నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎంసీపీఐ(యూ) రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ఆదివారం నుంచి వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రారంభం కానున్నాయి. ఈనెల ఆరో తేదీ వరకు జరుగుతాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చిస్తామని తెలిపారు. తమ పార్టీ నిర్మానాన్ని బలోపేతం చేసేందుకు 25 జిల్లాల నుంచి ఎంపిక చేసిన 350 మంది ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. మొదటిరోజు ఆదివారం నర్సంపేట పట్టనంలో ప్రజా ప్రదర్శన, భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని వివరించారు. తమ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, ఆర్‌ఎంపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, కేరళ ఎమ్మెల్యే కెకె రేమా, ఏఐఎఫ్‌డబ్ల్యూ జాతీయ నాయకులు సేలీనా, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాటం నాగభూషణం, వల్లేపు ఉపేందర్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి తీర్మానాలు చేస్తామని పేర్కొన్నారు.