మెచ్యూరిటీ!

ఎప్పటికీ.. బద్దలుకాని అగ్నిపర్వతాల్ని
మౌనంగ కనీసం గుండెల్లోనైనా గుట్టుగ
పేర్చుకోవడం నేర్చుకోవాలి!

తిట్లని, శాపనార్థాల్ని ఉద్దీపనా బహుమతులుగ
మనసు పొరల్లో రహస్యంగ ఎవరి కంట
పడకుండ దాచుకోవాలి..!

చివరాఖరికి మాటల్తోనైనామనమే ఓ ముందడుగేసి
శత్రువులైనా సరే.. హద్దుల్ని చెరిపేసుకోవాలి!

కినుకలు, అర్థంలేని అలకలు దూరదూరంగ ఉండటం..
నిశ్శబ్దాల్ని మోయడం.. మూతులు తిప్పుకోవడాలూ..
ముఖాల్ని దాచుకోవడాలు..

రానున్నవి గడ్డు రోజులు.. ఏకాంతం అతి ప్రమాదకరం!
ఆస్తులు, అంతస్తులెన్నున్నా ఎంతటి వారికైనా
ఆలోచనల అపరిపక్వత
‘మెచ్యూరిటీ’ అనిపించుకోదు!!

చూపు సక్కగలేనప్పుడు దృష్టి సంక్లిష్టత సహజం!
మనుషుల్తో సావాసమంటెనే కాళ్ళల్ల కట్టిరికినట్లు..
జరంత సల్లు బిగుండాలే!!

అహమో, అజ్ఞానమో రెంటిని పక్కన పెడితే
అందరిలో ఆనందంగ వుంటాం!
ఒకమెట్టు దిగితే ఏం పడిపోం
నెగ్గడం కాదు తగ్గడమే మజా!!

ద్వేషం అసహజాతం!
ప్రేమ సర్వమోద సమ్మతం!!
– అశోక్‌ అవారి, 9000576581

Spread the love