నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)కు చెందిన రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. స్టోరేజీ ట్యాంక్ నుంచి దట్టంగా పొగలు వ్యాపించాయి. పలు కిలోమీటర్ల దూరం వరకు ఇవి కనిపించాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. గుజరాత్‌లోని వడోదర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కోయాలిలోని ఐవోసీఎల్ ఆయిల్ రిఫైనరీ ఆవరణలో ఉన్న స్టోరేజీ ట్యాంక్‌లో పేలుడు జరిగింది. నల్లటి పొగలు దట్టంగా వెలువడ్డాయి. పలు కిలోమీటర్ల దూరం వరకు ఈ పొగలు కనిపించాయి. కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పది ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు వల్ల చెలరేగిన మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. పేలుడు ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు.