– వాస్తవ చిత్రాన్ని ప్రతిబింబించని ఆర్థిక సర్వేలు
– ఫీల్ గుడ్ అంటూ పాలకుల కాలక్షేపం
– పెరుగుతున్న ప్రజా సమస్యలు…లభించని పరిష్కారాలు
– చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోని ప్రభుత్వం
– విధాన మార్పులు తప్పవంటున్న ఆర్థిక నిపుణులు
కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ నెల 23న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. గత బీజేపీ ప్రభుత్వం ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమర్పణకు ముందు గత సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సరం ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉంది, రాబోయే కాలంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే అంశాలను అందులో పొందుపరుస్తారు. ప్రభుత్వం తీసుకోబోయే దిద్దుబాటు చర్యలను ఈ సర్వే సూచిస్తుంది. అయితే ప్రభుత్వం గత అనుభవాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవడం లేదని, దిద్దుబాటు చర్యల ఊసే ఉండడం లేదని ఇటీవలి అనుభవాలు చెబుతున్నాయి.
న్యూఢిల్లీ : ప్రభుత్వ రాజకీయ నిర్ణయాలు ప్రజల అవసరాలకు భిన్నంగా ఉంటాయి. బడ్జెట్ చాలా మందికి కొరుకుడు పడని పత్రాల సమాహారం. అది ఓ అంకెల గారడీ. ప్రజాకర్షణ పథకాల ప్రకటనతో నిండి ఉంటుంది. అయినప్పటికీ ప్రజా సమస్యలు యథావిధిగా అపరిష్కృతంగా ఉంటూనే ఉంటాయి. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అంతా భేషుగ్గా ఉన్నదని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం అందులో చెప్పుకుంటుంది. బడ్జెట్‌లో బయటపెట్టే సమాచారం కూడా పరిమితమైనదే. ముందుగానే ఎంపిక చేసుకొని దానిని బడ్జెట్‌లో పొందుపరుస్తారు. పూర్తి చిత్రం బయటపడదు కాబట్టి ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి విశ్లేషకులు ఇతర అంశాలను కూడా పరిశీలిస్తారు. ప్రభుత్వ అనుకూల ఆర్థికవేత్తలు బడ్జెట్‌ను పొగుడుతుంటే విమర్శకులు వాస్తవ చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు.
2011 లెక్కలే ప్రామాణికం
బడ్జెట్‌లో రెండు ప్రధానాంశాలు ఉన్నాయి. మొదటిది కీలక సమాచారం బయటపెట్టకపోవడం. రెండోది అందించిన సమాచారం కూడా అవాస్తవాలతో కూడుకోవడం. ఉదాహరణకు 2021లో జనగణన చేయాల్సి ఉంది. కోవిడ్ తర్వాత పలు దేశాలు జనాభా లెక్కలు సేకరించినప్పటికీ మన ప్రభుత్వం ఆ ప్రక్రియను ఇంకా ప్రారంభించనే లేదు. పలు సర్వేల నిర్వహణ, సమాచార సేకరణ కోసం జనగణన అవసరమవుతుంది. ఇప్పుడు అన్నింటికీ 2011 లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే అప్పటి నుండి దేశంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కాబట్టి ఫలితాలు 2024 పరిస్థితిని ప్రతిబింబించవు. ఉపాధి, వ్యవసాయోత్పత్తి, అసంఘటిత రంగం, పేదరికం, అసమానతలు వంటి అంశాలకు సంబంధించిన సమాచారాన్ని వక్రీకరించి చూపుతున్నారు.
దిగజారిన ర్యాంకింగులు
స్టాక్ మార్కెట్ మదింపులు రికార్డు స్థాయిలో ఉండడాన్ని చూస్తుంటే కోవిడ్ తర్వాత సంఘటిత రంగం ఎలా కోలుకున్నదీ అవగతమవుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు సూచిక అని ప్రభుత్వం చెబుతోంది. విదేశీ మదుపరులు కూడా సంఘటిత రంగంలోనే పెట్టుబడులు పెడుతున్నారు. అసంఘటిత రంగంపై వారికి ఆసక్తి లేదు. ఇక్కడ ఓ విషయాన్ని గమనించాల్సి ఉంది. నిరుద్యోగం, వినియోగంపై జాతీయ సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించడమే కాదు…ఆకలి, పత్రికా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం వంటి విషయాలలో అంతర్జాతీయ సూచికలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దానిని అంగీకరించేందుకు ప్రభుత్వం తిరస్కరిస్తోంది. అంతర్జాతీయ ర్యాంకింగులు వంద శాతం కచ్చితమైనవి కాకపోయినప్పటికీ దిగజారుతున్న మన స్థాయిని ప్రతిబింబిస్తున్నాయి. కొన్ని సూచికలలో ఇతర దేశాల కంటే మన దేశం పనితీరు దారుణంగా ఉంది. గత దశాబ్ద కాలంలో పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం క్షీణించాయి. పాలకుల నిరంకుశత్వం కారణంగా మతపరమైన వేధింపులు పెరిగిపోయాయి. ప్రతిపక్షాలపై దాడి చేసేందుకు దర్యాప్తు సంస్థలను ఓ పథకం ప్రకారం ఉపయోగించుకుంటున్నారు.
