మెడికల్‌ ‘ఖాళీ’జీ

Medical 'Khali'ji– మూడేండ్లయినా అతీగతీ లేదు
– రానంటున్న ప్రొఫెసర్లు, డాక్టర్లతో సిబ్బంది కొరత
– అరువు భవనాలు.. అద్దె బస్సులు..
– నర్సింగ్‌ భవనంలో మెడికల్‌ కళాశాల
– మూడేండ్లుగా కొనసా..గుతున్న ‘మెడికల్‌’ భవనం
– హాస్టల్‌ భవనాలు లేక బాలికల అవస్థలు
నవతెలంగాణ-మహబూబాబాద్‌
మానుకోటలో ప్రభుత్వ జీజీహెచ్‌కు అనుబంధంగా ఉన్న మెడికల్‌ కళాశాలకు బోధన ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్స్‌.. తాము రాము.. రాలేమంటూ ముఖం చాటేస్తున్నారు. ఎన్ని లక్షల జీతం ఇచ్చినా తాము వచ్చేది లేదంటూ భీష్మిస్తున్నారు. మూడేండ్ల కిందట ప్రారంభించిన మెడికల్‌ కళాశాలకు హాస్టల్‌ భవనాలు లేకపోవడం, బోధన సిబ్బంది రాకపోవడం రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల మానుకోట మెడికల్‌ కళాశాల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది.
మహబూబాబాద్‌ పట్టణానికి 4-5కి.మీ దూరంలో ఉన్న మెడికల్‌ కళాశాలకు విద్యార్ధులు ఎంతో ఆశతో వస్తుండగా వారి ఆశలు అయోమయ పరిస్థితిలో పడ్డాయి. పూర్తిస్థాయిలో బోధన సిబ్బంది లేకపోవడం, హాస్టల్‌ భవనాలు లేకపోవడం రవాణా సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. నర్సింగ్‌ విద్యార్థుల కోసం నిర్మించిన భవనాన్ని అరువుగా తీసుకొని మెడికల్‌ కళాశాల నిర్వహిస్తున్నారు. మెడికల్‌ కళాశాల భవనం కోసం నిధులు కేటాయించినప్పటికీ విడుదల చేయకపోవడంతో నిర్మాణ పనులు మందకోడిగా సాగుతున్నాయి మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా హాస్టల్‌ భవనానికి నిధులు ఇచ్చినప్పటికీ విడుదల చేయకపోవడంతో హాస్టల్‌ భవన నిర్మాణ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. బాల బాలికలకు ప్రత్యేకంగా మహబూబాబాద్‌ పట్టణంలో వేరువేరుగా నాలుగు ప్రయివేటు భవనాలు అద్దెకు తీసుకుని హాస్టల్‌ నిర్వహిస్తున్నారు. ఆ భవనాల్లో కూడా పూర్తిస్థాయి సౌకర్యాలు లేక విద్యార్ధులు ఇబ్బంది పడుతున్నారు. హాస్టల్‌ నుంచి కళాశాలకు విద్యార్థులు రావడానికి సొంత బస్సు సౌకర్యం లేకపోవడంతో అద్దె బస్సులు తీసుకొని నడిపిస్తున్నారు.
అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నోటిఫికేషన్‌
ఈ విద్యా సంవత్సరంలో బోధనా సిబ్బందిని, డాక్టర్లను నియమించడం కోసం అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేశారు. అందులో ఐదుగురు ప్రొఫెసర్లు, ఏడుగురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 19 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 26 మంది ట్యూటర్లు, 49 మంది సీనియర్‌ రెసిడెంట్స్‌ డాక్టర్ల కోసం నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీరికి ఈ నెల 17న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు అలాగే మరో 73 మంది మెడికల్‌ టెక్నీషియన్లు నియామకం కూడా అవసరం ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలో టెక్నీషియన్ల కోసం నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు సమాచారం.
మారుమూల ప్రాంతం అయినందునే..
మహబూబాబాద్‌ పట్టణం మారుమూల ప్రాంతంతో అయినందున ఈ ప్రాంతానికి బోధన సిబ్బందిగా ప్రొఫెసర్లు, వైద్యులు రావడానికి ఇష్టపడటం లేదు. మెడికల్‌ కళాశాలలో పనిచేసే వైద్యులు తమ సొంత క్లినిక్‌ లేదా కార్పొరేట్‌ ఆస్పత్రిలో పార్ట్‌ టైం జాబ్‌ చేయడం ఆనవాయితీగా వస్తుంది. మహబూబాబాద్‌ ప్రాంతంలో సొంత క్లినిక్‌ పెట్టలేని పరిస్థితి. అంతేకాదు, సమీపంలో కార్పొరేట్‌ ఆస్పత్రులూ లేకపోవడమూ కారణం. పైగా వరంగల్‌ సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని మెడికల్‌ కళాశాల్లో పని చేయడానికి మాత్రం ఇష్టపడుతున్నారు. ఆ మెడికల్‌ కళాశాలలో పనిచేస్తే తక్షణమే వరంగల్‌ ప్రాంతానికి వచ్చి కార్పొరేట్‌ వైద్యం చేసుకునే వీలుంటుంది. కాబట్టి అక్కడ పని చేయడానికి వైద్యులు ఇష్టపడుతున్నారు. మరో వారం రోజుల్లో మొదటి ఈ సంవత్సరం విద్యార్థులు 150 మంది కౌన్సెలింగ్‌ ద్వారా చేరనున్నారు. వీరికి హాస్టల్‌కు సంబంధించిన భవనాలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. మెడికల్‌ కళాశాల నిర్వహణ భవనాలు, సౌకర్యాలపై స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బోధన సిబ్బంది ఖాళీలు
మహబూబాబాద్‌ మెడికల్‌ కళాశాలను 2022-23 విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. ప్రతి ఏటా 150 సీట్లు కేటాయించారు. ఇప్పటికి రెండు సంవత్సరాలకు పూర్తికాక 300 మంది విద్యార్థులున్నారు. మరో వారం రోజుల్లో నూతన విద్యార్థులు 150 మంది విచ్చేయనున్నారు. కానీ, కళాశాలలో బోధన సిబ్బంది లేకపోవడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మెడికల్‌ కళాశాలకు 41 మంది ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 14 మంది మాత్రమే ఉన్నారు. అలాగే అసోసియేట్‌ ప్రొఫెసర్లు 51మందికి గాను 17మంది, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 139 మందికి గాను 51 మంది ఉన్నారు. ట్యూటర్లు 31 మందికి గాను 6 మంది మాత్రమే ఉండగా, సీనియర్‌ రెసిడెంట్స్‌ 50 మంది ఉండాల్సి ఉండగా.. ఇప్పటికీ ఒక్కరినీ కేటాయించలేదు. కాగా, బోధనా సిబ్బందికి కేటాయించేందుకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా వచ్చేందుకు ఏ ఒక్క డాక్టర్‌, ప్రొఫెసర్‌ ముందుకు రాకపోవడం గమనార్హం. దాంతో కళాశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love