తల్లుల మానసిక అనారోగ్యం గుర్తించబడని విషాదం …

తల్లుల మానసిక అనారోగ్యం గుర్తించబడని విషాదం ...ప్రతి ఐదుగురు స్త్రీలలో ఒకరు గర్భం సమయంలోగాని, ప్రసవం, ప్రసవానంతరం మొదటి రోజుల్లోగాని మానసిక రుగ్మతలకు లోనవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 10 శాతం మంది గర్భిణులు, 13 శాతంమంది బాలింతలు మానసిక అనారోగ్యాలతో, ముఖ్యంగా కుంగుబాటు లేక డిప్రెషన్‌తో సతమత మవుతున్నట్లుగా అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. దిగువ, మధ్యస్ధ ఆదాయ దేశాలలో ఈ శాతం ఇంకా ఎక్కువ. 15.6 శాతం మంది గర్భిణులు, 19.8 శాతం మంది బాలింతలు ఈ అనారోగ్యాల బారిన పడుతున్నారని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ అనారోగ్యాలు ఇంత విస్తృతంగా ఉన్నప్పటికి వాటిని తగినంతగా గుర్తించకపోవడం, అవసరమైన స్ధాయిలో చికిత్స అందకపోవడం విచారకరం. మే 1 నుండి 7వ తేదీ వరకు తల్లుల మానసిక ఆరోగ్య అవగాహన దినోత్సవ వారంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వ్యాసం…

విశ్వ వ్యాధుల భారం అధ్యయనం ప్రకారం మానసిక వ్యాధుల కారణంగా తల్లులు తమ 15 ఏండ్ల విలువైన, ఉత్పత్తిదాయకమైన జీవితాన్ని కోల్పోతున్నారు. ఈ కారణంగా జరిగే ఆర్ధిక నష్టం కూడా తక్కువేమీ కాదు. 2019లో ఈ నష్టం 1.3 ట్రిలియన్ల అమెరికా డాలర్లుగా అంచనా వెయ్యబడింది. ఇది 2030కి 3 ట్రిలియన్లు అవుతుందని అంచనా వేయబడుతోంది.
తల్లి మానసిక ఆరోగ్యం అంటే?
గర్భం, ప్రసవం, ప్రసవం తర్వాత ఏడాది వరకు తల్లి ఉద్వేగ, మానసిక, సాంఘిక స్వస్ధతను తల్లి మానసిక ఆరోగ్యంగా పరిగణింపబడుతుంది. మాతృత్వం సిద్ధించే క్రమంలో తల్లి పొందే అనేక అనుభవాలు, అనుభూతులు, ఎదుర్కొనే వివిధ సవాళ్ళు ఈ పరిధిలోకి వస్తాయి. సంతోషం, సంతృప్తి, ఉత్సాహం మాత్రమేకాక రాగల ఒత్తిడి, ఆందోళన, మానసిక అవాంతరాలు కూడా ఇందులో చేరతాయి. మానసిక అనారోగ్యాల ప్రభావం వారి భావోద్వేగ స్వస్ధత పైనేకాక, వారి రోజువారీ కార్యకలాపాల నిర్వహణపై, తన బిడ్డతో సరైన బంధాన్ని పెంపొందించుకోవడం, బిడ్డ సంరక్షణ, పెరుగుదలపై కూడా పడుతుంది.
గర్భం భావోద్వేగాల రంగుల రాట్నం
ఒక కొత్త జీవిని ఈ ప్రపంచంలోకి తీసుకు వచ్చే క్రమంలో స్త్రీలలో, ముఖ్యంగా మొదటిసారి గర్భందాల్చిన గర్భిణులలో ఎంతో తీవ్రమైన ఆందోళన, అనిశ్చితి, భయం ఉంటాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులు, శారీరక అసౌకర్యం భావోద్వేగ పరిస్ధితిపై మరింత ప్రభావాన్ని చూపుతాయి. తల్లి అవుతున్న క్రమంలో స్వీయ గుర్తింపు, సొంత ఆలోచన, ఆత్మగౌరవం, శరీర ఆకృతిలో మార్పు, తను నిర్వహించవలసిన పాత్రలలో మార్పు ఆమెను అలజడికి గురిచేస్తాయి. ప్రసవం ఎలా అవుతుందో అనే ఆందోళన, ప్రసవ నొప్పుల గురించి భయం, ప్రసవం సమయంలో తనకూ, తన బిడ్డకు ఏ ప్రమాదాలు ముంచుకు వస్తాయోననే భయం గర్భిణిని నలిబిలి చేస్తాయి.
