కార్మికుల ఘ‌న‌ చరిత్ర మేడే

Mayday is a solid history of workersమేడే అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యతకు సంకేతం. కార్మిక వర్గ చైతన్యానికి ప్రతీక. శ్రమదోపిడీకి వ్యతిరేకంగా వేలాది గొంతుకలు ఒక్కటైన చరిత్రకు సాక్ష్యం! ఎనిమిది గంటల పనిదినం. కార్మిక హక్కుల కోసం నినదించిన మహోజ్వల ఘట్టం. 138 ఏళ్ల కిందట కార్మికులు సాగించిన వీరోచిన పోరాటాల ఫలితంగానే ప్రపంచ కార్మిక వర్గానికి కొన్ని హక్కులు దక్కాయి. ఆ స్ఫూర్తితో ప్రపంచ దేశాలతో కార్మిక వర్గం సంఘటితమైతే తమ హక్కులు సాధించుకోవచ్చనే నమ్మకంతో ముందుకు కదిలారు. అనేక చట్టాలు రూపొందించుకోగలిగారు! అటువంటి గొప్ప చరిత్ర కలిగిన ప్రపంచ కార్మిక దినోత్సవం గురించి ప్రత్యేక కథనం…
మానవ జాతి చరిత్ర18వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన శతాబ్దంగా పేరుగాంచింది. ఈ శతాబ్దంలోనే ఇంగ్లాండ్‌ మరికొన్ని యూరోపియన్‌ దేశాల్లో ఉత్పత్తి రంగంలో ఆవిరి యంత్రాలను ప్రవేశపెట్టడం ద్వారా పారిశ్రామికీకరణ క్రమం ప్రారంభమయింది. 1776 మార్చిలో వాట్సన్‌ కనిపెట్టిన ఆవిరియంత్రాన్ని ఇంగ్లాండ్‌లో ఒక బొగ్గు గనిలో మొదటిసారిగా ఉపయోగించారు. పారిశ్రామిక విప్లవం ప్రారంభ దినాల్లో కార్మికులు బానిసల్లాగ శ్రమ చేసేవారు. పారిశ్రామిక వేత్తలు అధిక లాభాలను గడించాలనే ఆశతో 6,7 సంవత్సరాల వయసు గల పిల్లల చేత, మహిళల చేత ఫ్యాక్టరీలోనూ, గనులలోనూ పనిచేయిస్తూ వుండేవారు. బాలకార్మికులు గనులలో, చీకటి సొరంగాలలో మోచేతులపైన, మోకాళ్లపైన పాకుతూ బొగ్గును లాగేవారు. పొగ గొట్టంపైకి ఎక్కి వాటిని శుభ్రపరుస్తూ వుండేవారు.
Mayday is a solid history of workersకొరడా దెబ్బలతో శిక్షించేవారు
ఇంగ్లాండ్‌లో అనాధ శరణాలయాల్లోని పిల్లలను శరణాలయాధికార్లు పారిశ్రామిక వేత్తలకు పశువుల వలె అమ్మేవారు. ఆ బాలకార్మికులు ఉదయం నుండి సాయంత్రం వరకు యంత్రాల వద్ద నిలబడి పనిచేసేవారు. క్షణం సేపు కన్ను మూసినా వారిని కొరడా దెబ్బలతో శిక్షించేవారు. ఆనాడు కార్మికులపై పనిభారమే కాక పనిగంటల భారం కూడా అధికంగా వుండేది. రోజుకు 16 గంటలు శ్రమించేవారు. కొంతమంది పెట్టుబడి దార్లు రోజుకు 20 గంటలు కూడా పనిచేయించేవారు. 1806లో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో చెప్పులు కుట్టే కార్మికులు సమ్మె చేశారు. కార్మిక నాయకులపై విచారణ జరిగే సందర్భంలో యజమానులు కార్మికులచే రోజుకు 19, 20 గంటలు పని చేయించుకుంటున్నారన్న విషయం వెల్లడైంది.
