సునీతకు 35 ఏండ్లు ఉంటాయి. తన తల్లిని తీసుకుని ఐద్వా అదాలత్‌కు వచ్చింది. వారికి సునీత ఒక్కతే కూతురు. తల్లి బట్టల మిల్లులో ఉద్యోగం చేస్తుంది. తండ్రి తన చిన్నతనంలోనే కుటుంబాన్ని వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. ఇంట్లో తల్లి, కూతురు మాత్రమే ఉంటారు. సునీతకు 17 ఏండ్లకే పెండ్లి చేసింది తల్లి. పెండ్లి తర్వాత ఒక ఏడాది వరకూ బాగున్నారు. వాళ్ళది పల్లెటూరు. భర్తకు వచ్చే జీతంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. అందుకే ఆమె కూడా ఏదో ఒక పని చేయాలనుకుంది. కొన్ని రోజులు వ్యవసాయం పనులకు వెళ్ళింది. తర్వాత చిన్న కిరాణ షాపు పెట్టుకుంది. దుకాణం బాగానే నడస్తుంది. కానీ ఇక్కడి నుండే సమస్య మొదలైంది.
ఊరు కాబట్టి కిరాణా షాపులో మద్యం అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయంటూ తోటి కోడలు సునీతకు చెప్పింది. కానీ దానికి ఆమె ఒప్పుకోలేదు. దాంతో సునీతను పక్కన బెట్టి అత్త, తోడి కోడలు షాపులో కూర్చునేవారు. సునీత ఎండు మిర్చి పౌడర్ చేసే మిషన్ తెచ్చుకుంది. పసుపు, మిర్చి పౌడర్ చేసేది. వచ్చిన డబ్బులు కొంత ఇంటికి ఖర్చు పెట్టి మిగిలిన వాటితో బంగారం కొనుక్కుంది. సునీతకు బాబు పుట్టాడు. దాంతో పుట్టింటికి వచ్చింది. డెలివరీ తర్వాత మూడు నెలల అక్కడే ఉంది. తర్వాత అత్తగారింటికి వెళ్ళింది. తను వెళ్ళే సరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. కిరాణా షాపుపై పూర్తి ఆధిపత్యం వాళ్ళ తోడికోడలు తీసుకుంది. మిర్చి మిషన్ అమ్మేశారు. వచ్చిన డబ్బులతో భర్త కార్పెంటర్ మిషన్ తీసుకున్నాడు.
‘నాకు చెప్పకుండా ఇలా చేశారేంటి’ అని అడిగితే ‘నీకెందుకు చెప్పాలి? నేను నీ మిషన్ అమ్మేసి వర్క్ చేసుకుంటాను. అన్నయ్యకు కూడా పని లేదు. వదినా, పిల్లలు ఎలా బతుకుతారు. అందుకే షాపు వాళ్ళకు ఇచ్చేశాను. షాపులో మందు అమ్మమంటే అమ్మడం లేదు. కానీ వదిన అలా కాదు. సరుకులతో పాటు మందు కూడా అమ్ముతుంది. ఎక్కువ డబ్బులు వస్తున్నాయి’ అన్నాడు. దానికి ఆమె ‘మరి ఇప్పుడు నేనేం చేయాలి. మనకూ ఇప్పుడు బాబు ఉన్నాడు. వాడి భవిష్యత్ గురించి ఆలోచించరా’ అంటే ‘నీకు పొలం పనులు కూడా వస్తాయిగా, నువ్వు ఆ పనులకు వెళ్ళు’ అన్నాడు.
బాబు చిన్నగా ఉన్నాడని ఇక సునీత ఏం మాట్లాడలేదు. ఏడాది తర్వాత కుట్టు పనులు నేర్చుకుని మిషన్ తెచ్చుకుంది. బట్టలు కుట్టడం మొదలుపెట్టింది. కానీ ఆమె ఇంట్లో ఉండటం, భర్తకు, తోడి కోడలికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఎప్పుడు ఏదో ఒక విషయానికి గొడవ పెట్టుకుంటారు. భర్త అయితే కొట్టడం ప్రారంభించాడు. అనవసరంగా తిట్టడం, మీ అమ్మ దగ్గరకు వెళ్ళి డబ్బులు తీసుకురా, బంగారం తీసుకురా అంటూ గొడవలు చేసేవారు. చివరకు కొట్టి పుట్టింటికి పంపించేశారు. సునీత తల్లి వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి లక్ష రూపాయలు తీసుకువచ్చి ఇచ్చింది. ఇలా 4, 5 సార్లు జరిగింది. చివరకు పెద్ద మనుషుల్లో పంచాయితీ కూడా పెట్టించింది.
వాళ్ళ ముందు ‘ఇక పై అలా చెయ్యను’ అనేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే చేసేవాడు. వాళ్ళు కూడా అతని ప్రవర్తనతో విసిగిపోయారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయమన్నారు. కానీ సునీత ఆ పని చేయలేకపోయింది. అసలు భర్త ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో ఆమెకు చాలా రోజులు అర్థం కాలేదు. తన భర్తా, తోడి కోడలు ఎప్పుడూ సరదాగా మాట్లాడుకునే వారు. సునీత పెద్దగా పట్టించుకోలేదు. వాళ్లిద్దరూ మొదటి నుంచి ఒక్కటే స్కూల్, ఒక్కటే కాలేజీ, ఒకే క్లాస్. అందుకే అంత చనువుగా ఉంటారు అనుకునేది. కానీ ఒక రోజు ‘నువ్వు ఇంట్లో బట్టలు కుట్టడానికి వీలు లేదు. మిషన్ సౌండ్‌కి, ఇంటికి వచ్చే వారితో చాలా ఇబ్బందిగా ఉంది అని’ గొడవ చేశారు.
