణించారు. తండ్రి పోయిన తర్వాత తన లక్ష్యం సాధన కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరికి ఈ విజయాన్ని సాధించగలిగింది. బక్సర్‌లోనే గరిమా కోచింగ్‌ తీసుకుంది. ఇంత మంచి ర్యాంక్‌ వస్తుందని ఊహించలేదని, కరోనా సమయంలో కోచింగ్‌కు వెళ్లలేకపోయానని, అందుకే ఆన్‌లైన్‌ కోర్సు శిక్షణ చేశానని ఆమె చెప్పారు.
గరిమా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో పట్టభద్రురాలయ్యారు. ఆ సమయంలోనే ఆమె యుపీఎస్‌సీ కోసం ప్రిపేర్‌ మొదలు పెట్టి విజయం సాధించారు. ఆమెకు తల్లి, సోదరుడు, అక్క ఉన్నారు. ‘నేను స్వీయ అధ్యయనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. జనరల్‌ నాలెడ్జ్‌ కోసం సోషల్‌ సైట్ల సాయం తీసుకున్నాను. ఈ పరీక్షలో ప్రిపరేషన్‌ చాలా కష్టంగా అనిపించింది. అంటే అర్థం మనం నిరుత్సాహపడాలని కాదు. మీకు సంతోషాన్ని కలిగించే వాటిని చేయండి, కుటుంబ సభ్యులతో ఉండండి, ధైర్యాన్ని పెంచుకోండి. నా విజయం క్రెడిట్‌ను మా అమ్మకే అందించాలనుకుంటున్నాను’ అంటూ గరిమా పంచుకున్నారు.
చాలా సంతోషంగా ఉంది స్మృతి మిశ్రా… ప్రస్తుతం ఢిల్లీలో లా చదువుతున్న ఆమె ఫలితాలు వచ్చిన వెంటనే తన తండ్రికి ఫోన్‌ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ పరీక్ష అయిన యూపీఎస్‌సీ(యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) పరీక్షలలో తాను నాల్గవ ర్యాంక్‌ సాధించినట్లు తండ్రికి చెప్పారు. స్మృతికి ఇది రెండవ ప్రయత్నం. ఆమె తండ్రి రాజ్‌కుమార్‌ మిశ్రా. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఆయన బరేలీలో డీఎస్సీగా పని చేస్తున్నారు. అతను 1989లో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో స్టేషన్‌ ఆఫీసర్‌, ఇన్‌స్పెక్టర్‌ వంటి వివిధ బాధ్యతలు చూశారు. ఇలా పదోన్నతులు పొందుతూ 2013లో ఇన్‌స్పెక్టర్‌గా, 2021లో డీఎస్పీగా మారారు. స్మృతి అన్నయ్య లోకేశ్‌ మిశ్రా ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆమె తల్లి అనిత గృహిణి. X (ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌) అధికారి కావాలనే స్మృతి ఆశయానికి ఆమె కుటుంబం మొత్తం మద్దతు ఇచ్చింది.
అన్నింటికీ దూరంగా ఉన్నాను
”ఈ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు నేను సోషల్‌ మీడియాను వదులుకున్నాను. బంధువుల్లో జరిగే ఎన్నో కార్యక్రమాలకు చాలా వరకు దూరంగా ఉన్నాను. చదువుపైనే దృష్టి పెట్టాను. నా మూడో ప్రయత్నంలో నాల్గవ ర్యాంక్‌ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని 25 ఏండ్ల స్మృతి అన్నారు. ఆగ్రాలోని సెయింట్‌ క్లెయిర్స్‌ స్కూల్లో 96.6శాతం మార్కులతో ఉన్నత పాఠశాల పూర్తి చేసిన ఆమె తన అన్నయ్యతో కలిసి నోయిడాకు వెళ్లి ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే తన చదువు కొనసాగించారు. ఆమె మిరాండా హౌస్‌, డీయూ నుండి బీఎస్సీ (లైఫ్‌ సైన్స్‌)తో పట్టభద్రురాలయ్యారు.

Spread the love