మెదక్‌ బంద్‌ ప్రశాంతం

Medak Bandh is peaceful– బందోబస్తును పర్యవేక్షించిన ఐజీ
నవ తెలంగాణ-మెదక్‌ టౌన్‌
మెదక్‌ పట్టణంలో శనివారం జరిగిన ఘర్షణ, పరస్పర దాడుల నేపథ్యంలో బీజేపీ, బీజేవైఎం ఆదివారం మెదక్‌ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్‌ బంక్‌లు, హౌటళ్లు, దుకాణాలు స్వచ్చందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు యదావిధిగా నడిచాయి. బస్టాండ్‌లు, చౌరస్తాల వద్ద పోలీస్‌ పికెట్‌లు ఏర్పాటు చేయడంతో పాటు పట్టణంలో పెట్రోలింగ్‌ నిర్వహించారు. మల్టీజోన్‌ ఐజీ రంగనాథ్‌ మెదక్‌ పట్టణానికి వచ్చి, ఎస్పీ బాలస్వామితో కలిసి పరిస్థితిని సమీక్షించారు. శనివారం జరిగిన సంఘటనతో సంబంధం ఉన్న ఇరు గ్రూపులకు చెందిన పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా మెదక్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన పీస్‌ కమిటీ సమావేశంలో ఐజీ రంగనాథ్‌ మాట్లాడారు. రెండు వర్గాల మధ్య గొడవల్లో ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం, గొడవలు పడటం, దుకాణాలు, ఆస్పత్రులపై దాడులు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల వారు శాంతి సామరస్యంతో మెలగాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే పోలీసుల దృష్టికి తీసుకువచ్చి సామరస్యంగా పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేంలో ఎస్పీ బాలస్వామి, ఏఎస్పీ మహేందర్‌, మున్సిపల్‌ చైర్మెన్‌ చంద్రపాల్‌, మాజీ చైర్మెన్‌ బట్టి జగపతి, కౌన్సిలర్‌ లక్ష్మీనారాయణ గౌడ్‌, బీజేపీ జిల్లా నాయకులు నందారెడ్డి, గడ్డం కాశీనాథ్‌, మైనార్టీ నాయకులు ఖాజా మొహినొద్దీన్‌, జావేద్‌ మౌలానా, భారత్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love