ఏపీలో భారీగా పోలింగ్‌

ఏపీలో భారీగా పోలింగ్‌– రాత్రి 11.45 గంటలకు 76.5 శాతం
– 80శాతం దాటే అవకాశం
అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం ఏపీలో భారీగా పోలింగ్‌ నమోదైంది. లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. రాత్రి 11.45 గంటలకు 76.5 శాతం పోలింగ్‌ నమోదయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగిసే సమయానికి సుమారు 3,500 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీటిలో అనేకచోట్ల 100నుం చి200 మంది ఓటర్లు క్యూలో ఉన్నారని, కొన్ని చోట్ల అంతకన్నా ఎక్కువమంది ఉన్నారని ఏపీ సీఈఓ మీనా తెలిపారు. ఈ కేంద్రాల్లో కొన్ని చోట్ల రాత్రి 11 గంటలకు కూడా పోలింగ్‌ జరుగుతోంది. దీంతో పోలింగ్‌ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. 80 శాతం దాటుతుందని అంచనా వేస్తున్నారు. కచ్చితమైన సమాచారాన్ని మంగళవారం వెల్లడిస్తామని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. ఓటర్లను ప్రలోభ పెట్టారన్న ఫిర్యాదులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సోమవారం నాడుకూడా వినిపించాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద కూడా ఈ విషయం చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజా ఎన్నికల్లో పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరిగిన సంగతి తెలసిందే. అధికార వైసీపీతోపాటు, ఎన్‌డీఏ కూటమిలోని టీడీపీ,జనసేన, బీజేపీలు భారీగా నగదు పందారంచేశాయి.
బారులు తీరిన మహిళలు..వృద్ధులు
సోమవారం ఉదయం 6.30 గంటల నుండే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు ఓటువేయడానికి తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కనిపించిన ఈ దృశ్యాలు చర్చనీయాంశమైనాయి. యువత కూడా ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. మహిళలు, వృద్ధులు, యువత ఈ స్థాయిలో కదలడం ఎవరికి లాభిస్తుందన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ 9 గంటలకు 9.05శాతం నమోదమయింది. 11 గంటలకు 23.10శాతం, మధ్యాహ్నం 1 గంటకు 40.26శాతం, 3కు 55.49శాతం, 5 గంటలకు 68.04శాతం చొప్పున నమోదయింది.
గతంలో ఇలా
2014 సార్వత్రిక ఎన్నికల్లో 78.41శాతం ఓటింగ్‌ నమోదు కాగా, 2019 ఎన్నికల్లో 79.84శాతం ఓటింగ్‌ నమోదైంది. 2019లో సాయంత్రం 5గంటలకు 61.16శాతం పోలింగ్‌శాతం నమోదవ్వగా ఈ సారి 68.04శాతం నమోదయింది. దీంతో ఈ సారి పోలింగ్‌ 80శాతం మించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లకు ఈవీఎంలు
రాష్ట్రంలో ఎక్కడా రీ పోలింగ్‌ అవసరం లేదన్న అభిప్రాయం ఎన్నికల వర్గాల్లో వ్యక్తమవుతోంది. మీడియాతో మాట్లాడిన సీఈఓ కూడా ఇదే విషయం చెప్పారు. అయితే, పొద్దుపోయేంత వరకు పోలింగ్‌ జరుగుతుండటంతో మంగళవారం ఈ విషయమై అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఇవిఎంలను రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లో పెట్టి సీల్‌ చేస్తారు. సీఏపీఎఫ్‌ బలగాలకు స్ట్రాంగ్‌ రూమ్‌ బాధ్యతల భద్రతను అప్పగించారు. నిరంతరం సిసి కెమెరాల నిఘాతో పటిష్టమైన భద్రతను కల్పించడంతో పాటు, ఏజెంట్లకు కూడా ఈ రూమ్‌ల వద్ద ఉండవచ్చునని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.

Spread the love