బీఆర్‌ఎస్‌లో చేరిన మెదక్‌ డీసీసీ అధ్యక్షులు కె.తిరుపతిరెడ్డి

– కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు సమక్షంలో మెదక్‌ జిల్లా డీసీసీ అధ్యక్షులు కె.తిరుపతిరెడ్డి చేరారు. ఆయనకు కేటీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ..పదేండ్లుగా కాంగ్రెస్‌ పార్టీని మెదక్‌ జిల్లాలో బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేశానన్నారు. ఆ పార్టీ తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తానని మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్‌లో పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులకు కాకుండా పారాషూట్‌ లీడర్లకి, డబ్బుల సంచులతో వచ్చే వారికి మాత్రమే టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ తరుణంలోనే ఆ పార్టీని వీడి ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేసేందుకు బీఆర్‌ఎస్‌లో చేరానని తెలిపారు. మెదక్‌ జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరుతారని చెప్పారు. మెదక్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. కేటీఆర్‌ మాట్లాడుతూ..పార్టీ కోసం కష్టపడిన తిరుపతిరెడ్డి లాంటి నాయకులను కాంగ్రెస్‌ బలవంతంగా బయటకు పంపించిందని విమర్శించారు.
తిరుపతిరెడ్డికి తమ పార్టీలో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని హామీనిచ్చారు.

Spread the love