యంత్రాల ధ్వంసం
పారిశ్రామికాధిపతులు కార్మికులకు అతి తక్కువ వేతనం ఇచ్చేవారు. కార్మికులకు ఎట్టి భద్రతగాని, సౌకర్యాలు గాని వుండేవి కావు. గాలి, వెలుతురు లేని ఫ్యాక్టరీల్లో కార్మికులకు యంత్రాల నుండి రక్షణ వుండేది కాదు. అందుచేత తరచుగా వారు ప్రమాదాలకు గురై మరణిస్తూ వుండేవారు. పైగా కార్మికులు అమానుష శిక్షలకు గురయ్యేవారు. కదలినా, మాట్లాడినా, పాటలు పాడుకున్నా, చివరికి కళ్లు కడుక్కున్నా రెండు షిల్లింగులు జరిమానా కట్టవలసి వచ్చేది. కార్మికులు తాము అనుభవించే పీడనకు, దోపిడీకి కారణం యంత్రాలని భావించి, యంత్రాలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఈ విధ్వంసకాండ మొదట బ్రిటన్‌తో ప్రారంభమైంది. దాంతో పారిశ్రామికాధిపతులు ప్రభుత్వ సహాయం కోరారు. నికృష్ణ పరిస్థితుల్లో దోపిడీకి గురవుతున్న కార్మికుల ప్రాణ రక్షణకు చొరవ చూపించని ప్రభుత్వం యజమానుల ఆత్మ రక్షణకు మాత్రం వెంటనే పార్లమెంటును ఉపయోగించింది. యంత్రాలను ధ్వంసం చేసేవారికి మరణశిక్ష విధిస్తూ 1812లో చట్టం చేసింది. అయితే కాలక్రమేణా కార్మికులు యంత్రాలను ధ్వంసం చేయటంలో అర్ధం లేదని, తమ బాధలకు, దుస్థితికి ఫ్యాక్టరీ యజమానులే కారణమని గ్రహించారు. తమ దుస్థితి నుండి బయటపడడానికి సంఘటితంగా దోపిడీ మూకలకు వ్యతిరేకంగా పోరాటం చేయటమొక్కటే మార్గమని అర్ధం చేసుకున్నారు. దానితో బూర్జువా వర్గానికి వ్యతిరేకంగా శ్రామికవర్గం పోరాట పతాకాన్ని ఎగురవేసింది.
కార్మిక సంఘాల నిర్మాణం
అణగదొక్కబడిన కార్మికవర్గం తమ హక్కుల సాధన కోసం చైతన్యవంతంగా పోరాటాలు జరపడానికి వీలుగా కార్మిక సంఘాల నిర్మాణానికి పూనుకుంది. 1764 – 1800ల మధ్య గ్రేట్‌ బ్రిటన్‌ ట్రేడ్‌ యూనియన్ల నిర్మాణం జరిగింది. అమెరికాలో ఫిలడెల్ఫియా నగరంలో పోరాట సంప్రదాయం గల కార్మికులు 1806లో ‘మెకానిక్స్‌ యూనియన్‌’ పేరుతో కార్మిక సంఘాన్ని స్థాపించారు. అదే అమెరికాలోని మొట్టమొదటి కార్మిక సంఘం. 1850- 60 నాటికే యూరప్‌ ఖండంలోని అనేక దేశాల్లోను, అమెరికన్‌ కార్మికులు విప్లవోత్సాహంతో శక్తివంతమైన కార్మిక సంఘాలను నిర్మించారు. తమ హక్కుల సాధన కోసం క్రియాశీల పోరాటంలోకి దూకారు.
మహత్తర ఆయుధం
ట్రేడ్‌ యూనియన్ల మహత్తర సామాజిక శక్తిని చూసి పాలకులు హడలెత్తిపోయారు. ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల్లో కార్మికులు అధిక జీతాలు డిమాండ్‌ చేయడం కోసం కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకోవడం చట్టవిరుద్దమని ప్రకటించడమే కాదు, అలాంటి ట్రేడ్‌ యూనియన్‌లు నిషేధించబడ్డాయి. సమ్మె చేసే హక్కును, పికెటింగ్‌ హక్కును నిషేధించారు. అయినా ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం అంతరించలేదు. తమ జీవన పరిస్థితులను మెరగుపరచుకునేందుకు కార్మికులకు గల మహత్తర ఆయుధం అది. దానిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు. పాలకుల ట్రేడ్‌ యూనియన్లను నిషేధించినా కార్మిక వర్గ పోరాటాలన రక్తసిక్తం చేసినా కార్మిక వర్గం వెనుకంజ వేయలేదు. పనిగంటల తగ్గింపు కోసం, న్యాయమైన వేతనాల కోసం, ట్రేడ్‌ యూనియన్ల గుర్తింపు కోసం, ప్రభుత్వ పరంగా హక్కుల కొరకు కార్మిక వర్గం చైతన్యంతో పోరాటాలను కొనసాగించింది. ఈ పోరాట జ్వాలలు 19వ శతాబ్దం ప్రథమార్ధంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, అమెరికా దేశాల్లోని దోపిడీ శక్తులను చుట్టముట్టాయి. కార్మిక వర్గం బలమైన పోరాటాలు జరపడంతో ప్రభుత్వాలు దిగొచ్చి కార్మిక వర్గానికి అనుకూలంగా కొన్ని చట్టాలు చేశాయి. వాటిలో ముఖ్యమైనవి పని గంటలు, బాల కార్మికులకు సంబంధించినవి. పోరాటాల ఫలితంగా కొన్ని చట్టాలు చేయబడినప్పటికీ అధికారులు మాత్రం వాటిని చిత్తశుద్ధితో అమలు చేయలేదు.
