– వంద రోజుల్లో 60 రోజులు సర్వీసులు రద్దు
– ఓఆర్ 50 శాతం దాటట్లేదంటున్న అధికారులు
– రైళ్లు నడిస్తేనేగా ఓఆర్ వచ్చేదంటున్న ప్రయాణీకులు
– రెండో దశ అంటూ మరో రాజకీయ రూట్‌మ్యాప్
– వందేభారత్ కోసం పేదల ప్రజారవాణాకు బ్రేక్
– సర్వీసులు రద్దు చేసి తనిఖీలంట
– అనాలోచితంగా కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయాలు
అవును…కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌లో ఎమ్‌ఎమ్‌టీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం) రైళ్లకు మంగళం పాడేందుకు ప్రయత్నిస్తోంది. సర్వీసుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ, ఇష్టం వచ్చినట్టు ట్రిప్పులు రద్దు చేస్తూ, పట్టణ ప్రయాణీకులు సబర్బన్ రైలు ఎక్కేందుకు వీలులేని పరిస్థితుల్ని సృష్టిస్తోంది. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 50 శాతం దాటట్లేదని ప్రచారం చేస్తూ చౌకైన ప్రజా రవాణా వ్యవస్థను ప్రయాణీకులకు దూరం చేస్తున్నది. ఓఆర్‌ను సాకుగా చూపి, శాశ్వతంగా వీటిని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎస్‌ఎస్‌ఆర్ శాస్త్రి
శివారు ప్రాంతాల ప్రజలు తక్కువ ఖర్చుతో సిటీలోకి రావడానికి ఉన్న ఏకైక ప్రజారవాణా వ్యవస్థ ఎమ్‌ఎమ్‌టీఎస్. ఇప్పటికే పేదలు ప్రయాణించే ప్యాసింజెర్ రైళ్లను రద్దు చేయడం, ఉన్న కొన్ని ప్యాసింజర్ రైళ్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల చార్జీలు వసూలు చేయడం వంటి ఆర్థిక దోపిడీకి ఒడిగడుతున్న మోడీ సర్కారు ఇప్పుడు ఎమ్‌ఎమ్‌టీఎస్‌కే ఎసరు పెట్టింది. గడచిన వంద రోజుల్లో 60 రోజలు పాటు ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లు రద్దు అయ్యాయి. ఆగస్టు 14 నుంచి ఇప్పటి వరకు అసలు ఈరైలు పట్టాలే ఎక్కలేదు. పైగా సెప్టెంబర్ 3 వరకు నడిపేది లేదని దక్షిణ మధ్య రైల్వే ముందస్తు ప్రకటన కూడా చేసింది. సామాన్య ప్రజలతో పాటు రైల్వే ఉద్యోగులు కూడా ఎమ్‌ఎమ్‌టీఎస్‌లో ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తారు. హైదరాబాద్ సిటీలో వేలల్లో ఇండ్ల కిరాయిలు కట్టలేని పేద, మధ్య తరగతి ప్రజలు శివారు ప్రాంతాల్లో తక్కువ అద్దెకు ఇండ్లు దొరుకుతాయని అక్కడకు వెళ్తుంటారు. అక్కడి నుంచి ఎమ్‌ఎమ్‌టీఎస్ ద్వారా సిటీలో పనులకు వచ్చి తిరిగి ఇండ్లకు వెళ్తారు. ఎమ్‌ఎమ్‌టీఎస్‌లో కనిష్ట టిక్కెట్ ధర రూ.5 కాగా, గరిష్ట టిక్కెట్ ధర కేవలం రూ.15 మాత్రమే. ఈ చార్జీలతో దాదాపు సిటీ చుట్టుపక్కల 45 కిలోమీటర్ల లోపు ప్రయాణం చేయొచ్చు. కోవిడ్ టైంలో అన్ని రైళ్ల మాదిరే ఎమ్‌ఎమ్‌టీఎస్ సర్వీసుల్నీ రద్దు చేశారు. ఆ తర్వాత అన్ని రైళ్లను పునరుద్ధరించి, 15 నెలల తర్వాత తిరిగి ఎమ్‌ఎమ్‌టీఎస్ సర్వీసుల్ని ప్రారంభించారు. మధ్య మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రైళ్లను రద్దు చేయడంతో శివారు ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఎమ్‌ఎమ్‌టీఎస్ ఎక్కేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చి, రైళ్లు లేవని తెలియగానే అక్కడి నుంచి మళ్లీ బస్టాండ్లు, మెట్రో స్టేషన్లకు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన దుస్థితిని దక్షిణ మధ్య రైల్వే కల్పించింది. ఎమ్‌ఎమ్‌టీఎస్ కోసం రైల్వే స్టేషన్‌కు వెళ్తే అవి ఉంటాయో లేదో తెలియని స్థితిలో రైలు ప్రయాణీకులు తప్పనిసరై ప్రత్యామ్నాయ రవాణా చూసుకోవల్సి వచ్చింది. ఈ పరిస్థితిని సృష్టించిన రైల్వే అధికారులే ఇప్పుడు ఎమ్‌ఎమ్‌టీఎస్‌లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 50 శాతానికి మించట్లేదని లెక్కలు కడుతున్నారు. అందువల్లే రైళ్లను రద్దు చేయాల్సి వస్తున్నదనీ వివరణ ఇస్తున్నారు. అసలు రైళ్లను రెగ్యులర్‌గా నడిపితేనే కదా ఓఆర్ పెరిగేది. దాన్ని వదిలేసి 50 శాతానికి మించట్లేదనడం ఏంటని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్‌ఎమ్‌టీస్ తొలి దశ 45 కిలో మీటర్లు ఉండగా, రెండోదశతో ఇది 90 కి.మీ., పెరిగింది. తొలి దశ 45 కి.మీ., సమయంలో 121 సర్వీసులు నడిచేవి. అరగంటకో రైలు ప్రయాణీకులకు అందుబాటులో ఉండేది. తొలుత ఆరు బోగీలతో నడిచిన ఎమ్‌ఎమ్‌టీఎస్, ఆ తర్వాత 9 బోగీలకు పెరిగింది. ప్రయాణీకుల రద్దీ ఎక్కువ అవడంతో బోగీల సంఖ్యను 12కి పెంచారు. రోజుకు దాదాపు లక్షన్నర మంది ప్రయాణీకులు ఈ రైళ్లలో ప్రయాణించేవారు. ఇప్పుడు ప్రయివేటురంగంలోని మెట్రోరైల్‌ను ప్రోత్సహించడం కోసం ఎమ్‌ఎమ్‌టీఎస్‌ను బలి చేస్తున్నారని ప్రయాణీకులు అభిప్రాయపడుతున్నారు. ఓఆర్ తగ్గితే తక్కువ బోగీలతో అయినా సర్వీసుల్ని ఎందుకు నడపట్లేదని ప్రశ్నిస్తున్నారు.
వందేభారత్ కోసం…
మోడీ సర్కార్ ఉన్న రైళ్లను రద్దు చేసి, వాటిస్థానంలో వందేభారత్ అంటూ పేరు మార్చి నడుపుతున్న రైళ్ల కోసం ఎమ్‌ఎమ్‌టీఎస్‌ను బలి చేస్తున్నది.. దానితో పాటు పక్కా వ్యాపారీకరణలో భాగంగా ఎమ్‌ఎమ్‌టీఎస్ వెళ్లాల్సిన రూట్లలో సరుకు రవాణా రైళ్లను నడుపుతున్నారు. ఎమ్‌ఎమ్‌టీఎస్ టిక్కెట్ ధర తక్కువగా ఉండటం వల్ల ఆదాయం రావట్లేదనీ, ఎటూ కోవిడ్ టైంలో ప్రజలు ప్రత్యామ్నాయ రవాణాకు అలవాటు పడ్డారు కాబట్టి, ఇప్పుడు ఆ సర్వీసుల్ని తిప్పాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు భావిస్తున్నారని రైల్ నిలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అభిప్రాయపడ్డారు.
శుభవార్త వింటారు ద.మ.రైల్వే జీఎమ్ అరుణ్‌కుమార్ జైన్
ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్ల విషయంలో త్వరలో శుభవార్త వింటారని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ‘నవతెలంగాణ’ కు చెప్పారు. ఆ రైళ్లలో 50 శాతం ఓఆర్ కూడా రావట్లేదనీ, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, ట్రాక్‌ల పొడిగింపు వంటి కొన్ని పనుల వల్ల ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్ల రద్దు అనివార్యమవుతున్నదని వివరణ ఇచ్చారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆధునీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయనీ, రైళ్ల రద్దీకి తగినట్టు ట్రాక్‌లు లేవని చెప్పారు.
