– సమస్యల వలయంలో ఉపాధి కార్మికులు
– కానరాని పర్యవేక్షణ…అందని సూచనలు
– మూడేండ్లుగా ఏర్పాటు కాని ఉన్నత స్థాయి కమిటీ
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. జాబ్ కార్డుల తొలగింపు పెద్దఎత్తున కొనసాగుతున్నప్పటికీ ప్రాజెక్టులను పర్యవేక్షించి, అవసరమైన సూచనలు అందించాల్సిన కేంద్ర ఉపాధి గ్యారంటీ మండలిని (సీఈజీసీ) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2021 మే… అంటే మూడు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయనే లేదు. ఈ మండలికి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నేతృత్వం వహించాల్సి ఉంది. పంచాయతీరాజ్ సంస్థలు, కార్మిక సంఘాలు, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన తరగతులకు చెందిన పదిహేను మంది వరకూ సభ్యులుగా ఉంటారు.
సీఈజీసీ ఏర్పాటులో జరుగుతున్న తీవ్రమైన కాలయాపనను గమనిస్తే విమర్శలను వినే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్లు కన్పిస్తోందని పౌర సమాజ సంస్థ అయిన నరేగా సంఘర్ష్ మోర్చాకు (ఎన్‌ఎస్‌ఎం) చెందిన అశిష్ రంజన్ విమర్శించారు. ‘క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై సీఈజీసీ సభ్యులు సమాచారం అందజేస్తారు. కార్మికులకు ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా అనే విషయాన్ని పరిశీలిస్తారు. సీఈజీసీ ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని గమనిస్తే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి విమర్శలు వినే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టుగా ఉంది’ అని అశిష్ చెప్పారు. ఉపాధి పథకం సజావుగా సాగడంలో సీఈజీసీ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. పథకాన్ని మదింపు చేసి, కార్మికుల సమస్యలను సమీక్షించే అధికారం దానికి ఉన్నదని అన్నారు. సీఈజీసీ సిఫార్సులను ప్రభుత్వం విధిగా అమలు చేయనక్కరలేదని, కానీ మంత్రి నేతృత్వం వహిస్తున్నందున దానికి ప్రాధాన్యత ఉన్నదని ఆశిష్ చెప్పారు. కార్మికులు తమ హాజరును నమోదు చేయడానికి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సర్వీస్ యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే అనేక ప్రాంతాలలో ఇంటర్నెట్ సదుపాయం సరిగా లేకపోవడంతో హాజరు నమోదు కావడం లేదు. తమ సంఘం ఇటీవలే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమై సీఈజీసీని పునర్‌వ్యవస్థీకరించాలని డిమాండ్ చేసిందని అశిష్ తెలిపారు. గత మూడు సంవత్సరాలలో ప్రభుత్వం ఉపాధి హామీ పథకం డాటాబేస్ నుంచి పెద్దఎత్తున జాబ్ కార్డుదారులను తొలగించింది. డూప్లికేట్ లేదా నకిలీ కార్డుల ఏరివేత ఎప్పుడూ జరిగే పనేనని ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. 2022-23లో రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు కోట్లకు పైగా జాబ్ కార్డులను తొలగించాయి. ఏటా సగటున కోటి నుంచి కోటిన్నర కార్డులు మాత్రమే తొలగిస్తుంటారు. దానితో పోలిస్తే 2022-23లో తొలగించిన కార్డుల సంఖ్య బాగా ఎక్కువే. కార్డుల తొలగింపును వ్యతిరేకిస్తూ ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకూ ఎన్‌ఎస్‌ఎం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని నిర్వహించింది. పశ్చిమ బెంగాల్‌కు ఉపాధి హామీ నిధుల నిలిపివేతను నిరసిస్తూ సంతకాల సేకరణ జరిపింది. 2006-11 మధ్యకాలంలో వేతన సవరణ, సామాజిక ఆడిట్ వంటి వివిధ అంశాలపై సీఈజీసీ అర్థవంతమైన పాత్ర నిర్వహించిందని అశిష్ గుర్తు చేశారు. అయితే కీలక అంశాలపై వేర్వేరుగా నిపుణుల కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సీఈజీసీ ప్రాధాన్యత తగ్గిందని తెలిపారు. ఇప్పుడు సీఈజీసీ ఏర్పాటును జాప్యం చేయడం ద్వారా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందని ఆయన విమర్శించారు. సీఈజీసీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శైలేష్ కుమార్ సింగ్‌కు ఈ-మెయిల్ పంపినా ఇప్పటి వరకూ సమాధానం లభించలేదు.