ప్రసూతి ‘పెనాల్టీ’

Maternity 'penalty'– మెటర్నిటీ సెలవు తర్వాత కెరీర్‌కు అడ్డంకులు
– 75 శాతం మంది తల్లులది ఇదే పరిస్థితి
– ‘వాయిస్‌ ఆఫ్‌ ఉమెన్‌ స్టడీ’లో వెల్లడి
న్యూఢిల్లీ: ప్రసూతి సెలవుల తర్వాత చాలా మంది తల్లులు తమ కెరీర్‌లో అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. దాదాపు 75 శాతం మంది తల్లులది ఇదే పరిస్థితి. ‘వాయిస్‌ ఆఫ్‌ ఉమెన్‌’ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 560 కంటే ఎక్కువ కంపెనీలలో 24,000 మంది మహిళా ఉద్యోగులను ఈ అధ్యయనంలో భాగంగా సర్వే చేశారు. అధ్యయనం ప్రకారం.. భారత్‌లో కార్పొరేట్‌ రంగంలో పని చేసే తల్లులు గణనీయమైన సవాళ్లతో పోరాడుతున్నారు. ప్రసూతి సెలవుల తర్వాత తల్లులు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. 75 శాతం మంది పని చేసే తల్లులు ప్రసూతి సెలవు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒకటి నుంచి రెండు సంవత్సరాల వరకు కెరీర్‌లో వైఫల్యాన్ని నివేదించారు. ఈ మహిళల్లో దాదాపు 40 శాతం మంది ప్రసూతి సెలవుపై వెళ్లటం వారి వేతనాన్ని దెబ్బతీస్తున్నది. చాలామంది ఉద్యోగాల్లో తమ స్థానాలను వారు ఇష్టపడని స్థానాలకు మార్చినట్టు గుర్తించారు. పని ప్రదేశాల్లో మహిళలకు పక్షపాతం, వివక్ష ఎదురవుతున్నది. సర్వేలో పాల్గొన్న మహిళల్లో దాదాపు సగం మంది పనిలో పక్షపాతాన్ని అనుభవిస్తున్నట్టు వివరించారు. 37 శాతం మంది వారు సున్నితమైన ప్రవర్తనను ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ఇంకా, ఆరు శాతం మంది లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నట్టు నివేదించారు. వీటిలో సగం కంటే తక్కువ కేసులే అధికారికంగా నివేదించబడటం గమనార్హం.
సీనియర్‌ మేనేజ్‌మెంట్‌, లీడర్‌షిప్‌ రోల్స్‌లో ఉన్న మహిళలు ఎంట్రీ-లెవల్‌ స్థానాల్లో ఉన్నవారితో పోలిస్తే రెండింతలు వివక్షను ఎదుర్కొంటున్నారు. 34 శాతం మంది సీనియర్‌ మహిళలు, 17 శాతం ప్రవేశ స్థాయి మహిళలు పక్షపాతాన్ని ఎదుర్కొంటున్నట్టు నివేదించారు. ఈ పెరుగుతున్న పక్షపాతం మహిళలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. పక్షపాతాన్ని అనుభవించిన మహిళలు ఒక సంవత్సరంలోపు తమ ఉద్యోగాలను విడిచిపెట్టాలని భావించే అవకాశమున్నది. అంతేకాదు, మహిళా నాయకత్వం కార్యాలయంలో వివక్షను ఎదుర్కొంటున్నది. సంస్థల్లో మహిళా నాయకత్వం కొంత సానుకూల ప్రభావాన్ని కలిగి ఉన్నది. సర్వేలో పాల్గొన్న మహిళల్లో సగానికి పైగా (53 శాతం మంది) కనిపించే మహిళా నాయకులు తమ కెరీర్‌ వృద్ధిపై విశ్వాసాన్ని పెంచినట్టు నివేదించారు. కాగా, రంగమేదైనా మహిళలపై అణచివేత కొనసాగుతున్నదనీ, దీనిని నిరోధించటానికి చురుకైన చర్యలు తీసుకోవాలని పాలకులను సామాజికవేత్తలు, మహిళా సంఘాల నాయకులు కోరుతున్నారు.

Spread the love