హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆరుగురు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు

himachal-congress-rebel-mlasనవతెలంగాణ – షిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో హైడ్రామా కొనసాగుతున్నది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించి విపక్ష అభ్యర్థికి ఓటేసిన ఆరుగురు కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయింది. కాంగ్రెస్ పిటిషన్‌ నేపధ్యంలో స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వం రద్దయిన వారిలో ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ, సుజన్‌పూర్ ఎమ్మెల్యే రాజిందర్‌ రాణా, కుత్లహర్ ఎమ్మెల్యే దేవేందర్‌ కుమార్‌ భుట్టో, గాగ్రెట్ ఎమ్మెల్యే చైతన్య శర్మ, లాహౌల్ స్పితి ఎమ్మెల్యే రవి ఠాకూర్, బాద్సర్ ఎమ్మెల్యే ఇంద్ర దత్ లఖన్‌పాల్ ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వీరిపై స్పీకర్ వేటువేశారు. ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఈనేపథ్యంలో ఆరుగురి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. మంగళవారం రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ఈ 9మంది ఎమ్మెల్యేలు హర్యానాలోని పంచకులకు వెళ్లిపోయారు. అక్కడ వారికి బీజేపీ సర్కార్‌ కట్టుదిట్టమైన భద్రత కల్పించటం గమనార్హం. బుధవారం బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో సిమ్లాకు చేరుకున్నారు. బడ్జెట్‌ సమావేశాల్ని బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ముందు కాంగ్రెస్‌ సర్కార్‌ తన మెజార్టీ నిరూపించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు.

Spread the love