8 గంటల పనిదినం
1870 నాటికే పారిశ్రామిక, వాణిజ్య, బ్యాంకింగ్‌ రంగాల్లో గుత్తాధిపత్యం రూపుదాల్చింది. కొన్ని ఒడిదుడుకులకు గురైనప్పటికీ పెట్టుబడిదారీ వర్గం అధికలాభాలు పోగుచేసుకోవడానికి మంచి అవకాశాలు ఏర్పడ్డాయి. కానీ కార్మికవర్గం జీవితాల్లో మాత్రం ఎటువంటి అభివృద్ధి లేదు. దానితో కార్మిక వర్గం పనిగంటల తగ్గింపు కోసం ఉద్యమించింది. 1881 చికాగో నగరంలోని వివిధ కార్మిక సంఘాలు కలసి ‘అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌’ అనే పేరుతో ఒక సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాయి. 1884 అక్టోబర్‌ 7వ తేదీన ఈ సమాఖ్య నాల్గవ సమావేశంలో 8 గంటల పనిదినం కోసం చారిత్రాత్మకమైన తీర్మానం చేసింది. ఈ హక్కును సాధించడం కోసం 1886 మే మొదటి తేదీన దేశమంతటా కార్మికవర్గం సమ్మె పోరాటాలు నిర్వహించాలని కూడా నిర్ణయించబడింది. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటానికి అమెరికాలోని ఆనాటి భౌతిక పరిస్థితులు కూడా చాలా తోడ్పడ్డాయి. 1880 – 90 మధ్యకాలంలో అమెరికాలో పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. 1884 – 85 మధ్య ఆర్థిక సంక్షోభం రావటంతో అనేక మంది కార్మికుల నిరుద్యోగానికి గురయ్యారు. పనిచేస్తున్న కార్మికుల స్థితిగతులు కూడా అతి దుర్భరంగా తయారయ్యాయి. ఎనిమిది గంటల పనిదినం ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవలసిన అవసరాన్ని కార్మికవర్గం అత్యంత ముఖ్యమైన డిమాండుగా గుర్తించింది. ట్రేడ్‌ యూనియన్‌ల సభ్యత్వం పెరిగింది. మేడే సమ్మె సన్నద్దంగా 1885 – 86 లో మిగిలిన పోరాటాల్లో కూడా లక్షలాది కార్మికులు పాల్గొన్నారు. 1866 సెప్టెంబర్‌లో జనీవాలో జరిగిన మొదటి ఇంటర్నేషనల్‌ మహాసభ కూడా రోజుకి 8 గంటల పనిని చట్టబద్దం చేయాలని కోరుతూ తీర్మానం చేసింది.
చారిత్రాత్మకమైన మేడే
చికాగో కార్మిక వర్గం అమెరికన్‌ కార్మికవర్గంలో ఒక భాగమే అయినా అక్కడ కార్మిక వర్గానికి ఒక ప్రత్యేకత వుంది. సమ్మెకు కొన్ని రోజుల ముందుగానే అనేక రాజకీయ దృక్పథాలు గల వారితో ‘8 గంటల పనిదినం’ సంఘం ఒకటి ఏర్పడి పనిచేయసాగింది. ఆ సంఘం నాయకత్వంలో మే 1వ తేదీకి ఒక రోజు ముందు ఆదివారం నాడు 25 వేల మంది కార్మికులతో బ్రహ్మాండమైన ప్రదర్శన జరిగింది. మే ఒకటిన నగర వీధులన్నీ ఉత్సాహవంతులైన కార్మికులతో నిండిపోయాయి. నగరంలో బ్రహ్మాండమైన సార్వత్రిక సమ్మె జరిగింది. ఫ్యాక్టరీలన్నీ మూతబడ్డాయి. అదివరకెన్నడూ కనీవినీ ఎరుగని ఐకమత్యంతో మూడు లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. 8 గంటల పనిదినాన్ని సాధించి తీరుతాం అనే దృఢ విశ్వాసం వారందరిలోనూ కన్పించింది. విజృంభిస్తున్న ఈ కార్మికోద్యమాన్ని ఏ విధంగానైనా నాశనం చేయాలని కార్మిక వర్గ శతృవులు, పెట్టుబడిదారులు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం వారికి అండగా నిలబడింది. మే 3వ తేదీన శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులు కాల్పుల జరిపి ఆరుగురి ప్రాణాలను బలిగొన్నారు.
