మణిపూర్ లో భారీ బ్యాంక్ చోరీ…రూ.18.85 కోట్ల నగదు

నవతెలంగాణ న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ (Manipur)లో భారీ బ్యాంక్ చోరీ జరిగింది. ఉఖ్రుల్‌ (Ukhrul) జిల్లాలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ( Punjab National Bank)లో దుండగులు కోట్ల కొద్దీ నగదును దోచుకెళ్లారు (Bank Robbery). పోలీసులు(Police) తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం బ్యాంక్‌ మేనేజర్‌, సిబ్బంది రోజు లావాదేవీలు, డిపాజిట్‌ కార్యకలాపాలను ముగించారు. కస్టమర్లు లోపలికి రాకుండా బ్యాంకు బయట ఉన్న మెయిన్‌ షట్టర్‌ను మూసేసి లోపల పనిచేసుకుంటున్నారు. ఆ సమయంలో సుమారు 10 మంది గుర్తు తెలియని సాయుధ దుండగులు (unidentified armed men) అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించారు.
స్ట్రాంగ్‌ రూమ్‌ దగ్గర విధుల్లో ఉన్న బ్యాంక్‌ మేనేజర్‌, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. అనంతరం బ్యాంకులో ఉన్న రూ.18.85 కోట్ల నగదును దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్‌లో నిక్షిప్తమయ్యాయి. దుండగులు ఏకే రైఫిల్స్ సహా పలు ఆయుధాలతో లోపలికి ప్రవేశించినట్టు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, మే 3న జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత మణిపూర్‌ రాష్ట్రంలో ఇది మూడో భారీ బ్యాంకు దోపిడీ ఘటన మూడో సారి చోటుచేసుకోవడం గమనార్హం.

Spread the love