వైద్యశాఖ జీవో 33ని సవరించాలి

వైద్యశాఖ జీవో 33ని సవరించాలి– ఆ జీవోతో తెలంగాణ బిడ్డలే స్థానికేతరులుగా మారే ప్రమాదం
– స్థానికతపై నిబంధనల రూపకల్పనకు కమిటీని నియమించాలి
– అఖిల పక్షం ఏర్పాటు చేయాలి : వైద్యారోగ్యశాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన జీవో 33ను సవరించాలని వైద్యారోగ్యశాఖ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఆ జీవోతో తెలంగాణ బిడ్డలే స్థానికేతరులుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికతను నిర్ణయించేందుకు నిబంధనల రూపకల్పనకు ఒక కమిటీని వేయాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఏ అంశంపైనా స్పష్టత లేదనీ, విద్యార్థుల భవిష్యత్తుపై ఆలోచన లేదని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకు న్నామనీ, ఆ మేరకు బీఆర్‌ఎస్‌ పాలనలో నీళ్లు, ఉద్యోగాలు దక్కాయని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 40 శాతం ఉద్యోగాలు స్థానికేతరులకు దక్కితే, రాష్ట్రం ఏర్పడ్డాక 95 శాతం ఉద్యోగాలు తెలంగాణవారికే వచ్చేలా తాము జీవో నెంబర్‌ 124ను తీసుకొచ్చామని గుర్తుచేశారు. విద్యా ప్రవేశాల్లో ఉమ్మడి రాష్ట్రంలోని పాత పద్ధతిలో 15 శాతం ఓపెన్‌ కాంపిటేషన్‌ మరో పదేండ్లపాటు కొనసాగిం చాలని విభజన చట్టంలో ఉండటంతో దానిని కొనసాగించినట్టు స్పష్టం చేశారు. 1979లో జీవో నెంబర్‌ 644లో విద్యా ప్రవేశాల్లో స్థానికతను ఆంధ్రా, తెలంగాణ, రాయల సీమకు నిర్ణయించారనీ, ఆ ప్రాంతాల్లో నాన్‌ లోకల్‌ విద్యార్థులకు అవకాశం ఉండేది కాదని హరీశ్‌ రావు తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ ఆధారంగా జీవో నంబర్‌ 114 ప్రకారం. పాత నిబంధనను పదేండ్లపాటు కొనసాగించాలని అందులో పేర్కొన్నారని చెప్పారు. తెలంగాణ వచ్చే నాటికి ఉన్న కాలేజీల్లో మాత్రమే 15 ఓపెన్‌ కాంపిటీషన్‌ కోటా అమలు చేసి, రాష్ట్రం వచ్చాక ఏర్పాటు చేసిన కాలేజీల్లో వంద శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇచ్చినట్టు చెప్పారు. దీంతో 520 సీట్లు అదనంగా మన రాష్ట్ర విద్యార్థులకు వచ్చాయని వివరించారు. ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో బీ కేటగిరీలో లోకల్‌ స్టూడెంట్లకే ఇవ్వాలని తెచ్చిన జీవోతో అదనంగా మరో 1,071 సీట్లు దక్కినట్టు వెల్లడించారు. విభజన చట్టంలో పాత నిబంధన కొనసాగింపునకు 2024తో కాలం చెల్లిందని హరీశ్‌ రావు గుర్తుచేశారు. మన పిల్లలకు అడ్మిషన్ల కోసం స్థానికతను నిర్ధారించుకోవడానికి కొత్త సమగ్ర విధానం రూపొందించుకోవాలని సూచించారు. ఇలాంటి సమయంలో ఇంటర్‌కు ముందు విద్యా సంవత్సరం నుంచి వెనక్కి నాలుగేండ్లు ఎక్కడ చదివితే అక్కడికి లోకల్‌ అని కొత్త జీవోలో పేర్కొనడాన్ని ఆయన ఆక్షేపించారు. గత ఏడేండ్లలో కనీసం నాలుగేండ్లు అని పాత నిబంధన చెప్తోంది. ఈ ప్రభుత్వం ఏడేండ్లు తీసేసి నాలుగేండ్లు అంటోందని విమర్శించారు. దీంతో తెలంగాణ విద్యార్థులు ఇంటర్‌ రెండేండ్ల్లు వేరే రాష్ట్రంలో చదివితే, లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌కు వెళ్తే నాన్‌ లోకల్‌ అయిపోరా? తెలంగాణ బిడ్డలు వేరే దేశాల్లో, రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. ఈ నిబంధన ప్రకారం వాళ్లు పీజీ సీట్లకు నాన్‌ లోకల్‌ అయిపోరా? అని ప్రశ్నించారు.తమిళనాడులో మాదిరి రూల్స్‌ ఫ్రేమ్స్‌ చేయాలని హరీశ్‌రావు సలహా ఇచ్చారు. ఆ రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీటు రావాలంటే ఆరు నుంచి పది వరకు అక్కడ చదువుకుని, తల్లిదండ్రులు స్థిర నివాసం కలిగి ఉండాలని నిబంధన ఉందని తెలిపారు. కర్ణాటక, కేరళకు వాటి నిబంధనలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణకు కూడా సొంత నిబంధనలు రూపొందించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేసి ఒక విధానం రూపొందిస్తే అన్ని విద్యాసంస్థల ప్రవేశాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా పదేండ్ల పాటు ఉన్నందు వల్లే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పార్లమెంటు చట్టం ప్రకారం పాత పద్ధతిని కొనసాగించిందని స్పష్టం చేశారు. పదేండ్ల కాలం ముగిసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతినే కొనసాగించాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి పాత ఉత్తర్వులోని మొదటి పారాగ్రాఫ్‌ను యధాతథంగా పెట్టారు. మిగతా పారాగ్రాఫ్‌లు వదిలి పెట్టారని చెప్పారు. తమ పరిధిలో ఉన్నందున ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే అనే నిబంధన తెచ్చినట్టు గుర్తుచేశారు. విద్యా ప్రవేశాల్లోనూ 95 శాతం స్థానికులకే ఇచ్చే అవకాశమున్నా ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించలేదని తప్పుపట్టారు.

Spread the love