గ్రామంలో ఆర్ఎంపీ, పట్నంలో ఎంబీబీఎస్?

– వేలల్లో నెలకు.. లక్షలల్లో అక్రమ సంపాదన
– గ్రామంలో సంపాదన సరిపోక…ప్రస్తుతం విద్యానగరలో ఓ హాస్పిటల్ పెట్టినట్టు గుసగుసలు
– వైద్యశాఖ అధికారులు స్పందించాలని కోరుతున్న ప్రజలు
నవతెలంగాణ – చివ్వెంల
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటీవల దేవుడి పేరుతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభమైందని, గతంలో నడిపిన హాస్పిటల్ యాజమాన్యం వదిలేసి పోవడంతో ప్రస్తుతం ఓ ఆర్ఎంపీ దానిని పేరు మార్చి నడుపుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్ఎంపీ వైద్యంలో 20 ఏండ్లకు పైగా చేసిన అనుభవంతో తోటి సహచరుల సహకారంతో హాస్పిటల్ పెట్టాడని సమాచారం. కానీ హాస్పిటల్ బోర్డుపై మాత్రం ఓ ఎంబీబీఎస్, ఎండీ డాక్టర్ పేరు ఉంటుందని, కానీ హాస్పిటల్ లోపల డాక్టర్ ఉండడు. ఆర్ఎంపీ మాత్రమే వైద్యసేవలు అందిస్తుంటాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. వేరే గ్రామం నుండి వైద్యం పేరుతో చివ్వేంల  మండలంలోని ఓ  గ్రామానికి వచ్చిన ఆయన 20 ఏండ్లకు పైగా అదే గ్రామంలో వైద్యం చేసి, అదే వైద్యాన్ని అడ్డం పెట్టుకొని ఎల్ఐసీ ఏజెంట్ గా, అక్రమ చిట్టీల వ్యాపారిగా అవతరమెత్తి, తాను వైద్యం చేయాలంటే నాకు పాలసీ లేదా నెలవారీ చిట్టీలు కట్టాలని, అమాయక ప్రజలకు భయబ్రాంతులకు గురిచేసి, రెండు చేతుల సంపాదించడం మొదలుపెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండింటితో రోజుకు వేలల్లో, దాదాపుగా నెలకు లక్షలల్లో సంపాదించడం మొదలుపెట్టడమే కాక, ఆగ్రామంలో రెండు చేతులసంపాదన సరిపోక, ప్రస్తుతం జిల్లా కేంద్రంలో విద్యానగర్ లో ఓ దేవుడి పేరుతో హాస్పిటల్ ను ప్రారంభించాడని, ఆ ఆర్.ఎం.పీ వైద్యం చేసే గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ హాస్పిటల్ లో డాక్టర్ ఉండడు. ఇతనే వైద్య సేవలు అందిస్తున్నాడని, కానీ ఇటుగా చూడాల్సిన ప్రభుత్వ వైద్యాధికారులు మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తుడడంతో ఇతని సంపాదన మూడు పువ్వులు,  ఆరుకాయలుగా సాగుతుందని సమాచారం. ఎవరైనా రోగులు నా హాస్పిటల్ కి వస్తేనే ఊర్లో వైద్యం చేస్తానని, లేకపోతే గ్రామంలో వైద్యం చేసే పరిస్థితి లేదని బెదిరింపులకు గురి చేస్తూ, అక్రమ సంపాదనకు తెరలేపాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించి ఇతనిపై, ఇతని హాస్పిటల్ పై సమగ్ర విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
హాస్పిటల్ పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం: డీఎంహెచ్ఓ, కోటాచలం
ఎంబీబీఎస్ డాక్టర్ పేరును బోర్డుపై ఉంచి, ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం చేయడం చాలా తప్పు. అలాంటి హాస్పిటల్ పై విచారణ చేసితప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం.
Spread the love