ప్రసవం తర్వాత బిడ్డను సవ్యంగా సంరక్షించుకోలేనేమోననే భయం, బిడ్డసంరక్షణలో కలిగే శారీరక శ్రమ, నిద్రలేమి ఆమె మానసిక స్ధితిని కుదిపేస్తాయి. మానసిక కల్లోలం, కన్నీళ్లు కార్చడం, తల్లిగా తన బాధ్యతల్ని నిర్వర్తించలేనని నిస్పృహ చెందడం (బేబీ బ్లూస్‌) ఉంటాయి.
తల్లి మానసిక ఆరోగ్య లోపాలు
గర్భిణులకు, బాలింతలలో సాధారణంగా కనిపించే డిప్రెషన్‌, ఆందోళనతో పాటు తీవ్రమైన సమస్య ప్రసవానంతర సైకోసిస్‌. ఇలాంటి మానసిక అనారోగ్యాలు వారి రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంటాయి. అంతేకాక వారి జీవన నాణ్యతను కూడా దెబ్బ తీస్తాయి.
పెరినేటల్‌ డిప్రెషన్‌
లక్షణాలు: గర్భం సమయంలో, ప్రసవం తర్వాత ఏడాది వరకు ఉండే కుంగుబాటు లేక డిప్రెషన్‌ని పెరినేటల్‌ డిప్రెషన్‌ అనొచ్చు. నిరంతర విచారం, ఏం చేయాలన్నా ఆసక్తి లోపించడం, దేనిలోనూ ఆనందం లేకపోవడం, నిద్రా భంగం, ఆకలి సక్రమంగా లేకపోవడం, తనని తాను దేనికీ పనికి రాననుకోవడం లేక అపరాధ భావన, తన బిడ్డతో బంధాన్ని ఏర్పరచుకోవడం కష్టమవడం మొదలైనవి ఉంటాయి.
సంకేతాలు: సాంఘిక కార్యక్రమాలకు దూరమవడం, తరచుగా ఏడవడం, ఏకాగ్రతను కోల్పోవడం, విపరీతమైన చిరాకు, బిడ్డతో ఒంటరిగా ఉండడానికి భయం, బిడ్డను సాకడంపై ఆసక్తి లేకపోవడం.
పోస్ట్‌పార్టమ్‌ ఏంగ్జయిటీ డిజార్డర్స్‌
జనరలైజ్డ్‌ ఏంగ్జయిటీ డిజార్డర్‌ (జి.ఎ.డి), పేనిక్‌ ఏంగ్జయిటీ డిజార్డర్‌, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఒ.సి.డి) పోస్ట్‌పార్టమ్‌ ఏంగ్జయిటీ డిజార్డర్స్‌లో భాగం.
లక్షణాలు: అంతులేని విచారం, బిడ్డ ఆరోగ్యం గురించి, భద్రత గురించి అహేతుక భయాలు, దూసుకు వచ్చే అసంగత ఆలోచనలు, చిరాకు, అస్ధిమితం, నిద్రపట్టడం కష్టమవడం, గుండెదడ, మైకం రావడం, ఊపిరి అందకపోవడం, చెమటలు పట్టడం మొదలైన ఆందోళన తాలూకు భౌతిక లక్షణాలు ఈ మానసిక రుగ్మతలో ఉంటాయి. ఇవి తల్లిగా చెయ్యాల్సిన బిడ్డ సంరక్షణ, ఇతర బాధ్యతల్ని నెరవేర్చడానికి ఆటంకం కలిగిస్తాయి. ఇలాంటి ఒత్తిడి, ప్రతికూలత, భావోద్వేగ సవాళ్ళను తట్టుకోగల మానసిక దృఢత్వాన్ని, శక్తిని పెంపొందించుకోవడం సాధారణ విషయం కాదు. ధ్యానం, దీర్ఘంగా శ్వాసతీసుకోవడం, శారీరక శ్రమ, సాంఘిక సపోర్టును కోరడం, ఆరోగ్య సంరక్షకులను సంప్రదిస్తూ ఉండడం వీటిని తట్టుకోవడానికి తోడ్పడతాయి.
