మీడియా వాచ్‌

Media Watchశ్రామిక్‌
కక్కిందీ వారే! దాన్ని ఆబగా జుర్రిందీ వారే! కనీస నైతిక, పాత్రికేయ ప్రమాణాలు వదిలేసిన ఒక నాటి ‘హిజ్‌మాస్టర్స్‌ వాయిస్‌, బధిరాంధతకు నిదర్శనం, నిన్నటి వారి బ్యానర్‌ స్టోరీ! నువ్వు దంచు, నేను పక్కలెగరేస్తానన్నదట ఒక అమ్మ. అక్టోబర్‌ 23న అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్‌ వెలువడగానే సెప్టెంబర్‌ మధ్యలో చర్చాగోష్టి నిర్వహించింది సీపీఐ(ఎం). దాన్లోనే ‘పర్యావరణ పరిరక్షణ వేదిక’ పురుడుపోసుకుంది. దానికి కన్వీనర్‌ జె పెంటయ్య సీపీఐ(ఎం)కు చెందిన వారే. స్థానిక ఎంపీటీసీ ఎండి రెహాన్‌ కో కన్వీనర్‌. ఈయన కాంగ్రెస్‌ పార్టీ వారు. అక్టోబర్‌16న ఆ ప్రాంతంలో సదస్సు జరిపింది సీపీఐ(ఎం). అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తెచ్చింది. బీఆర్‌ఎస్‌లా ఉలిపికట్ట పాత్ర పోషించలేదు.
‘పత్రికొక్కటి చాలు పదివేల సైన్యంబు’ అని తలపోసేరోజులు కావివి. ‘ పత్రికొక్కటి చాలు వేన వేల అబద్ధపు అశుద్ధాలు వండి వార్చడానికనే రోజుల్లో ఉన్నాం. ఓడలు బళ్ళైన విషయం ఆపార్టీకి ఎక్కిన కైపు దిగకపోవడం వల్ల అర్థం కాక పోయుండొచ్చు. కాని ‘ హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌’కు అన్ని మండలాల్లో విలేకర్ల నెట్‌వర్క్‌ ఉన్నది కాదా! అధినేత ముసుగేసుకుని ఫాంహౌస్‌కే పరిమితమైనా మిగిలిన చిల్లర దేవుళ్ళందర్నీ నెత్తిన పెట్టుకు మోస్తున్న పత్రికలో పోలీసుల ముందు మోహరించిన వారు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శితో సహా అనేకులున్న విషయం కనపడలేదా? లాఠీల ముందు నిలిచిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ వారు. మెళ్లో కండువాలుంటే తప్ప గుర్తింపులేనోళ్ళు కాదు వారు. ఆ ప్రాంత జనానికి చిర పరిచయస్తులు. వారికి జంథ్యాలెందుకు? ఎర్ర కండువాలెందుకు? అంతకు ముందు సదస్సు నిర్ణయం అందరి జండాలు, ఎజెండాలు పక్కన బెట్టి అదానీ ఫ్యాక్టరీని వ్యతిరేకించడమే అందరి లక్ష్యమన్న నిర్ణయానికి కట్టుబడే సీపీఐ(ఎం) వ్యవహరించింది.
తాతాచార్యుల వారికి, పీర్ల పండుగకు ముడేయగల, మహత్తర శక్తిశీలురు బహుశా ‘హిజ్‌హాస్టర్స్‌ వాయిస్‌’ నిండా ఉండుంటారు. ‘నిండా’కు సారీ! దీర్ఘదర్శులు, పాప్త్ర కాలాజ్ఞులు బహుశా ముందు జారుకోగా, చివరికి అండా అడుగన మిగిలిపోయిన ‘దీర్ఘసూత్రు’ని లాంటి కబోధి పక్షులకు పైన చెప్పి విషయాలు కనపడవు… అలాంటి వారికి జర్నలిస్టు మౌలిక సూత్రాలు చెప్పాల్సి రావడం మా దౌర్భాగ్యం. వార్తలోనుండే ముఖ్య విషయాలను ‘లీడ్‌’గా తీసుకోవడం కద్దు. యజమాని సేవలో పులకించాలనుకునే ‘డెస్క్‌ వీరుల’కు కనీసం వాళ్ళ స్టాఫర్లు, మండల విలేకర్లు పంపిన వార్తలను క్రోడీకరించాలన్న ఇంగిత జ్ఞానం అడుగంటిపోవడం ఈ రాష్ట్ర ప్రారబ్దం .
ఒక పత్రికగా ఆ ఉద్యమకారులు ఆలోచించని విషయాలపై దృష్టి సారించి ఉంటే బాగుండేది. వాస్తవానికి మీడియా బాధ్యత కూడా అదే కదా! కోదాడ నుండి మిర్యాలగూడ వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేక సిమెంటు ఫ్యాక్టరీలున్నాయి. ఆ పొరుగునున్న కృష్ణా, గుంటూరు జిల్లాలతో కలిపి డజనుల కొద్దీ సిమెంటు ఫ్యాక్టరీలున్నాయి. కారణం కృష్ణానది. మరి రామన్నపేటలో ఏ నది ఉంది? ఎక్కడ్నించి నీరు తీసుకుంటుంది అంబుజా సిమెంట్‌? రోజుకి ఆరు లక్షల లీటర్ల నీరు కావాలట! రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి మండలాల్లో ప్రవహించే ధర్మారెడ్డిపల్లి కాలువ ఇపుడీ ప్రాజెక్ట్‌ సైట్‌లో నుండే ప్రవహిస్తుంది. అంటే దాన్ని అదానీ సాబ్‌ కబ్జా చేసేస్తాడా? అపుడు ఇదే ప్రధాన వనరైన ఆ ప్రాంత ప్రజల సాగు నీటి గోసేంటి? దీన్ని ప్రజల దృష్టికి తీసికెళ్లడం మీడియా బాధ్యత కదా? పైగా రోజూ 174 భారీ వాహనాలు ఆ రోడ్లో తిరుగుతాయట! గతంలో బళ్ళారి నుండి కృష్ణపట్నం పోర్టుకు ఐరన్‌ ఓర్‌ ఎగుమతుల సందర్భంగా అనేక గ్రామాల్లో ప్రమాదాల బారిన పడకుండా బళ్లుమానిపించి పిల్లల్ని ఇళ్లలోనే ఉంచేసుకున్న ప్రజల బాధలు చూశాం. ఆ పరిస్థితి ఇక్కడ పునరావృతం కారాదు.ఐక్యంగా నడిచే ఉద్యమాన్ని పక్కదారి పట్టించి అదానీ సేవకోసమేనా ఈ కిరాయి రాతలు? సూర్యుని ఎండ నీకు ఎంత చుర్రుమనిపించినా, ఎంత కోపమొచ్చినా సూర్యునిపై ఉమ్మేస్తే ఏమవుతుందో వేరే చెప్పనక్కర్లేదు!

Spread the love