కమీషన్ల కోసమే ‘మెఘా’కు కొమ్ము

Horn to 'Megha' only for commissions– కాంగ్రెస్‌కు కామధేనువుగా ఆ సంస్థ దాన్ని బ్లాక్‌ లిస్టులో పెట్టాలి : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కమీషన్ల కోసమే మెఘా కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టకుండా సీఎం రేవంత్‌రెడ్డి కొమ్ము కాస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌, తదితర రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఫండింగ్‌ ఇచ్చేందుకు ఆ సంస్థతో ఒప్పందం జరిగిందనీ, ఆ పార్టీకి అది కామధేనువుగా మారిందని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లని అసెంబ్లీ ఆవరణలో గల మీడియా హాల్‌లో ఆయన మాట్లాడారు. సుంకిశాల ఘటనకు మెఘా సంస్థదే బాధ్యత అని వాటర్‌బోర్డు చెబుతున్నప్పటికీ రాష్ట్ర సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కంపెనీపై ఆరోపణలు చేసిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. మాజీ, తాజా సీఎంల మధ్యలో రాష్ట్రాన్ని ఆ సంస్థ దోపిడీ చేస్తున్నదని ఆరోపించారు. కొడంగల్‌ అభివృద్ధి పనుల కాంట్రాక్టులను ఆ సంస్థకే ఇవ్వడం వెనుకున్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మెఘా సంస్థ 56 కాంట్రాక్టులు పొందితే ఇప్పటి వరకూ ఏ ఒక్క పనిని కూడా పూర్తిచేయలేదని చెప్పారు. సుంకిశాల ప్రాజెక్టు పాక్షికంగా కూలడానికి కారణమైన ఆ కంపెనీని తక్షణమే బ్లాక్‌ లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. జరిగిన నష్టాన్ని పూర్తిగా ఆ కంపెనీతోనే భర్తీ చేయించాలనీ, ఆ మేరకు పెనాల్టీ విధించాలని సూించారు.
ఆ కంపెనీ తప్పిదాలపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. ఆ సంస్థపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన, పోరాటం చేస్తామని ప్రకటించారు. తమ ఎమ్మెల్యేల బృందం మంగళవారం సుంకిశాల ప్రాజెక్టును సందర్శిస్తుందని తెలిపారు.

Spread the love