సంకేతాలు: పదే పదే బిడ్డ ఎలా ఉందో చూడడం, ఇంట్లోనుండి బయటికి వెళ్ళకుండా వుండడం, పానిక్‌ ఎటాక్స్‌, కండరాలు బిగిసిపోవడం లేక జీర్ణవ్యవస్ధ సమస్యలు.
పోస్ట్‌పార్టమ్‌ అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌
లక్షణాలు: బిడ్డ భద్రత, శ్రేయస్సు గురించి హృదయాన్ని కకావికలు చేసే ఆలోచనలు, బిడ్డకు హాని సంబంధిత మనోదృశ్యాలు, పదే పదే చేసిన పనినే చెయ్యడం, ఉదా: చేతుల్ని అదే పనిగా కడుక్కోవడం, తీవ్రమైన ఆందోళన.
సంకేతాలు: రోజువారీ కార్యక్రమాల నిర్వహణకు భంగం కలిగేలాగా పదే పదే ఒకే పనిని చెయ్యడం, తనను ముంచెత్తుతున్న ఆలోచనల గురించి తీవ్రమైన కలవరం, నియంత్రణ లేని భావోద్వేగాలు.
పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌
లక్షణాలు: గతంలో జరిగిపోయిన ఘటనలు, అనుభవాలు పదే పదే గుర్తుకు రావడం, బాధాకరమైన ప్రసవ అనుభవం పీడకలలు, మితిమీరిన అప్రమత్తత, భావోద్వేగ జడత్వం.
సంకేతాలు: వైద్యానికి సంబంధించిన స్ధలాలకు దూరంగా ఉండడం, ప్రసవం గురించి చర్చలను నివారించడం, దిగ్భ్రాంతి చెందడం, నిద్రించడం కష్టమవడం, మానసిక కల్లోలాలు.
పెరినాటల్‌ బైపోలార్‌ డిజార్డర్‌:
లక్షణాలు: ఉన్మాదం కొంతసేపు, ఆవెంటనే డిప్రెషన్‌, అలా ఒకదాని వెంట మరొకటి ఉండడం, నిద్ర అవసరం తగ్గడం, ఆలోచనలు దూసుకు రావడం, ఆకస్మిక ప్రతిస్పందన, చిరాకు.
సంకేతాలు: తీవ్రమైన మనో సంచలనాలు, నిర్లక్ష్య ప్రవర్తన, ఇంట్లోను, పని చేసే ప్రదేశంలోనూ సవ్యంగా వ్యవహరించకపోవడం, సైకోసిస్‌ (తీవ్రంగా ఉన్నప్పుడు భ్రాంతులు, భ్రమలు)
పోస్ట్‌పార్టమ్‌ సైకోసిస్‌
లక్షణాలు: భ్రాంతులు, భ్రమలు, తీవ్ర ఆందోళన, గందరగోళం, మతిస్ధిమితం లేకపోవడం, వేగంగా మూడ్‌ మార్పులు, తనకు లేక తన బిడ్డకు హానిని కలిగించే, అత్మహత్య, లేక హత్యను ప్రేరేపించే ఆలోచనలు.
సంకేతాలు: వింత ప్రవర్తన, అస్పష్టత, నిద్రకు తీవ్ర ఆటంకాలు, అర్ధం లేకుండా మాట్లాడడం లేక ఆలోచించడం.
పైలక్షణాలు ఏవైనా కొన్ని ఉన్నంత మాత్రాన మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్టు భావించకూడదు. కానీ అవి దీర్ఘకాలంగా ఉన్నా, వాటి వలన ఆ స్త్రీ దైనందిన కార్యకలాపాల నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నా, అవి ఆమెను బాధిస్తున్నా వెంటనే మానసిక చికిత్సలో అనుభవం ఉన్న వైద్యునికి చూపించి తగిన చికిత్స చేయించాలి. సకాలంలో వైద్యం చేయంచుకోవడం వల్ల త్వరగా కోలుకుని తల్లీ, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
తల్లి మీద, బిడ్డ మీద తల్లి మానసిక ఆరోగ్యం ప్రభావం:
భావోద్వేగపరమైనవి: తల్లి మానసిక ఆరోగ్యం సజావుగా లేకపోతే ఆమెకు తీవ్రమైన విచారం, ఆందోళన, నిరాశ కలుగుతాయి. తీవ్రమైన అలసట, తలనొప్పి, జీర్ణ సమస్యలు మొదలైన శారీరక ఇబ్బందులు కలుగుతాయి. ఆత్మ గౌరవం, స్వీయ విలువ లోపించి తనను, తన బిడ్డను సంరక్షించుకునే సామర్ధ్యం దెబ్బతింటుంది. చిరాకు, నిర్లిప్తత కారణంగా ఆమెకు బిడ్డతో సరైన బంధం పెంపొందదు. తల్లి మానసిక ఆరోగ్యం ఆమె పనితీరు పై కూడా ప్రభావం చూపుతుంది. తల్లీబిడ్డల మధ్య ఉండే బంధాన్ని, అనుబంధాన్ని ప్రభావితం చేస్తాయి. ఇంట్లోనూ, పని చేసే చోట తను రోజువారీ చేసే పనుల్ని, నిర్వహించే బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేదు. ఈ ప్రభావం భర్త, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉండే బంధాన్ని బలహీనపరుస్తుంది.
ఉదాహరణకు తల్లి డిప్రెషన్‌ లేక ఆందోళనకు గురైనప్పుడు తన బిడ్డ అవసరాలకు సున్నితంగా ప్రతిస్పందించలేదు.
మానసిక అనారోగ్యాలు ఉన్న తల్లికి పుట్టిన బిడ్డల ప్రవర్తన, భావోద్వేగం, ఎదుగుదల పరంగా సమస్యల్ని ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
దీర్ఘకాలిక ప్రభావాలు: తల్లి మానసిక అనారోగ్యాలు బిడ్డల భావోద్వేగస్ధితి, బుద్ధి వికాసం పై ప్రభావం చూపుతాయి. తమకు సంరక్షణ చేసేవారితో జరిపే సంభాషణల ద్వారా బిడ్డలు సాంఘిక నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. తల్లి మానసిక అనారోగ్యం ఈసంభాషణ తీరును ప్రభావితం చేస్తుంది. ఇది వారి అభివృద్ధిని, బంధాలనేర్పరచుకునే సామర్ధ్యాన్ని బలహీనపరుస్తుంది.
ఆరోగ్యసేవల వినియోగం: మానసిక అనారోగ్యాల వల్ల చికిత్స కోసం హాస్పటల్‌కి వెళ్ళవలసిన అవసరం పెరుగుతుంది. హాస్పటల్లో అత్యవసర వార్డులో చేరి చికిత్స చేయించుకోవల్సి వస్తుంది. ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత అవసరమైన వైద్య సేవల్ని పొందడంపై కూడా తల్లి మానసిక రుగ్మతల ప్రభావం పడుతుంది
మొత్తం జీవిత నాణ్యత: తల్లి మానసిక రుగ్మతలు ఆమె మొత్తం జీవిత నాణ్యతపై, కుటుంబ జీవిత నాణ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది నిరంతర ఒత్తిడికి, జీవితానందాన్ని కోల్పోవడానికి, ఇక బతుకు భరించలేనిదిగా మారడానికి దారితీస్తుంది.