రక్తంతో తడిసిన హే మార్కెట్‌
ఈ దారుణ హత్యాకాండకు నిరసనగా 4వ తేదీన చికాగో నగరం మధ్యలో వున్న ఈ మార్కెట్‌లోకి కార్మికులు పెద్ద సభ జరిపారు. ప్రశాంతంగా జరుగుతున్న ఆ సభ మీద కూడా పోలీసులు విరుచుకుపడ్డారు. పోలీసు యంత్రాంగం కుట్రలో భాగంగా పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఆ దాడిలో ఒక పోలీసు మరణించగా, దానిని సాకుగా చూపి పోలీసులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో అనేకమంది కార్మికులు మరణించారు. హే మార్కెట్‌ ప్రాంగణం కార్మికుల రక్తంతో తడిసిపోయింది. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మికులపై తప్పుడు కేసులు బనాయించారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. కార్మికులు పై కోర్టుకు అప్పీలు వేయగా శిక్షలను ఖరారు చేసింది. 1887 నవంబర్‌ 10న ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు అనగా 1887 నవంబర్‌ 11న ఆగస్ట్‌స్పైస్‌, ఆల్బర్ట్‌ పార్సన్స్‌, అడాల్ఫ్‌ ఫిషర్‌, జార్జి ఏంగెల్స్‌ నలుగురిని ఉరితీశారు. ఆ తరువాత ఆరేండ్లకు మిగిలిన ఇద్దరిని ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు. ఆ విధంగా 1886 మే మొదటి తేదీ ప్రపంచ కార్మిక వర్గ విప్లవ చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించదగిన తేదీగా మారిపోయింది.
త్యాగాన్ని స్మరించుకుంటూ
ఆనాటి పోరాటోద్యమానికి చికాగో నగరమే కేంద్రం అయినప్పటికీ దేశంలోని అనేక ముఖ్య నగరాలకు ఆ ఉద్యమం వ్యాపించింది. 1889 జులైన పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్ట్‌ ప్రతినిధుల రెండవ ఇంటర్నేషనల్‌ సమావేశం చికాగో నగరంలో హే మార్కెట్‌ అల్లర్లలో జరిగిన కాల్పుల్లో మరణించిన కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీన కార్మికుల దీక్షా దినంగా పాటించాలని తీర్మానించింది. 1890 నుంచి ప్రపంచవ్యాప్తంగా మేడే జరుగుతోంది. మనదేశంలో 1923లో మొట్టమొదటిసారిగా అప్పటి మద్రాసు నగరంలో లేబర్‌ కిసాన్‌ పార్టీ ఆధ్వర్యంలో మే డేను జరుపుకున్నాం. మద్రాస్‌ మెరీనా బీచ్‌లో కామ్రేడ్‌ సింగారవేలు ఎర్రజెండా ఆవిష్కరించారు. ఎనిమిది గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వ్యక్తిగత జీవితం కోసం చేసిన పోరాటానికి చిహ్నం మేడే. గరిష్టంగా రోజుకి 8 గంటల పని. వారానికి 48 గంటల పని వుండాలని 1919లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ మొదటి సమావేశం నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం మేడే జరుపుకుంటున్న ఈ సందర్భంలో పెట్టుబడిదారీ దేశానికి 8 గంటల పనిదినంతో పాటుగా కష్టపడి సాధించుకున్న హక్కులన్నీ దాడికి గురవుతున్నాయి. కార్మిక సంఘాల హక్కులపై, మరీ ముఖ్యంగా సమ్మె చేసే హక్కులపై దాడి జరుగుతోంది.
