ఉక్రెయిన్‌లో రెచ్చిపోతున్న కిరాయి మూకలు!

అమెరికా, నాటో బాధిత దేశాలకు చెందిన వారు, చెచెన్‌ ఇతర తీవ్రవాదులతో పని చేసి తరువాత విబేధించిన వారు ఉక్రెయిన్‌ మిలిటరీ దాడులకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రాంతాలైన డాన్‌బాస్‌ ప్రాంతంలో జనానికి మద్దతుగా పోరు సాగిస్తున్నట్లు వార్తలు. మధ్య ప్రాచ్యం, మధ్య ఆసియా దేశాలకు చెందిన 16వేల మంది వలంటీర్లు తమ తరఫున పోరాడేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు గతంలో రష్యన్‌ రక్షణ మంత్రి సెర్గీ షొయిగు చెప్పాడు. కిరాయి మూకల గురించి ఉక్రెయిన్‌ బహిరంగం గానే చెబుతున్నది.
అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి కుట్రలను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్యకు గురువారం నాటితో నాలుగు వందల రోజులు నిండాయి. గత కొద్ది నెలలుగా బెక్స్‌మట్‌ పట్టణం వద్ద కేంద్రీకృతమైన పోరులో పుతిన్‌ దళాలు కొంత మేర విజయం సాధించినట్లు ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారి అంగీకరించాడు. మరోవైపున రష్యా మరింతగా ఒత్తిడి పెంచుతోంది, దానిలో భాగంగా మిలిటరీ వార్షిక విజయోత్సవం సందర్భంగా ఖండాంతర క్షిపణులతో సైనిక విన్యాసాలు జరపనున్నట్లు రక్షణశాఖ ప్రకటించింది. పన్నెండు వేల కిలోమీటర్ల పరిధిలో ప్రత్యర్థి క్షిపణులను తప్పించుకోగలిగిన యార్స్‌ ఖండాంతర క్షిపణి వ్యవస్థలతో మూడు ప్రాంతాల్లో విన్యాసాలు జరపనుంది. ఇది నాటో కూటమి దుస్సాహసాన్ని ఎదుర్కోగలమని చెప్పటంతో పాటు తమ సైనిక పాటవాన్ని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించటమే. చైనా ప్రతిపాదించిన శాంతి పథకానికి పుతిన్‌ వైపు నుంచి వచ్చిన సానుకూలత తప్ప జెలెనెస్కీ నోరు మెదపటం లేదు. దీన్ని బట్టి దీర్ఘకాలం ఈ సంక్షోభాన్ని కొనసాగించాలన్న నాటో కూటమి దుష్ట పథకాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఉక్రెయిన్‌ సంక్షోభంలో పశ్చిమ దేశాలు తమ మిలిటరీని దించకుండా కిరాయి మూకలకు అస్త్ర శస్త్రాలను అందించి పుతిన్‌ సేనల మీద దాడులు లేదా ఎదుర్కోనేట్లు చూస్తున్నాయి. ఉగ్రవాదం మీద పోరు అంటూ ఫోజులు పెడుతున్న ఈ కూటమి నిజస్వరూపం రోజు రోజుకూ బట్టబయలు అవుతున్నది. ఇప్పటి వరకు పశ్చిమాసియాలోని సిరియా ప్రభుత్వం మీద దాడులకు ఐసిస్‌, ఆల్‌ఖైదా పేరుతో పని చేస్తున్న కిరాయిమూకలలో భాగమైన చెచెన్లతో ఉక్రెయిన్‌ ఒప్పందం చేసుకొని వారికి ఇప్పుడు శిక్షణ ఇస్తున్నది. ఇప్పటికే పలు ముసుగు పేర్లతో 34దేశాలకు చెందిన మూకలు రష్యా మిలిటరీని ఎదుర్కొంటున్నాయి. ఉక్రెయిన్‌ భూ భాగాన్ని పరిరక్షించేందుకు ఏర్పడిన అంతర్జాతీయ దళం పేరుతో ఏర్పడిన సంస్థ ద్వారా పోరాడేందుకు 52దేశాలకు చెందిన ఇరవై వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు మార్చినెల ఆరవ తేదీన ఉక్రెయిన్‌ అధికారికంగా ప్రకటించింది. నిజానికి గత ఏడాది కాలంలో వివిధ దేశాలకు చెందిన వేలాది ఇప్పటికే రంగంలో ఉన్నారు. చెచెన్‌ మూకలతో ఒప్పందం రానున్న రోజుల్లో మరిన్ని దేశాల నుంచి భారీ ఎత్తున అలాంటి శక్తులు వచ్చేందుకు ప్రోత్సహిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. పరాయిగడ్డ మీద ఇతర దేశాల కోసం జరిపే దాడుల్లో తమ సైనికులు ప్రాణాలు పోగొట్టుకోవటాన్ని అమెరికన్లు సహించటం లేదు, తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్నది. అందువలన ఇలాంటి కిరాయి బాపతును రోజుకు ఎక్కువగా రంగంలోకి దించుతున్నది.
ఉక్రెయిన్‌ మిలిటరీ, దానితో కలసి దాడులకు పాల్పడుతున్న కిరాయిమూకలకు ఏడాది కాలంలో అమెరికా ఇప్పటి వరకు వంద బిలియన్‌ డాలర్ల మేర ఆయుధాలు లేదా నగదు అందించిందని అంచనా. వలంటీర్ల పేరుతో అమెరికా నుంచి కూడా శ్వేతజాతి దురహంకారశక్తులు ఉక్రెయిన్‌లో పనిచేస్తున్నట్లు వారికి ఏడాదికి 75వేల నుంచి లక్ష డాలర్ల వరకు చెల్లిస్తున్నట్లు వార్తలు. మార్చి 26న న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక అలాంటి వారిలో కొందరి గురించి వివరాలు ఇచ్చింది. సామ్రాజ్యవాదుల చరిత్రను చూసినపుడు ఇలాంటి కిరాయి మూకలను ఇతర దేశాలను ఆక్రమించేందుకు పంపిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌, డచ్‌ పాలకులు అలాంటి మూకలను భారత్‌, ఇతర దేశాలకు పంపి దాడులు చేయించారు. వర్తమాన చరిత్రలో బ్రిటన్‌ తన అవసరాల కోసం, తరువాత అమెరికా సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా సీఐఏ ద్వారా ముస్లిం దేశాల్లో తాలిబాన్లు, ఆల్‌ఖైదా వంటిి దళాలను ఏర్పాటు చేసిన ఉదంతాల గురించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో అలాంటి మూకలను కూడగట్టటంలో అమెరికా, బ్రిటన్‌ తలమునకలుగా ఉన్నాయి.