పాఠాలు నేర్వని ప్రభుత్వం
సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రభుత్వం తొలిసారి ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతోంది. ఎన్నికల్లో ఎదురైన ఎదురు దెబ్బల నుండి పాలకులు గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరించడానికి విధానాలలో మార్పులు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో గత ఐదు సంవత్సరాల వాస్తవ చిత్రాన్ని ఆర్థిక సర్వే ప్రజల ముందు ఉంచాలి. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి పెరుగుతున్న ఆర్థిక అశాంతి మాత్రమే కారణం కాదు. ప్రజల వ్యతిరేకతకు నేపథ్యం కూడా కారణమే. ఒకవేళ అంతా బాగుంది అని ఆర్థిక సర్వేలో ప్రభుత్వం చెప్పుకుంటే విధానాల్లో మౌలిక మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రజా సమస్యలు అలాగే ఉంటాయి. ‘ఒకే దేశం…ఒకే ఎన్నిక’ విధానానికి ప్రభుత్వం స్వస్తి చెబితే మంచిది. ప్రభుత్వం తన విధానాలు మార్చుకోకపోతే రాబోయే కాలంలో మరిన్ని ఎదురు దెబ్బలు తప్పవు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక సమస్యలను గత ఐదు సంవత్సరాలుగా…ముఖ్యంగా గడచిన ఏడాదిలో ప్రభుత్వం పరిష్కరించి ఉండాల్సింది. కానీ ఆ పని జరగలేదు. జరిగిన తప్పిదాలను సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం సుతరామూ ఇష్టపడలేదు. దాని ఫలితం సార్వత్రిక ఎన్నికల్లో కన్పించింది.
గత చేదు అనుభవాల నుండి ప్రభుత్వం పాఠాలు నేర్చుకుంటుందా? ఆర్థిక సర్వే వాస్తవికతను ప్రతిబింబిస్తుందా? ప్రభుత్వం విధానపరమైన లోపాలను సవరించుకొని ప్రజల ముందుకు వస్తుందా? అసత్యాలు, కట్టుకథలను ప్రచారం చేసి ఇంతకాలం పబ్బం గడుపుకున్న పాలకులు ఇకనైనా కళ్లు తెరిచి బడ్జెట్‌లో ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభించాలంటే రాబోయే పార్లమెంట్ సమావేశాల వరకూ వేచి చూడక తప్పదు.
తప్పుడు లెక్కలు… అందమైన అబద్ధాలు
కోవిడ్ మహమ్మారి ప్రభావం అధికంగా ఉన్నప్పుడు కూడా 2020-21లో పేదరికం తగ్గిందని తప్పుడు లెక్కలు చూపారు. అలాగే 2014-2024 మధ్య కాలంలో 24 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారంటూ మరో అందమైన అబద్ధం చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవ చిత్రాన్ని అందించేందుకు విమర్శకులు ప్రత్యామ్నాయ సమాచారాన్ని ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, విమర్శకుల వాదనకు మధ్య చాలా తేడా ఉంటోంది. దేశంలో ఆర్థికాభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవం. అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. అయితే అదే సమయంలో పేదరికం అలాగే ఉంది. విద్య, ఆరోగ్యంలో నాణ్యత లోపించింది. ఈ సమస్యలే సమాజానికి ఆందోళన కలిగిస్తున్నాయి. వీటినే విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత పరిస్థితిలో పెద్దగా మార్పేమీ రాలేదు. అసంఘటిత రంగాన్ని తొక్కేసి సంఘటిత రంగం వృద్ధి చెందుతోంది.
అనుకున్నదొక్కటి… అయ్యిందొక్కటి
డిజిటలైజేషన్ ప్రక్రియ అవినీతిని అరికడుతుందని భావించారు. జీఎస్టీ కూడా ఆ పని చేస్తుందని అనుకున్నారు. కానీ బూటకపు కంపెనీలు పుట్టుకొచ్చి ప్రయోజనం పొందాయి. జీఎస్టీ ఎగవేత కారణంగా ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. నకిలీ ఆధార్ కార్డులు, ఖాతాల హ్యాకింగ్ వంటివి పెరిగిపోయాయి. డిజిటలీకరణతో నగదు చెలామణిని తగ్గించవచ్చునని ప్రభుత్వం అనుకుంది. కానీ ఇప్పుడు అది మరింత పెరిగింది. 2012-13 తర్వాత పెట్టుబడుల స్థాయి పడిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం సమస్యను మరింత పెంచింది. బడ్జెట్ లోటు పెరిగిపోవడంతో కార్మికులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను ప్రభుత్వం కుదిస్తోంది. బడా కంపెనీలపై మాత్రం వరాల జల్లులు కురిపిస్తూనే ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వం వ్యయం తగ్గిపోతోంది.