తల్లి మానసిక రుగ్మతలు- బిడ్డ అభివృద్ధి, అనుబంధంపై ప్రభావం
తల్లి మానసిక ఆరోగ్యం సవ్యంగా లేకపోతే ఆమె తన ఉద్వేగాల్ని నియంత్రించుకోలేదు, బిడ్డ ఉద్వేగ సూచనలకు సున్నితంగా ప్రతిస్పందించ లేదు. బిడ్డ ఉద్వేగనియంత్రణ నైపుణ్యాల్ని నేర్చుకోవడానికి తల్లి తగిన ప్రతిస్పందనతో సంరక్షించడం చాలా ముఖ్యం. బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి భద్రతనిచ్చే అనుబంధం చాలా ముఖ్యం. తల్లి మానసిక ఆరోగ్యం సురక్షితమైన అనుబంధాల్ని పెంపొందించుకోవడానికి దోహదం చేస్తుంది. డిప్రెషన్‌, ఆందోళన ఉన్న తల్లులు తమ బిడ్డలు సురక్షిత అనుబంధాన్ని స్ధిరంగా పెంపొందించుకోవడానికి తోడ్పడలేరు. బిడ్డ, తల్లితో గాఢమైన అనుబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి అవసరమైన తల్లీబిడ్డల ఊసుల కలబోతలు తల్లి మానసిక ఆరోగ్యం బావున్నప్పుడే సాధ్యమవుతుంది. బిడ్డల తొలి వయసులో నేర్చుకునే సామర్ధ్యాన్ని, మెదడు అభివృద్ధి చెందడాన్ని పెంపొందించే కార్యక్రమాలలో మానసిక అనారోగ్యాలు ఉన్న తల్లులు లీనమవడం కష్టమవుతుంది. తల్లీబిడ్డలమధ్య జరిగే ముచ్చటైన సంభాషణ బిడ్డ భాష అభివృద్ధి అవడానికి కీలకం. ఆ పిల్లలు దీనికి కూడా దూరమవుతారు. మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోని తల్లుల బిడ్డలకు ఎదుగుదలలోపాలు, ప్రవర్తన సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
బిడ్డ భావోద్వేగ, సాంఘిక, మేధోపరమైన అభివృద్ధిని కుంటుపరుస్తాయి.
తల్లి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలు:
బ గర్భం సమయంలో వచ్చిన డయాబెటిస్‌, ప్రీఎక్లాంప్సియా, నెలలు నిండకమునుపు ప్రసవం
బ భర్త, కుటుంబ సభ్యులు, స్నేహితుల సపోర్ట్‌ లేకపోవడం
బ ఆర్ధికపరమైన ఒత్తిడులు
బ భర్తతో సంఘర్షణలు, గృహహింస
బ కోరుకోకుండా వచ్చిన గర్భం
బ గర్భస్రావం, బిడ్డ ప్రసవ సమయంలో చనిపోవడం, కష్టపు కాన్పు మొదలైనవి.
రక్షణనిచ్చే అంశాలు:
బ భర్త, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆరోగ్య కార్యకర్తల బలమైన సపోర్ట్‌
బ గర్భం సమయంలో నాణ్యమైన సంరక్షణ లభించడం
బ ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించడం
బ భర్తతో సానుకూల అనుబంధం
బ సమర్ధవంతంగా ఒత్తిడిని తట్టుకునే నైపుణ్యాలను పెంపొందించుకోవడం
బ అర్ధిక సుస్ధిరత
బ విద్య, ఉద్యోగ, వృత్తిపరమైన సాధికారత
బ సంస్కృతీపరమైన, సాంఘిక అంశాలు
బ తల్లి మానసిక అనారోగ్యాల్ని సత్వరం గుర్తించి చికిత్స చెయ్యడం
బ తల్లి మానసిక ఆరోగ్యంపై సానుకూల, ప్రతికూల అంశాలను గర్తించి సానుకూల అంశాలను పటిష్టం చేసి ప్రతికూల అంశాలను తగ్గించడం ద్వారా తల్లి మానసిక ఆరోగ్యాన్ని కాపాడవచ్చు.