ఇదే సమయంలో అమెరికా, నాటో బాధిత దేశాలకు చెందిన వారు, చెచెన్‌ ఇతర తీవ్రవాదులతో పని చేసి తరువాత విబేధించిన వారు ఉక్రెయిన్‌ మిలిటరీ దాడులకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రాంతాలైన డాన్‌బాస్‌ ప్రాంతంలో జనానికి మద్దతుగా పోరు సాగిస్తున్నట్లు వార్తలు. మధ్య ప్రాచ్యం, మధ్య ఆసియా దేశాలకు చెందిన 16వేల మంది వలంటీర్లు తమ తరఫున పోరాడేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు గతంలో రష్యన్‌ రక్షణ మంత్రి సెర్గీ షొయిగు చెప్పాడు. కిరాయి మూకల గురించి ఉక్రెయిన్‌ బహిరంగం గానే చెబుతున్నది. అందువలన డబ్బుకోసం గాక స్వచ్ఛందంగా డాన్‌బాస్‌ ప్రాంతంలో జనం కోసం పోరాడేందుకు వచ్చేవారికి సాయపడాల్సి ఉందని పుతిన్‌ కూడా చెప్పాడు. ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పే అమెరికా కిరాయి బాపతును సమీకరించేందుకు అమెరికన్లకు స్వేచ్ఛనిచ్చింది. జర్మనీ వంటి కొన్ని ఐరోపా దేశాలు స్వయంగా విధించుకున్న నిబంధనల ప్రకారం సదరు దేశాల పౌరులు కిరాయికి పని చేయటం లేదా సమీకరించటం చట్టరీత్యా నిషిద్దం. అయితే అదే జర్మన్లు ఉక్రెయిన్‌ను పని చేస్తున్న మూకల పట్ల ఎలాంటి అభ్యం తరాలు పెట్టకపోగా అవసరమైన ఆర్థికసాయం అందిస్తున్నది.
ప్రస్తుతం సామ్రాజ్యవాదులు కిరాయి మూకలతో పాటు ప్రయివేటు మిలిటరీ సేవలు అందించే సంస్థలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికీ అనేక దేశాలో అలాంటి వాటిని ముందుకు తీసుకువచ్చి తమ ప్రయోజనాలకు వినియోగించు కుంటున్నారు. ఇదొక ప్రమాదకర క్రీడ. దాన్ని కొనసాగిస్తున్న సామ్రాజ్యవాద, మతశక్తుల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి.’

Spread the love