‘మిషన్ కోసం కరెంటు ఉపయోగిస్తాను. కాబట్టి సౌండ్ రాదు. బట్టలు తీసుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా మధ్యాహ్నం వస్తారు. వాళ్ళతో ఈయనకు ఇబ్బంది ఏంటో తెలీదు. ఒక రోజు లైనింగ్ కోసం నేను బయటకు వెళ్ళాను. వచ్చే సరికి ఇంట్లో మా ఆయన్ని, వాళ్ళ వదినను చూడకూడని స్థితిలో చూశాను. ఎందుకిలా చేశారని అడిగితే విపరీతంగా కొట్టారు. ‘నువ్వు నాకు అవసరం లేదు పో’ అన్నాడు. వాళ్ళ ఇద్దరి మధ్య వున్న సంబంధం ఇంట్లో అందరికీ తెలుసు. నాకూ ఎలాగో తెలిసిపోయింది కదా అని ‘మా వదినతో నేను ఇలాగే ఉంటాను. నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండు, లేదంటే పో’ అన్నాడు.
దాంతో సునీత పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టింది. వదినకు, మరిదికి సంబంధం పెట్టి తప్పుగా మాట్లాడుతుందని అక్కడ నమ్మించారు. ఆమెకు పిచ్చి పట్టిందని, ఆస్పత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించాలని నిర్ణయించారు. భర్త, కుటుంబ సభ్యులు కొట్టడం, తిట్టడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను పుట్టింట్లో వదిలేశారు. డాక్టరు పరీక్షలు చేసి ‘ఈమె మానసిక పరిస్థితి బాగాలేదు. దేని గురించో బాగా ఆలోచిస్తుంది. కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది’ అన్నాడు. ఇదే మంచి అవకాశం అని భర్త ఆమెను వదిలేసి ఊరికి వెళ్ళిపోయాడు. అంతే తిరిగి రాలేదు.
సునీత పరిస్థితి మరింతగా క్షీణించింది. డాక్టర్లు మానసిక వైద్యులకు చూపించాలన్నారు. అదే విషయం భర్తకు చెబితే ‘ఆమె పిచ్చిది అందుకే అలా చెప్పారు. మీరు చూయించుకుంటే చూపించుకోండి. నేను మాత్రం రాను’ అన్నాడు. తల్లే సునీతకు చికిత్స చేయిస్తూ ఓ చిన్న పిల్లలా చూసుకుంటుంది. ఒంటిపైన బట్టలు ఉన్నాయో, లేదో కూడా తెలిసేది కాదు. తల్లి పనికి వెళుతూ సునీతను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళేది. ఆమె పరిస్థితి తెలిసిన మిల్లు యజమానులు, తోటి ఉద్యోగులు సాయంగా ఉన్నారు. అందులో ఒకరి ద్వారా ఐద్వా గురించి చెప్పడంతో సునీతను తీసుకుని తల్లి మా దగ్గరకు వచ్చింది.
సునీత మాత్రం ‘నాకు నా భర్త కావాలి, బాబు కావాలి ఇంక ఏమీ వద్దు’ అంటుంది. ‘డాక్టర్లతో కూడా పదే పదే ఇదే చెబుతుంది. వాళ్ళు ముందులు వాడితే మళ్ళీ మామూలు పనికి అవుతుందని చెప్పారు’ అని తల్లి చెప్పింది.
మేము సునీతతో నీవు ప్రతి రోజు మందులు వేసుకుంటే నీ భర్తను, నీ బాబును నీ దగ్గరకు తీసుకువస్తామని చెప్పాం. మధ్య మధ్యలో సునీత వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడాం. ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగు పడిన తర్వాత సునీతను ఆఫీసుకు పిలిచాం. అప్పుడు జరిగింది మొత్తం తనే చెప్పింది.
మేము సునీత భర్తను పిలిస్తే రాలేదు. ‘ఆమె పిచ్చిది, ఆమె చెప్పిన మాటలు మీరు ఎలా నమ్ముతారు. నేను రాను మేడం’ అంటూ ఎన్ని సార్లు పిలిచినా రాలేదు. ఇక లాభం లేదని ఆ ఊరి సర్పంచ్‌కి ఫోన్ చేశాం. ‘వాడు మేం చెప్పినా వినడం లేదు. మీరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోండి’ అని చెప్పారు. మేము వెంటనే పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి విషయం చెప్పాము. సునీతతో ‘నీ గురించి పట్టించుకోని వాడి గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు. అతను నిన్ను వదిలేసి దాదాపుగా ఆరేండ్లు అవుతుంది. నీ బాబు కూడా నిన్ను మర్చిపోయాడు. బాబుతో మాట్లాడి నీతో పంపించే ప్రయత్నం చేస్తాం’ అని చెప్పాం. దానికి సునీత కూడా అంగీకరించింది.
స్థానిక ఐద్వా వాళ్ళ సహాయంతో పోలీసులలో మాట్లాడి బాబును సునీతతో పంపించాం. కానీ బాబు వాళ్ళ అమ్మను పూర్తిగా మరిచిపోయాడు. ఆమెతో ఉండటానికి ఇష్టపడటం లేదు. దాంతో పదిహేను రోజుల తర్వాత బాబును తండ్రితో పంపించాం. ఇక సునీత భర్తతో మాట్లాడి పెండ్లిలో పెట్టిన బంగారం, కట్నంతో పాటుగా 5 లక్షల రూపాయలు ఇప్పించాం. అతని నుండి విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఆమె తిరిగి చదువుకోవడం మొదలుపెట్టింది.
– వై. వరలక్ష్మి, 9948794051