తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌

– మరో ఆరు రాష్ట్రాలకు పార్క్‌లు
– ప్రకటించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : తెలంగాణలో పీఎం మిత్ర మెగా టెక్స్‌ టైల్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. తెలంగాణతో పాటు మరో ఆరు రాష్ట్రాలు తమిళ నాడు, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని ట్విట్టర్‌లో తెలిపారు. అవి 5ఎఫ్‌ (ఫార్మ్‌, ఫైబర్‌, ఫ్యాక్టరీ, ఫ్యాషన్‌, ఫారిన్‌) విజన్‌ ప్రేరణకు అనుగుణంగా వస్త్రాల రంగానికి ప్రోత్సాహాన్ని ఇస్తాయని ప్రధాని మోడీ తెలిపారు. పీఎం మిత్ర మెగా టెక్స్‌ టైల్‌ పార్కులు వస్త్ర రంగాని కి అత్యాధునిక మౌలిక సదుపాయాలను సమకూర్చి, కోట్ల పెట్టుబడిని ఆకట్టుకోవడంతో పాటు లక్షల కొద్దీ ఉద్యోగాలను కూడా కల్పిస్తాయని ఆయన అన్నారు ”పీఎమ్‌ మిత్ర మెగా టెక్స్‌ టైల్‌ పార్కు లు వస్త్ర రంగాని కి అత్యాధునికమైనటువంటి మౌలిక సదుపాయాల ను అందిస్తాయి. ఇది ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కు, ‘మేక్‌ ఫార్‌ ద వరల్డ్‌’ కు ఒక గొప్ప ఉదాహరణ అవుతుంది” అని పేర్కొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి పియూశ్‌ గోయల్‌ మాట్లాడుతూ టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు 13 రాష్ట్రాల నుంచి 18 ప్రతిపాదనలు వచ్చాయనీ, అందులో ఏడు ప్రతిపాదనలను ఎంపిక చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టుల అమలును కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోందనీ, అలాగే ఈ పార్కుల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యంలో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ)లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. జౌళి మంత్రిత్వ శాఖ ఒక్కొ గ్రీన్‌ఫీల్ట్‌ పార్క్‌కు రూ.500 కోట్లు, గ్రౌండ్‌ఫీల్డ్‌ పార్క్‌కు రూ.200 కోట్ల వరకు డెవలప్‌మెంట్‌ క్యాపిటల్‌ సపోర్టు రూపంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని అన్నారు. అలాగే సత్వర అమలుకు ఒక్కొ పార్క్‌కు రూ.300 కోట్లు పోటీ ప్రోత్సాహక మద్దతు (సీఐఎస్‌) అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం 1000 ఎకరాలు భూమిని ఇవ్వాలని, విద్యుత్‌ సరఫరా, నీటి లభ్యత, వ్యర్థ జలాల తొలగింపు వ్యవస్థ, సమర్థవంతమైన సింగిల్‌ విండో క్లియరెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో వరంగల్‌లో ఈ పార్క్‌ను గ్రౌండ్‌ ఫీల్డ్‌ పార్క్‌గా అభివృద్ధి చేయనున్నారు.

Spread the love