మెక్‌ములన్‌ మెరిసె

మెక్‌ములన్‌ మెరిసె– ఓమన్‌పై స్కాట్లాండ్‌ గెలుపు
– సూపర్‌8 ఆశలు మరింత మెరుగు
– ఓమన్‌ 150/7, స్కాట్లాండ్‌ 153/3
నవతెలంగాణ-నార్త్‌సౌండ్‌
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-బిలో టాప్‌-2 రేసు ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ వర్షార్పణం కాగా.. తర్వాతి మ్యాచుల్లో వరుస విజయాలు సాధించిన స్కాట్లాండ్‌ సూపర్‌8 బెర్త్‌పై కన్నేసింది. మూడు మ్యాచుల్లో ఐదు పాయింట్లు సాధించిన స్కాటాండ్‌ ప్రస్తుతం గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్‌ గ్రూప్‌లో చివరి రెండు మ్యాచుల్లో నెగ్గినా గరిష్టంగా ఐదు పాయింట్లు సాధించగలదు. స్కాట్లాండ్‌ ధనాత్మక నెట్‌రన్‌రేట్‌ను అధిగమించటం సైతం ఇంగ్లాండ్‌కు సవాల్‌గా మారనుంది. ఇక, ఆదివారం అర్థరాత్రి జరిగిన (భారత కాలమానం ప్రకారం) మ్యాచ్‌లో ఓమన్‌పై స్కాట్లాండ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 151 పరుగుల ఛేదనలో నం.3 బ్యాటర్‌ బ్రాండన్‌ మెక్‌ములన్‌ (61 నాటౌట్‌, 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌ జార్జ్‌ మున్సే (41, 20 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మైకల్‌ జోన్స్‌ (16), రిచీ బెరింగ్టన్‌ (13), మాథ్యూ క్రాస్‌ (15 నాటౌట్‌) రాణించారు. 13.1 ఓవర్లలోనే 153 పరుగులు చేసిన స్కాట్లాండ్‌ మరో 41 బంతులు ఉండగానే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఓమన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఓపెనర్‌ ప్రతీక్‌ (54, 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయాన్‌ ఖాన్‌ (41 నాటౌట్‌, 39 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. ఓమన్‌కు మూడు మ్యాచుల్లో ఇది మూడో పరాజయం. బ్రాండన్‌ మెక్‌ములన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. స్కాట్లాండ్‌ గ్రూప్‌ దశలో తన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Spread the love