– 157 మంది మృతి
– అనేక ఇళ్లు నేలమట్టం
– కొనసాగుతున్న సహాయ చర్యలు
ఖాట్మండు : నేపాల్‌లో శనివారం ఉదయం తీవ్రమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. దీని ధాటికి 157 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. పలు నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. కొన్ని ఇళ్లు బీటలు వారాయి. వేలాది మంది చలికి వణుకుతూ బహిరంగ ప్రదేశాల్లోనే కాలక్షేపం చేశారు. భూకంపం తర్వాత రిక్టర్ స్కేలుపై 3.3 తీవ్రతతో అనేకసార్లు ప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాం తులయ్యారు. గాయపడిన వారికి వైద్య సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమవేశాన్ని నిర్వహించారు. విద్యుత్ సరఫరాను, కమ్యూని కేషన్ వ్యవస్థను పునరుద్ధరిం చేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు ఉచితంగా టెలికం సేవలు అందజేస్తారు. గాయపడిన వారిని రాజధాని ఖాట్మండులోని టీవీ టీచింగ్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇందుకోసం భద్రతా సిబ్బందిని నియమించారు. సంక్షోభ సమయంలో నేపాల్‌కు సాయం అందించేందుకు భారత్ ముందుకు వచ్చింది. నేపాల్‌లో నివసిస్తున్న భారతీయుల కోసం అత్యవసర కాంటాక్ట్ నెంబరును ప్రకటించింది. నేపాల్ ప్రధాని పుష్ప కుమార్ దాహల్ జజార్కట్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆయన వెంట 16 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం కూడా వెళ్లింది. అవసరమైన వారికి వైద్య సాయం అందించేందుకు నేపాల్‌గంజ్ విమానాశ్రయం హెలిపాడ్ వద్ద అంబులెన్సులను సిద్ధం చేశారు. బాధితులకు ఆహారం, తాగునీరు, బట్టలు, టెంట్లు అందజేసేందుకు వీలుగా అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు విరాళాలు అందించాలని ప్రధాని కార్యాలయం విజ్ఞప్తి చేసింది. అనేక చోట్ల రోడ్లపై కొండచరియలు విరిగిపడడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. నేపాల్‌లో జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టంపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. భూకంప ప్రభావం ఉత్తర భారతదేశంపై కూడా పడింది. ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో భూమి కంపించింది. అయితే నేపాల్‌లో కన్పించినంత తీవ్రత మన దేశంలో లేదు.