పేదలకు వైద్య సేవలు చేరువవ్వాలి

Medical services should be provided to the poor– టెక్నాలజీ మరింత అభివృద్థి చెందాలి
– రోగ నిర్దారణ వేగంగా జరగాలి : బయోఏసియా సదస్సులో గవర్నర్‌ తమిళసై
నవ తెలంగాణ – బిజినెస్‌ డెస్క్‌
హైదరాబాద్‌ : గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఇప్పటికీ అనేక రోగ నిర్దారణ సేవలు అందుబాటులో లేవని గవర్నర్‌ తమిళసై అన్నారు. వైద్య రంగంలో కృత్రిమ మేధా (ఎఐ) టెక్నాలజీ మరింత అందుబాటులోకి రావాలని ఆశించారు. బుధవారం బయోఏసియా కాన్ఫరెన్స్‌కు తమిళసై హాజరై.. మంత్రి శ్రీధర్‌ బాబుతో కలిసి ఉత్తమ స్టార్టప్‌లకు అవార్డులను అందించారు. అనంతరం సమావేశంలో గవర్నర్‌ మాట్లాడుతూ.. గ్లోబల్‌ బయేఏసియా కాన్ఫరెన్స్‌కు రావడం సంతోషకరంగా ఉందన్నారు. 20 ఏండ్ల క్రితం దీన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో పురోగతి కనబడుతోందన్నారు. గ్రామీణ ప్రజలు, పేద వర్గాలకు ఉపయోగపడేలా బయో సైన్స్‌ సంస్థలు కృషి చేయాలన్నారు. కాగా.. పేదలకు ఇప్పటికీ అల్ట్రా సౌండ్‌ లాంటి స్కానింగ్‌ పరికరాలు అందుబాటులోకి రాలేదన్నారు. కొన్ని వర్గాలకు స్కానింగ్‌ ధరలు ఇప్పటికీ భారంగానే ఉన్నాయన్నారు. హెచ్చు ధరల వల్ల అనేక మంది వైద్యానికి దూరం అవుతున్నారని పేర్కొన్నారు. దీన్ని అధిగమించడానికి ఫార్మా కంపెనీలు, బయోసైన్స్‌ కంపెనీలు కృషి చేయాలన్నారు. 20 ఏండ్లకు ఇప్పటికీ అల్ట్రాసౌండ్‌ లాంటి సేవలు కొంత చౌకగా, అందుబాటులోకి వచ్చాయంటే అది ఫార్మా కంపెనీల చొరవేనని అన్నారు. వ్యాక్సిన్ల తయారీకి హైదరాబాద్‌గా హబ్‌గా ఉండటం గర్వకారణమన్నారు. కోవిడ్‌ సమయంలో దేశీయంగా.. అందులోనూ హైదరాబాద్‌లో తయారయిన వ్యాక్సిన్‌ను తాను తీసుకున్నానని గవర్నర్‌ గుర్తు చేసుకున్నారు. కృత్రిమ మేధా (ఎఐ) అందుబాటులోకి వచ్చిన తర్వాత రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించే శక్తి 20 రెట్లు మెరుగయ్యిందన్నారు. రోగనిర్ధారణపై ప్రజల్లో అవగాహన పెరిగేలా చూడాలన్నారు. ఈ సందర్బంగా వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న బయో కంపెనీలు, శాస్త్రవేత్తల పరిశోధనలను గవర్నర్‌ ప్రశంసించారు. ఈ సదస్సులో వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పెషల్‌ సెక్రటరీ బిపి ఆచార్యా, ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ పాల్గొన్నారు.
లైఫ్‌ సైన్స్‌లో 50వేల మంది నిపుణులు : మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి
వచ్చే ఐదారేండ్లలో బయో సైన్స్‌ రంగంలో 50,000 మంది నిపుణులు అవసరం అవుతారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. బుధవారం ఆయన బయోఏసియా కాన్ఫరెన్స్‌లో సెంటర్‌ ఫర్‌ ఇండిస్టీయల్‌ రెవల్యూషన్‌ (సి4ఐఆర్‌)ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. బయోసైన్స్‌లో నిపుణులను తయారు చేయడానికి గ్రాడ్యూయేట్లకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. స్థానిక గ్రాడ్యూయేట్లకు నైపుణ్యం కల్పించడం ద్వారా బలమైన శ్రామికశక్తిని విస్తరించాలని నిర్దేశించుకున్నామన్నారు.

Spread the love