– ఒకే రోజు 15 మెడల్స్ కైవసం
– అవినాశ్, తేజిందర్‌లకు పసిడి
– షూటింగ్‌లో మరో బంగారు పతకం
– బ్యాడ్మింటన్ మెన్స్ జట్టుకు సిల్వర్
– జ్యోతి ఎర్రాజి, నందినిలకు వెండి, కాంస్యం
– హాంగ్జౌ 2023 ఆసియా క్రీడలు
హాంగ్జౌలో టీమ్ ఇండియా అథ్లెట్లు సత్తా చాటారు. ఆదివారం ఒక్కరోజే భారత క్రీడాకారులు ఏకంగా 15 పతకాలు సొంతం చేసుకున్నారు. అథ్లెటిక్స్‌లో అవినాశ్ సబ్లె, తేజిందర్ పాల్ సింగ్‌లు పసిడి సాధించగా.. షూటింగ్‌లో మరో గోల్డ్ మెడల్ దక్కింది. తెలుగు తేజాలు జ్యోతి ఎర్రాజి, నందిన అగసార ట్రాక్‌పై దుమ్మురేపారు. బ్యాడ్మింటన్‌లో మెన్స్ జట్టు చారిత్రక సిల్వర్ మెడల్‌తో మెరిసింది. 13 పసిడి, 21 రజతాలు, 19 కాంస్యాలు సహా 52 మెడల్స్ సాధించిన భారత్ పతకాల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచింది.
నవతెలంగాణ-హాంగ్జౌ
ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మన ప్రభంజనం మొదలైంది. మెన్స్ 3000మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అగ్రశ్రేణి స్ప్రింటర్ అవినాశ్ సబ్లె స్వర్ణం సాధించగా, మెన్స్ షాట్‌పుట్‌లో తేజిందర్ పాల్ సింగ్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ రేసును అవినాశ్ 8 నిమిషాల 19.50 సెకండ్లలోనే ముగించి స్వర్ణం దక్కించుకున్నాడు. జపాన్ స్ప్రింటర్లు సిల్వర్, కాంస్య పతకాలు సాధించారు. ఆసియా క్రీడల రికార్డు బద్దలుకొట్టిన అవినాశ్ సబ్లె పసిడి ప్రదర్శనతో మెరిశాడు. షాట్‌పుట్‌లో తేజిందర్ పాల్ సింగ్ అంచనాలను అందుకున్నాడు. ఫైనల్లో చివరి ప్రయత్నంలో ఇనుప గుండును 20.36 మీటర్ల దూరం విసిరిన తేజిందర్ పాల్ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో ఏకంగా మూడు సార్లు ఫౌల్ అయిన తేజిందర్ పాల్ 19.51, 20.06 మీటర్ల దూరం ఇతర ప్రయత్నాల్లో విసిరాడు. మహ్మద్ టోలో (సౌదీ అరేబియా), లియు యాంగ్ (చైనా)లకు రజత, కాంస్య పతకాలు దక్కాయి. షూటింగ్‌లో మన గన్స్ మళ్లీ పేలాయి. మెన్స్ ట్రాప్ ఈవెంట్‌లో భారత్ బంగారం సాధించింది. కైనన్ డారియస్, జోరావర్ సింగ్, పృథ్వీ రాజ్ సైతం పతక వేటలో ఆసియా క్రీడల రికార్డు నెలకొల్పుతూ 361 స్కోరు సాధించారు. వరుసగా ఐదు సిరీస్‌ల్లో 74, 69, 72, 74, 72 పాయింట్లు సాధించిన మనోళ్లు గురి తప్పలేదు. కువైట్, చైనాలకు సిల్వర్, బ్రాంజ్ లభించాయి. మెన్స్ ట్రాప్ వ్యక్తిగత విభాగంలో కైనన్ కాంస్య పతకం సాధించాడు. 40 టార్గెట్లలో 32 టార్గెట్‌లను గురి పెట్టిన కైనన్.. మూడో స్థానంలో బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నాడు. చైనా, కువైట్ షూటర్లు గోల్డ్, సిల్వర్ సాధించారు. మహిళల ట్రాప్ జట్టు ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ దక్కింది. రాజేశ్వరి కుమారి, మనీశా, ప్రీతి త్రయం పతక వేటలో 337 స్కోరు చేసింది. చైనా షూటర్లు 357 స్కోరుతో ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పట్టగా..మనకు వెండి పతకం దక్కింది.