వందరోజుల్లో సర్వీసుల రద్దు ఇలా…
వరుస సంఖ్య తేదీ రోజులు
1. 14.06.2023 నుంచి
17.06.2023 వరకు 4
2. 26.06.23 నుంచి
02.07.23 వరకు 7
3. 03.07.23 నుంచి
09.07.23 వరకు 7
4. 10.07.23 నుంచి
16.07.23 వరకు 7
5. 17.07.23 నుంచి
23.07.23 వరకు 7
6. 31.07.23 నుంచి
06.08.23 వరకు 7
7. 14.08.23 నుంచి
20.08.23 వరకు 7
8. 21.08.23 నుంచి
27.08.23 వరకు 7
9. 28.08.23 నుంచి
03.09.23 వరకు 7
మొత్తం రద్దయిన రోజులు 60
ఇదో రకం తనిఖీ
ఎమ్‌ఎమ్‌టీఎస్‌ను చంపేయడం కోసం రైల్వే ఉన్నతాధికారులు పడుతున్న తపన కాస్తా కూస్తా కాదు. ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. కానీ ఈనెల 24వ తేదీ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్‌కుమార్ జైన్‌తో కలిసి ఎమ్‌ఎమ్‌టీఎస్ రైలులో ప్రయాణించి తనిఖీలు చేశారు(ట). సికింద్రాబాద్- లింగంపల్లి మధ్య వారు ప్రయాణీకులతో కూడా మాట్లాడారని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఓ పత్రికా ప్రకటన పంపారు. సదరు జనరల్ మేనేజర్ తన బృందంతో కలిసి ఎమ్‌ఎమ్‌టీఎస్ ట్రైన్ నెంబర్ 47160లో సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు ప్రయాణించి, సౌకర్యాలను పరిశీలించి, తిరిగి ట్రైన్ నెంబర్ 47188లో లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్లారని తెలిపారు. ఈ రెండు నెంబర్ల రైళ్లుఫలక్‌నుమా నుంచి లింగంపల్లికి, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు వెళ్తాయి. ఈ రైలులో ఒకరిద్దరు ప్యాసింజర్లతో రైల్వే జీఎం మాట్లాడుతున్న ఫోటోలను కూడా పంపారు. ఈ ట్రిప్ 24వ తేదీ జరిగింది. తెల్లారి 25వ తేదీన ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటన జారీ చేశారు. ప్రజారవాణాపై ఉన్నతస్థాయి అధికారులకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో దీనితో అర్థమవుతుందని ప్రయాణీకులు వాపోతున్నారు.
రెండో దశ రాజకీయం
ఎమ్‌ఎమ్‌టీఎస్ రెండో దశ పేరుతో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మరో నాటకానికి తెరలేపింది. దీనిపై సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యులు, కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి కూడా అనేక ప్రకటనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కలిసిరావట్లేదనీ, తన వాటా నిధులు ఇవ్వట్లేదని ఆరోపణలు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ధీటుగానే సమాధానం చెప్పింది. తొలి దశ ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లనే సక్రమంగా నడపట్లేదనీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకొని సరకు రవాణా రైళ్లను ఆ ట్రాక్‌లపై తిప్పుతున్నారని ఆరోపిస్తుంది. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడని సర్వీసులకు డబ్బు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఎమ్‌ఎమ్‌టీఎస్ తొలి విడత రెండో దశ మార్గం ప్రాజెక్ట్ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.160 కోట్లు ఇవ్వాలని పేర్కొన్నారు. 9 ఏండ్లు నానబెట్టి, ఇప్పుడు ప్రాజెక్ట్ వ్యయం పెరిగిందనీ, రాష్ట్ర వాటాగా రూ.600 కోట్లు ఇవ్వాలని దక్షిణ మధ్యరైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసారు. ప్రాజెక్ట్ ఆలస్యానికి కారణాలు ఏంటి? ఖర్చు ఎందుకు పెరిగింది? అనే వివరాలు ఏవీ చెప్పకుండా రూ.600 కోట్లు కట్టాలని చెప్పడం ఏంటని రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఎమ్‌ఎమ్‌టీఎస్ రైలు మార్గాల్ని కాదని, వేల కోట్ల వ్యయంతో కూడిన హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్ రెండో దశకు గ్రీన్ సిగల్ ఇవ్వడం గమనార్హం. ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను ఎందుకు నడపట్లేదనే విషయంపై కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి నోరుమెదపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.