తల్లి మానసిక అనారోగ్యాలు-చికిత్స
తల్లికి వచ్చే మానసిక అనారోగ్యాలను తగ్గించడానికి వివిధ చికిత్సలతో పాటు కొన్ని చర్యలు చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. ఇవి తల్లికి ఉండే బాధల్ని నయం చెయ్యడం, తట్టుకునే నైపుణ్యాలను, మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి.
కాగ్నిటివ్‌ బిహేవిరియల్‌ థిరపి (సి.బి.టి)
ఈ చికిత్స లక్ష్యం ప్రతికూల ఆలోచనల్ని, ప్రవర్తనల్ని మార్చడం. ఈపద్ధతి డిప్రెషన్‌, ఆందోళన, ఇతర మానసిక అనారోగ్యాల్ని నయం చేస్తుంది. అహేతుక ఆలోచనల్ని పక్కకు తోసి అనారోగ్యాన్ని తట్టుకోవడానికి ఈ చికిత్స పని చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆలోచనల్ని పెంపొందించుకోవడానికి, ఒత్తిడులను సక్రమంగా నివారించడానికి ఈ చికిత్స తోడ్పడుతుంది.
ఇంటర్‌ పర్సనల్‌ థిరపీ: వ్యక్తుల మధ్య సమస్యల్ని మనసు విప్పి మాట్లాడుకుని, అనుబంధాలను నెలకొల్పుకునే, నిలుపుకునే నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ చికిత్స తోడ్పడుతుంది. మనుషుల మధ్య ఉన్న సమస్యాత్మక సంబంధాలను పరిష్కరించుకోవడానికి, సానుకూల అనుబంధాలను నెలకొల్పుకోవడానికి ఈ చికిత్స ఉపయోగపడుతుంది.
మైండ్‌ఫుల్‌నెస్‌ ఆధారిత చికిత్సలు: మైండ్‌ఫుల్‌నెస్‌ ఆధారిత ఒత్తిడిని తగ్గించుకునే సద్ధతులు, మైండ్‌ఫుల్‌నెస్‌ ఆధారిత కాగటివ్‌ థిరపీ, మైండ్‌ఫుల్‌నెస్‌ ఆధారిత ధ్యానం, అవగాహన పద్ధతులు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ క్షణంలో జీవించడం, ఆలోచనల్ని, ఉద్వేగాల్ని యధాతధంగా స్వీకరించడం గర్భిణులను, బాలింతలను మానసికంగా దృఢపరుస్తాయి.
కౌన్సిలింగ్‌: సపోర్ట్‌నిచ్చే కౌన్సిలింగ్‌ మానసిక అనారోగ్యాలకు గురైన స్త్రీలకు తమ భావాల్ని, కలతల్ని, అనుభవాల్ని నిర్భయంగా వ్యక్తపరచడానికి వీలు కల్పిస్తుంది. కౌన్సిలింగ్‌ ఉద్వేగాల్ని నియంత్రించుకోవడానికి, ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడానికి ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది.
సైకోడైనమిక్‌ థిరపీ: ఈచికిత్స అపస్మారక ప్రక్రియలను, ప్రస్తుత ఆలోచనలను, ప్రవర్తనలను పాత అనుభవాలు ప్రభావితం చేస్తున్నాయా అనేది అన్వేషిస్తుంది. ఇది బాగా గాఢమైన విచారానికి లోనైన, మానసిక గాయాలు మానని స్త్రీలకు ఉపయోగపడుతుంది. అంతర్‌దృష్టిని, స్వీయ అవగాహనను, భావోద్వేగ గాయాల్ని నయం చేసుకోవడాన్ని ఈ చికిత్స ప్రోత్సహిస్తుంది.
మందులతో చికిత్స: బాగా తీవ్రమైన డిప్రెషన్‌, ఆందోళన ఉన్నప్పుడు మందులు పనిచేస్తాయి. గర్భిణులు, బాలింతలు తమ వైద్యులను సంప్రదించి, మందుల వలన కలగబోవు లాభనష్టాల్ని బేరీజు వేసుకుని వాడాలి. మందులతో సాటు సైకోథిరపీతో సమగ్ర చికిత్సనందించడం అవసరం.