అథ్లెటిక్స్‌లో జోరు
అథ్లెటిక్స్‌లో అవినాశ్, తేజిందర్‌లు పసిడి నెగ్గగా.. ఇతర అథ్లెట్లు సైతం పతక వేటలో జోరు చూపించారు. మహిళల 1500 మీటర్ల రేసులో హార్మిలాన్ బైన్స్ సిల్వర్ మెడల్ సాధించింది. 4 నిమిషాల 12.74 సెకండ్లలో హార్మిలాన్ రేసు ముగించింది. మెన్స్ 1500 మీటర్ల రేసులో మనకు రెండు మెడల్స్ లభించాయి. సరోజ్ అజరు కుమార్ 3.38.94 సెకండ్లతో సిల్వర్ మెడల్ సాధించగా, జాన్సన్ జిన్సన్ 3.39.74 సెకండ్లతో కాంస్యం అందుకున్నాడు. ఖతార్ అథ్లెట్ మహ్మద్ 3.38.36తో గోల్డ్ సాధించాడు. మెన్స్ లాంగ్‌జంప్‌లో శ్రీశంకర్ సత్తా చాటాడు. చివరి ప్రయత్నంలో 8 మీటర్ల జంప్ చేసిన శ్రీశంకర్ రజత పతకం ముద్దాడాడు. చైనా అథ్లెట్లు గోల్డ్, బ్రాంజ్ అందుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో సీమ పూనియ కాంస్యం సాధించింది. ఫైనల్లో డిస్కస్‌ను 58.62 మీటర్లు విసిరిన సీమ పూనియ మెడల్ కైవసం చేసుకుంది. తెలుగు తేజాలు జ్యోతి ఎర్రాజి, నందిని అగసారలు ఆసియా క్రీడల మెడల్స్ అందుకున్నారు. జ్యోతి ఎర్రాజి మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌లో 12.91 సెకండ్లతో సిల్వర్ దక్కించుకుంది. తొలుత మూడో స్థానంలో నిలిచిన జ్యోతి.. చైనా అథ్లెట్ అనర్హతతో పతకం రంగు మెరుగుపర్చుకుంది. మహిళల హెపథ్లాన్ 800మీటర్లలో నందిని కాంస్యం అందుకుంది.
బ్యాడ్మింటన్‌లో సిల్వర్
భారత షట్లర్లు పసిడి చరిత్రకు అడుగు దూరంలో నిలిచారు. మెన్స్ జట్టు విభాగం ఫైనల్లో ఆతిథ్య చైనాపై ఆరంభంలో 2-0 ముందంజలో నిలిచిన భారత్.. చివరి మూడు మ్యాచుల్లో పరాజయం పాలైంది. 2-3తో పసిడి పతకం చైనాకు కోల్పోయింది. ఆసియా క్రీడల్లో భారత మెన్స్ జట్టుకు ఇదే తొలి సిల్వర్ మెడల్ కావటం విశేషం. తొలుత లక్ష్యసేన్ 22-20, 14-21, 21-18తో, సాత్విక్, చిరాగ్ జోడీ 21-15, 21-18తో విజయాలు నమోదు చేశారు. కిదాంబి శ్రీకాంత్ 22-24, 9-21తో, కపిల్, కృష్ణప్రసాద్ జోడీ 6-21, 15-21తో, మంజునాథ్ 12-21, 4-21తో నిరాశపరిచారు. సీనియర్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణరు ఫిట్‌నెస్ కారణాలతో ఫైనల్‌కు దూరం కావటం భారత్‌ను గట్టి దెబ్బతీసింది.
నిఖత్‌కు కాంస్యమే
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మహిళల 50 కేజీల విభాగంలో 2-3తో థారులాండ్ బాక్సర్ రక్షత్ చేతిలో నిఖత్ అనూహ్య ఓటమి చవిచూసింది. తొలి రౌండ్లో 3-2తో పైచేయి సాధించినా..రెండో రౌండ్లో 2-3తో, మూడో రౌండ్లో 1-4తో నిరాశపరిచింది. సెమీస్‌లో ఓటమితో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.