– టీయూఎంహెచ్‌ఇయూ నాయకులతో మంత్రి దామోదర రాజనర్సింహ
– వైద్యారోగ్యశాఖ సిబ్బంది సమస్యలపై వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆరోగ్యమిత్రలు, 104 ఉద్యోగులు, ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న పేషెంట్ కేర్, శానిటేషన్, స్వీపర్స్, సెక్యూరిటీలు, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల సమస్యలపై వారం రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్ నేతృత్వంలో ఆరోగ్యశ్రీ రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వి.విజయవర్థన్ రాజు, ఆరోగ్యశ్రీ ఉపాధ్యక్షులు సుమన్, 104 ఉద్యోగ నాయకులు శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, రజాక్, రమేశ్, విజరు కుమార్ తదితరులు మంత్రిని కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ వారం రోజుల్లో అన్ని సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారని యూనియన్ నాయకులు వెల్లడించారు. ఆరోగ్యశ్రీలో పని చేస్తున్న ఆరోగ్య మిత్రల క్యాడర్ మార్పు, వేతనం పెంపుదల గురించి వివరించగా, వారం రోజుల్లో ప్రత్యేకంగా చర్చించి పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారన్నారు. 104 ఉద్యోగుల బకాయి వేతనాలు, డీఎంఈలోకి మార్పు చేసే విషయంపై వివరిస్తే, ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఆదేశాలు జారీ చేస్తామని దామోదర రాజనర్సింహ భరోసానిచ్చారని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న పేషెంట్ కేర్, శానిటేషన్ , స్వీపర్స్, సెక్యూరిటీలకు ఆరు నెలల బకాయి వేతనం వెంటనే విడుదల చేయాలని కోరగా, త్వరలోనే జీతాలు ఇప్పిస్తానని మంత్రి మాటిచ్చారన్నారు. అదే విధంగా ఎన్‌హెచ్‌ఎంలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలనీ, కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల పీఆర్సీ బకాయిలు ఇవ్వాలనీ, ఈసీ ఏఎన్‌ఎంల పెండింగ్ జీతాలు చెల్లించాలని యూనియన్ నాయకులు కోరారు. వీటితో వివిధ రకాల క్యాడర్లు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా యూనియన్ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.