ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా సీనియర్‌ కమాండర్‌ అజామ్‌ ఛీమా మృతి చెందినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో గుండెపోటుతో ఆయన మరణించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆయన అంత్యక్రియలు ఫైసలాబాద్‌లోని మల్కన్‌వాలాలో పూర్తైనట్లు సమాచారం. 15 ఏళ్ల క్రితం అంటే 2008 నవంబర్‌ 26న పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమానికి పాల్పడ్డారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా తాజ్‌ మహల్‌ ప్యాలెస్‌ హోటల్‌ సహా అనేక ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి అజామ్‌ ఛీమా కీలక సూత్రధారిగా గుర్తించారు. దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులకు అజామ్‌ శిక్షణ ఇచ్చినట్లు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో అతని పేరును మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ జాబితాలో చేర్చింది. 26/11 పేలుళ్ల ఘటన మాత్రమే కాకుండా ఇతర బాంబు పేలుళ్లకు కూడా అజామ్‌ సూత్రధారిగా వ్యవహరించారు.

Spread the love