వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి

– రక్తదానాన్ని ప్రోత్సహించే చర్యలు చేపట్టాలి : మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
చిన్నపిల్లలు, నవజాతశిశువులు, క్యాన్సర్‌ చివరి దశలో ఉన్న వారికి అందించే పాలియేటివ్‌ కేర్‌ ఫెసిలిటీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు. అదేవిధంగా రక్తదానంపై అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. శిబిరాల నిర్వహణ ద్వారా రక్తదానాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారు. శుక్రవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పనితీరుపై మంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లో పెరిగిన విశ్వాసాన్ని నిలుపుకునేలా కృషి చేయాలని కోరారు. రోగులు, వారి సహాయకులతో శానిటేషన్‌, సెక్యూరిటీ, పేషెంట్‌ కేర్‌ సిబ్బంది గౌరవంగా ఉండాలని, వారి మెప్పు పొందేలా సేవలందించాలని చెప్పారు. అనవసర సీ సెక్షన్‌ ఆపరేషన్ల సంఖ్యను తగ్గించే దిశగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. డిశ్చార్జి అయిన రోగులకు అవసరమైన మందులు ఇచ్చి పంపేలా ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. జూన్‌ 14న వైద్యారోగ్యశాఖ దినోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపుచ్చారు.

Spread the love