నవతెలంగాణ – ఖమ్మం
సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన మరువకముందే.. ఖమ్మంలో మరో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ పోచమ్మ మైదానం ప్రాంతానికి చెందిన సముద్రాల మానస (22) ఖమ్మం మమత మెడికల్ కళాశాలలో డెంటల్ నాలుగో ఏడాది చదువుతూ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. ఆదివారం రాత్రి హాస్టల్ భవనం పై అంతస్తులో తాను ఉంటున్న గదిలోకి వెళ్లిన మానస.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె గదిలో నుంచి మంటలు వస్తుండటాన్ని గమనించిన సీనియర్ విద్యార్థిని కేకలు వేయడంతో హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు అక్కడికి చేరుకుని గది తలుపులు పగలగొట్టి మంటలను ఆర్పారు. కానీ, మానస అప్పటికే మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలి వద్దకు చేరుకుని మానస మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా..కొంతకాలం క్రితం మానస తండ్రి మృతి చెందారని.. అప్పట్నుంచీ ఆమె మనోవేదనతో ఉందని సమాచారం.