పెరినేటల్‌ సపోర్ట్‌ గ్రూపులు: తోటివారి మద్దతును పొందడానికి, తమ అనుభవాలను వెల్లడించి ఆమోదాన్ని పొందడానికి ఈ పెరినేటల్‌ గ్రూపులు అవకాశాల్ని కలిగిస్తాయి. ఈ గ్రూపులు ఒంటరి భావాన్ని తగ్గిస్తాయి, మానసిక ఆరోగ్య సవాళ్ళను తేలికపరుస్తాయి.
ఫ్యామిలీ థిరపీ: ఈ చికిత్సలో కుటుంబ సభ్యులు భాగం పంచుకునేలా చేస్తారు. కుటుంబ సభ్యులతో సంబంధాల్ని మెరుగుపరచడానికి, భావ వ్యక్తీకరణ నైపుణ్యాల్ని పెంపొందించుకోవడానికి, తల్లుల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఒత్తిళ్ళను తట్టుకోవడానికి ఫ్యామిలీ చికిత్స ఉపయోగపడుతుంది.
జీవన శైలిలో మార్పులు:
తగినంత పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సరిపడా నిద్ర, ఒత్తిడిని తగ్గించుకునే పద్ధతులు ఇతర చికిత్సలకు పూరకాలుగా పనిచేసి మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
తల్లుల మానసిక ఆరోగ్య అవగాహన వారం: తల్లులకు వచ్చే మానసిక సమస్యల గురించి అవగాహన కలిగించడానికి ఒక వారం పాటు ప్రచారం చెయ్యడం లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఈవారాన్ని జరుపుతున్నారు.
లక్ష్యాలు: గర్భిణులకు, బాలింతలకు, వారి కుటుంబ సభ్యులకు, ఆరోగ్య సంరక్షకులకు తల్లుల మానసిక ఆరోగ్య అవగాహన కలిగించడం బాధిత స్త్రీలకు, కుటుంబాలకు ఆసరాగా నిలబడడం, వ్యక్తుల వైఖరులను, సమాజ వైఖరులను ఈ అనారోగ్యాలపట్ల సానుకూలంగా మార్చడం. మానసిక సమస్యలు వచ్చిన వారు తిరిగి మామూలు ఆరోగ్యం పొందడానికి అవసరమైన సమాచారాన్ని అందించడం, తగిన సపోర్టును, సంరక్షణను పొందడానికి సహాయపడడం. తల్లుల మానసిక ఆరోగ్య అవగాహన వారం 2024 థీమ్‌ ‘నిన్ను పునరావిష్కరణ చేసుకోవడం’.
గర్భం దాల్చడం, తల్లి అవడం స్త్రీ జీవితంలో ఒక ప్రత్యేక ఘట్టం. ఈదశలో వివిధ భావోద్వేగాలకు గురవడం సహజం. కాని ప్రతి ఐదు గురిలో ఒకరు మానసిక రుగ్మతను అనుభవించడం విచారకరం, నివారించగల విషాదం. స్త్రీలు గర్భిణులుగా, బాలింతలుగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కొంత మెరుగైనప్పటికి ఇంకా పూర్తి స్ధాయిలో తమ స్వరాల్ని వినిపించడానికి ఆటంకాల్ని ఎదుర్కొంటున్నారు. ‘నువ్వు మానసిక సమస్యల కారణంగా దు:ఖపడుతున్నప్పుడు, ఆ దు:ఖం నీ నిత్య జీవితాన్ని దుర్భరం చేస్తున్నప్పుడు ఆ దు:ఖం నుండి బయటపడడానికి అనేక రకాలుగా ప్రయత్నించవచ్చు, సహాయాన్ని పొందవచ్చు. మౌనంగా ఊబిలో కూరుకుపోవద్దు. పెనుగులాడి బయటకురా. స్ధిరంగా నిలబడి జీవితాన్ని ఆనంద దీపాలతో వెలిగించుకో’.
– డా.ఆలూరి విజయలక్మి
98490 22441 ,గైనకాలజిస్ట్‌, శ్రీ శ్రీ హోలిస్టిక్‌ హాస్పటల్‌, హైదరాబాద్‌

Spread the love