నిర్ణీత సమయం లేకుండా
2020లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకువచ్చింది. వాటిలో ఒకటైన ఉపాధి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించిన నిబంధనల విషయంలో ఆయా సంస్థలకు మినహాయింపునిచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నది. ఆ వెంటనే కర్ణాటక వంటి పలు రాష్ట్ర ప్రభుత్వాలు పని గంటలను 8 నుండి 12కు పెంచుతూ ఫ్యాక్టరీ చట్టాన్ని సవరించాయి. నిజానికి చట్టప్రకారం 8 గంటల పని అన్నమాటే కానీ నేడు ఇంచుమించు అన్ని రంగాలలో కార్మికులు, ఉద్యోగులు అనధికారికంగా 10-12 గంటలు పనిచేస్తున్నారు. ముఖ్యంగా కరోనా అనంతరం ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’ తప్పనిసరి అయిన పరిస్థితుల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు, వైద్య ఆరోగ్య రంగంలో పనిచేసే స్టాఫ్‌ నర్సులు, హౌస్‌కీపింగ్‌ సిబ్బంది తదితర ఉద్యోగులకు నిర్ణీత సమయం లేకుండా పోయింది. పారిశ్రామిక కార్మికుల పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది. ఏండ్ల తరబడి కనీస వేతనాలలో పెంపుదల లేకపోగా, మరోవైపు 10-12 గంటలు పని చేయక తప్పని పరిస్థితి.
70 గంటలు పని చేయాలంటూ
ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ రంగంలో ట్రక్‌ డ్రైవర్స్‌ రోజుకి కనీసం 14 గంటలు పనిచేస్తున్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి. ఎటువంటి చట్టాలు, హక్కులు లేని పరిస్థితుల్లో లక్షలాది యువత గిగ్‌ వర్కర్లుగా, స్కీం వర్కర్‌లుగా, షాప్స్‌, మాల్స్‌లో సేల్స్‌ పర్సన్స్‌గా 12 గంటలకు మించి పనిచేస్తున్నారు. వారు పని సమయంలో, విధి నిర్వహణలో ప్రమాదాల బారి పడినా యాజమాన్యాలు పట్టించుకునే పరిస్థితి లేదు. వాస్తవ పరిస్థితి ఈ విధంగా వుంటే ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి వంటి పారిశ్రామిక వేత్తలు మాత్రం వారానికి 70 గంటలు పని చేయాలంటూ దేశ యువతకు పిలుపునిస్తున్నారు. అంటే వారాంతపు సెలవు కూడా లేకుండా రోజుకి 10 గంటలు, వారంలో ఏడు రోజులూ పని చేయాలని, లేకపోతే సోమరుల కింద లెక్కేనని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కార్మిక వర్గం నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది.
పని ప్రదేశాలు సురక్షితంగా
దశాబ్దాల తరబడి పోరాడి సాధించున్న కార్మిక హక్కులు నీరుకారిపోతున్నాయి. కార్మిక చట్టాలకు రక్షణ లేకుండా పోతోంది. దేశ, విదేశ బహుళజాతి సంస్థలు అధిక ఉత్పత్తి, సుదీర్ఘ పనిగంటలు, తప్పనిసరి ఓవర్‌టైం వంటి డిమాండ్లను ముందుకు తెస్తున్నాయి. మనదేశంలో కార్మికులు గౌరవప్రదమైన, ఆరోగ్యకరమైన జీవనం సాగించాలంటే వారికి రోజుకు 8 గంటల పని మాత్రమే కల్పించాల్సిన అవసరం ఉంది. పని ప్రదేశాలను సురక్షితమైనవిగా ఉంచాల్సిన బాధ్యత కూడా యాజమాన్యానిదే. ప్రభుత్వాలు ఆ దిశగా చట్టాలు రూపొందించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
శ్రామిక వర్గ ఐక్యత కీలకం
పేదరికం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రభుత్వాలు అదుపు చేయలేని అధిక ధరలు, నిరద్యోగం, ఉద్యోగాల తొలగింపులు, పెన్షన్‌, ఆరోగ్య సంరక్షణ, శ్రామిక మహిళల హక్కులు, ధనిక పేద అంతరాలు, నేటి ప్రధాన సమస్యలు. వీటిని పరిష్కరించుకోకుండా శ్రామిక వర్గానికి పేద ప్రజల జీవితాలకు విముక్తి రాదు. లక్ష్య సాధనకు శ్రామిక వర్గ ఐక్యత కీలకం! మేడే రగిలించిన పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకుని అమరుల ఆశయాల అడుగుజాడల్లో కార్మికవర్గం కదం తొక్కాలి. మేడే గతించిన చరిత్ర కాదు. గర్జిస్తున్న కార్మికుల ఘనచరిత్ర అని నినదించాలి.

Spread the love